ఘట్కేసర్ రూరల్, జనవరి 8 : అదృశ్యమైన సాఫ్ట్వేర్ ఉద్యోగి శవాన్ని గుర్తించేందుకు చెరువులో గాలింపు చర్యలు చేపట్టిన సంఘటన ఘట్కేసర్ పరిధిలో శనివారం చోటు చేసుకుంది. ఇన్స్పెక్టర్ ఎన్.చంద్రబాబు కథనం ప్రకారం.. ఘట్కేసర్ మున్సిపాలిటీ… కొండాపూర్‌కు చెందిన కొత్త మోహన్ రావు, విజయలక్ష్మి దంపతుల కుమారుడు నరేశ్(32) సాఫ్ట్వేర్ ఉద్యోగి. కాగా శుక్రవారం సాయంత్రం పని ఉందని చెప్పి ఇంట్లో నుంచి వెళ్లి తిరిగి రాలేదు. ఫోన్ చేయగా ఇంట్లోనే ఉండటంతో చుట్టుప్రక్కల వెతికారు. శనివారం ఉదయం స్థానికంగా ఉన్న మంగలోనికుంట చెరువు వద్ద నరేశ్ తీసుకువెళ్లిన హోండా యాక్టివా వాహనం, చెప్పులు, కళ్లద్దాలు ఉన్నట్లు గుర్తించిన స్థానికుల సమాచారంతో కుటుంబ సభ్యు లు అక్కడికి చేరుకొని గుర్తించారు. సంఘటన స్థలానికి చేరుకున్న పోలీసులు గజ ఈతగాళ్లు, ఫైర్ సిబ్బందితో గాలింపు చేపట్టారు. శనివారం రాత్రి నిర్వహించిన గాలింపు చర్యల్లో ఎలాంటి ఆధారాలు లభించలేదు. మంగలోనికుంట చెరువులో దూకి ఆత్మహత్యకు పాల్పడి ఉంటాడని పోలీసులు అనుమానిస్తున్నారు. కుటుంబ సభ్యులు ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు.