హైదరాబాద్, అక్టోబర్ 20 (నమస్తే తెలంగాణ): హైకోర్టు ఆదేశాలతో రాష్ట్రంలోని గురుకులాలన్నీ గురువారం నుంచి తెరుచుకోనున్నాయి. తద్వారా నాలుగున్నర లక్షల మంది విద్యార్థులకు ప్రయోజనం చేకూరనున్నది. రాష్ట్రవ్యాప్తంగా గురుకుల పాఠశాలలు, గురుకుల కాలేజీలను తిరిగి ప్రారంభించేందుకు హైకోర్టు అనుమతించింది. కొవిడ్ వ్యాప్తి నేపథ్యంలో గురుకులాలతోపాటు వసతిగృహాలను తెరవొద్దని ఇచ్చిన మధ్యంతర ఉత్తర్వులను సవరిస్తూ ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ సతీశ్ చంద్రశర్మ, న్యాయమూర్తి జస్టిస్ ఏ రాజశేఖర్‌రెడ్డితో కూడిన ధర్మాసనం బుధవారం ఉత్తర్వులు జారీచేసింది. కరోనా కట్టడికి తెలంగాణ ప్రభుత్వం తీసుకుంటున్న చర్యలను ధర్మాసనం కొనియాడింది. ఇతర రాష్ట్రాలతో పోలిస్తే తెలంగాణ ప్రభుత్వం తీసుకున్న చర్యలు అభినందనీయమని వ్యాఖ్యానించింది. కర్ణాటక, కేరళ వంటి రాష్ట్రాలతో పోలిస్తే తెలంగాణలో పరిస్థితులు, ప్రభుత్వం తీసుకుంటున్న చర్యలు చాలా బాగున్నాయని కొనియాడింది. పరిస్థితులను బేరీజు వేస్తే ఇకడి పరిస్థితి చాలా మెరుగ్గా ఉందని చెప్పింది. పిల్లలందరికీ వ్యాక్సినేషన్ అయ్యే వరకూ భౌతికంగా తరగతులు నిర్వహించకుండా చూడాలన్న వాదనను తోసిపుచ్చింది. గురుకులాలు తెరకపోవతే ప్రధానంగా ఎస్టీ, ఎస్సీ, బీసీ తరగతుల విద్యార్థులు ఎకువగా నష్టపోతారని, ఉన్నత ప్రమాణాలతో కూడిన విద్యతోపాటు పౌష్టికాహారాన్ని వారు కోల్పోతున్నారని, గురుకులాలను ప్రారంభించేందుకు అనుమతించాలని ప్రభుత్వం చేసిన అభ్యర్థనను ధర్మాసనం ఆమోదించింది. తొలుత ప్రభుత్వం తరఫున అడ్వొకేట్ జనరల్ బీఎస్ ప్రసాద్ వాదనలు వినిపిస్తూ, గురుకుల పాఠశాలలు/కాలేజీలు మినహా మిగిలిన విద్యాసంస్థల్లో భౌతిక, ఆన్లైన్ విధానంలో తరగతులు ప్రారంభమయ్యాయని, ఇందుకు గతంలోనే హైకోర్టు అనుమతి ఇచ్చిందని గుర్తుచేశారు. విద్యాసంస్థల్లో కరోనా నివారణ జాగ్రత్తలు తీసుకుంటున్నారని, కరోనా మార్గదర్శకాలను అమలుచేస్తున్నామని పేర్కొన్నారు. గురుకులాలు, వాటి అనుబంధ వసతిగృహాల్లో ప్రత్యక్ష విద్యాబోధనకు అనుమతి ఇవ్వాలని కోరారు. వాదనలు విన్న హైకోర్టు.. గురుకుల పాఠశాలలు, కాలేజీలను తిరిగి ప్రారంభించేందుకు అనుమతించింది. తదుపరి విచారణను నవంబర్ 29కి వాయిదా వేసింది. హైకోర్టు తీర్పు నేపథ్యంలో బుధవారమే బీసీ గురుకులాల విద్యాలయాలు ప్రారంభమయ్యాయి. ఎస్సీ గురుకుల విద్యాలయాలు గురువారం నుంచి మొదలుకానున్నట్టు సొసైటీ అధికారులు వెల్లడించారు.
విద్యాసంస్థలు సంఖ్య