హైదరాబాద్, ఫిబ్రవరి 10 (నమస్తే తెలంగాణ) : రాష్ట్రంలో మున్సిపాలిటీలు, మున్సిపల్ కార్పొరేషన్ల సాధారణ ఎన్నికల నేపథ్యంలో బుధవారం రాష్ట్రవ్యాప్తంగా వేతనంతో కూడిన సెలవును ప్రభుత్వం ప్రకటించింది. ఓటర్లు తమ ఓటుహకును వినియోగించుకునేందుకు వీలుగా పోలింగ్ రోజును పెయిడ్ హాలిడేగా ప్రకటిస్తూ కార్మికశాఖ ప్రత్యేక ఉత్తర్వులు జారీ చేసింది.
ఎన్నికలు జరిగే మున్సిపాలిటీలు, కార్పొరేషన్ల పరిధిలోని అన్ని ఫ్యాక్టరీలు, దుకాణాలు, వాణిజ్య, పారిశ్రామిక సంస్థల్లో పనిచేసే కార్మికులు, ఉద్యోగులందరికీ ఈ సెలవు వర్తించనున్నట్టు తెలిపింది. తెలంగాణ ఫ్యాక్టరీస్ అండ్ ఎస్టాబ్లిష్మెంట్స్ యాక్ట్(1974), తెలంగాణ షాప్స్ అండ్ ఎస్టాబ్లిష్మెంట్స్ యాక్ట్ (1988) ప్రకారం ఈ నిర్ణయం తీసుకున్నట్టు స్పెషల్ చీఫ్ సెక్రటరీ దానకిశోర్ ఉత్తర్వుల్లో పేర్కొన్నారు. ఈ ఉత్తర్వులను కచ్చితంగా అమలుచేయాలని లేబర్ కమిషనర్, ఫ్యాక్టరీల డైరెక్టర్, కలెక్టర్లను ప్రభుత్వం ఆదేశించింది.