అహ్మదాబాద్: రికార్డు స్థాయిలో దేశానికి ఐదో అండర్-19 ప్రపంచకప్ అందించిన యువ భారత జట్టును.. బుధవారం బీసీసీఐ ఘనంగా సన్మానించింది. విండీస్ నుంచి మంగళవారమే స్వదేశానికి చేరిన ఆటగాళ్లను.. భారత్, వెస్టిండీస్ మధ్య రెండో వన్డే జరుగుతున్న నరేంద్రమోదీ స్టేడియంలో బుధవారం సత్కరించింది. ఈ కార్యక్రమంలో ప్లేయర్లతో పాటు అండర్-19 కోచ్ హృషికేశ్ కనిత్కర్, జాతీయ క్రికెట్ అకాడమీ (ఎన్సీఏ) చీఫ్ వీవీఎస్ లక్ష్మణ్, బీసీసీఐ కార్యదర్శి జై షా, కోశాధికారి అరుణ్ ధుమాల్ పాల్గొన్నారు. అనంతరం యువ ఆటగాళ్లంతా స్టాండ్స్ నుంచి తమ ఆరాధ్య క్రికెటర్ల ఆట చూసి ఆనందించారు. బయోబబుల్ కారణంగా సీనియర్ జట్టుతో కలిసే వీలు లేకపోగా.. గురువారం ఆటగాళ్లు స్వస్థలాలకు చేరనున్నారు.