బెంగుళూరు: కర్నాటకలోని చిత్రదుర్గ్‌లో ఉన్న శ్రీ మురుగరాజేంద్ర మఠాన్ని ఇవాళ కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ సందర్శించారు. లింగాయత్ వర్గానికి చెందిన ఆ మఠంలో రాహుల్‌కు స్వాగతం లభించింది. ఈ మఠానికి వచ్చిన వాళ్లకు దీవెనలు అందుతాయని, రాహుల్ గాంధీ భవిష్యత్తులో ప్రధాని అవుతారని ఆ మఠ పెద్ద డాక్టర్ శ్రీ శివమూర్తి మురుగ శరణన్నారు తెలిపారు. కాంగ్రెస్ నేత రాహుల్ శ్రీశివమూర్తి నుంచి లింగదీక్ష తీసుకున్నారు. ఆ తర్వాత రాహుల్ మాట్లాడుతూ.. గత కొంత కాలం నుంచి బసవన్న గురించి చదువుతున్నాని, ఆయన విషయాలను ఫాలోఅవుతున్నట్లు చెప్పారు. ఈ మఠానికి రావడం గర్వంగా ఫీలవుతున్నట్లు రాహుల్ తెలిపారు. అయితే ఇష్టలింగ, శివయోగ గురించి వివరంగా నేర్పేవాళ్లు కావాలని కాంగ్రెస్ నేత అన్నారు. దాని నుంచి బహుశా తాను లాభపడే అవకాశాలు ఉన్నట్లు పేర్కొన్నారు. కర్నాటక జనాభాలో 17 శాతం మంది లింగాయత్‌లే ఉన్న విషయం తెలిసిందే.