Meaty Rice | న్యూఢిల్లీ, జూన్ 17: మాంసపు బియ్యం ఏంటి అనుకొంటున్నారా? ప్రయోగశాలలో అభివృద్ధి చేసిన గోవు మాంస కణాల్ని బియ్యం గింజల్లోకి ఇంజెక్ట్ చేసి.. సరికొత్త బలవర్ధకమైన ఆహారాన్ని దక్షిణ కొరియా సైంటిస్టులు సృష్టించారు. సాధారణ బియ్యంలో ఉండే దానికన్నా 8 శాతం ఎక్కువ ప్రొటీన్, 7 శాతం ఎక్కువ కొవ్వు కలిగివుండే ‘మీటీ రైస్’ (హైబ్రిడ్ రకం)ను తయారుచేశారు. ‘మీటీ రైస్’ పర్యావరణ హితమైందని సైంటిస్టుల బృందానికి నేతృత్వం వహించిన ప్రొఫెసర్ హాంగ్ జిన్-కీ చెప్పారు.
ఇతర సాధారణ బియ్యం మాదిరే ‘మీటీ రైస్’ ఉంటాయని, కాకపోతే గులాబీ రంగులో కనిపిస్తూ, మంచి వాసన కలిగివుంటాయని ఆయన అన్నారు. ‘జంతువుల్ని వధించకుండా, వాటి కణ జాలాన్ని ల్యాబ్‌లో అభివృద్ధి చేశాం. జంతు ప్రొటీన్‌ను పొందేందుకు మార్గాన్ని కనుగొన్నాం’ అని హాంగ్ జిన్-కీ అన్నారు. అంతరిక్షంలోకి వెళ్లే వ్యోమగాములకు, కరువు కాటకాల్లో సంభవించే పౌష్టికాహార సమస్యను ఇది పరిష్కరిస్తుందని చెప్పారు