హామిల్టన్: మహిళల వన్డే ప్రపంచకప్‌లో దక్షిణాఫ్రికా జోరు కొనసాగుతున్నది. మెగాటోర్నీలో అజేయంగా సాగుతున్న సఫారీ జట్టు వరుసగా నాలుగో విజయాన్ని ఖాతాలో వేసుకుంది. గురువారం చివరి ఓవర్ వరకు ఉత్కంఠభరితంగా సాగిన పోరులో దక్షిణాఫ్రికా 2 వికెట్ల తేడాతో న్యూజిలాండ్‌ను చిత్తు చేసింది. మొదట బ్యాటింగ్ చేసిన న్యూజిలాండ్ 47.5 ఓవర్లలో 228 పరుగులకు ఆలౌటైంది. కెప్టెన్ సోఫియా డివైన్ (93) చక్కటి ఇన్నింగ్స్‌తో ఆకట్టుకుంది. సఫారీ బౌలర్లలో షబ్నమ్, ఖాకా చెరో మూడు వికెట్లు పడగొట్టారు. అనంతరం లక్ష్యఛేదనలో దక్షిణాఫ్రికా 49.3 ఓవర్లలో 8 వికెట్లు కోల్పోయి 229 పరుగులు చేసింది. వాల్వర్ట్ (67), సునె లుస్ (51) అర్ధశతకాలతో రాణించారు. మరీనె కాప్ (2/44; 34 నాటౌట్)కు ‘ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్’ అవార్డు దక్కింది.