న్యూఢిల్లీ : కరోనా రెండో దశ కాస్త తగ్గుముఖం పడుతున్నది. మరికొద్ది రోజుల్లో థర్డ్ వేవ్ పొంచి ఉందని, ఈ దశలో ఇందులో చిన్నారులపై తీవ్ర ప్రభావం చూపే అవకాశం ఉందని ఊహాగాలున్నాయి. మహమ్మారిని కట్టడి చేసేందుకు టీకానే మార్గమని నిపుణులు స్పష్టం చేస్తున్నారు. ఈ క్రమంలో రాబోయే కొద్ది రోజుల్లో దేశంలో పిల్లలకు కొవిడ్ టీకా అందుబాటులోకి రానున్నది. జైడస్ క్యాడిలా తయారు చేసిన జైకోవ్-డీ వ్యాక్సిన్‌కు త్వరలోనే డ్రగ్ కంట్రోల్ జనరల్ ఆఫ్ ఇండియా (డీసీజీఐ) అనుమతి ఇవ్వనున్నట్లు భావిస్తున్నారు.
ఇప్పటికే ట్రయల్స్ పూర్తి చేసి, డేటాను డీసీజీఐకి సమర్పించడంతో పాటు అత్యవసర వినియోగానికి అనుమతి కోరింది. ఔషధ నియంత్రణ సంస్థ ఆమోదం పొందిన వెంటనే టీకాల పంపిణీ ప్రారంభంకానుంది. ప్రస్తుతం దేశంలో 18 సంవత్సరాల కంటే తక్కువ వయసున్న పిల్లలకు టీకాలు అందుబాటులో లేవు. జైడస్ క్యాడిలా 12-18 సంవత్సరాల మధ్య పిల్లలకు టీకాను సిద్ధం చేసి, ట్రయల్స్ నిర్వహించింది. అయితే, కొవిడ్ వర్కింగ్ గ్రూప్ చైర్మన్ డాక్టర్ ఎన్కే ఆరోరా ప్రకారం.. ఈ నెల చివరి వరకు టీకాల పంపిణీ ప్రారంభం అవుతుందని అంచనా.
ఈ వ్యాక్సిన్ అనంతరం మరొకటి సైతం అందుబాటులోకి వస్తుందని పేర్కొన్నారు. ఇది 2-12 సంవత్సరాల మధ్య పిల్లలకు వేయనున్నారు. కేంద్ర ఆరోగ్యమంత్రిత్వ శాఖ ప్రకారం.. 18 సంవత్సరాల కంటే ఎక్కువ వయసున్న పిల్లలు 95 కోట్ల మంది ఉన్నారు. 0-18 సంవత్సరాల మధ్య వయస్సు 35 కోట్ల మంది పిల్లలు ఉన్నారు. టీకాల పంపిణీ కార్యక్రమాన్ని ఈ ఏడాది డిసెంబర్ నాటికి ముగించాలని కేంద్రం భావిస్తోంది. పిల్లల వ్యాక్సిన్ సరఫరా.. 18 ఏళ్లు పైబడిన వారికి ఇచ్చే వ్యాక్సిన్ నిరంతరం పెంచుతున్నట్లు కేంద్ర ఆరోగ్యమంత్రిత్వ శాఖ వర్గాలు పేర్కొన్నాయి.