బెంగళూరు, మార్చి 17/(స్పెషల్ టాస్క్ బ్యూరో ) : గ్యారెంటీల ఆశ చూపించి మూడు రాష్ట్రాల్లో అధికార పగ్గాలు చేపట్టిన కాంగ్రెస్ పార్టీ ఆ రాష్ర్టాలను అప్పుల ఊబిలో ముంచుతున్నది. హస్తం పార్టీ అధికారంలో ఉన్న హిమాచల్ ప్రదేశ్ ఇప్పటికే దివాలా అంచుకు చేరుకోగా తాజాగా ఈ జాబితాలో కర్ణాటక, తెలంగాణ కూడా చేరాయి. కర్ణాటకలో సిద్ధరామయ్య సర్కారు గ్యారెంటీల అమలు కోసమంటూ ఎడాపెడా చేస్తున్న అప్పులు, తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి తాజాగా అప్పులపై చేసిన వ్యాఖ్యలే దీనికి నిదర్శనం. కాగా ఐదు గ్యారెంటీల పేరిట తీసుకొచ్చిన ఉచిత పథకాలను కొనసాగించడం కోసం కర్ణాటకలోని సిద్ధరామయ్య ప్రభుత్వం అప్పుల మీద అప్పులు చేస్తుండటంపై ఇన్ఫోసిస్ మాజీ సీఎఫ్‌వో మోహన్‌దాస్ పాయ్ తీవ్రస్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ మేరకు కర్ణాటక కాంగ్రెస్ ప్రభుత్వ విధానాలను ‘ఎక్స్’ వేదికగా తూర్పారబట్టారు.
తెలంగాణ ఆర్థిక స్థితి బలహీనంగా ఉన్నదని, ప్రభుత్వ ఉద్యోగులకు ఒకటో తేదీన జీతాలు చెల్లించడానికి కూడా ఇబ్బందులు పడాల్సి వస్తున్నదని అసెంబ్లీ సాక్షిగా తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి ఇటీవల కీలక వ్యాఖ్యలు చేశారు. డీఏ చెల్లింపులపై పట్టుబట్ట వద్దంటూ ఉద్యోగులకు విజ్ఞప్తి చేసిన ఆయన.. ఉద్యోగులకు జీతాలు చెల్లించడం కోసం రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్బీఐ) నుంచి రూ.4 వేల కోట్లను చేబదులుగా రుణం తీసుకున్నట్టు వెల్లడించారు. రేవంత్ వ్యాఖ్యలు జాతీయ స్థాయిలో పెద్దయెత్తున చర్చకు దారితీశాయి. కాంగ్రెస్ హయాంలో తెలంగాణ ఆర్థిక సంక్షోభంలోకి చేరిందంటూ పలువురు విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. దీన్ని ఉటంకిస్తూ జాతీయ మీడియా ‘టైమ్స్ నౌ’ ఓ ప్రత్యేక కథనాన్ని ప్రసారం చేసింది. తెలంగాణ అప్పులు, ఉద్యోగుల వేతనాలు, డీఏ తదితరాలపై రేవంత్ చేసిన వ్యాఖ్యలను విశ్లేషిస్తూ.. హిమాచల్ తరహాలోనే తెలంగాణ కూడా ఆర్థిక సంక్షోభం దిశగా వెళ్తున్నట్టు అభిప్రాయపడింది.
ఈ క్రమంలో అప్పుల గురించి రేవంత్ రెడ్డి వ్యాఖ్యలను ఉటంకిస్తూ ఇన్ఫోసిస్ మాజీ సీఎఫ్‌వో మోహన్‌దాస్ పాయ్ కర్ణాటక కాంగ్రెస్ ప్రభుత్వ తీరును ‘ఎక్స్’ వేదికగా ఎండగట్టారు. ఉద్యోగులకు జీతాలు చెల్లించలేక రూ.4 వేల కోట్లు ఆర్బీఐ నుంచి రుణం తీసుకున్న సంగతిని సీఎం రేవంత్ రెడ్డి బయటపెట్టారని, ఇదే విధంగా భారీగా అప్పులు చేస్తున్న కర్ణాటక కూడా సంక్షోభంలోకి కూరుకుపోతుందని హెచ్చరించారు. ఈ మేరకు సోమవారం ఎక్స్‌లో సుదీర్ఘంగా ఓ పోస్ట్ పెట్టారు. ‘సిద్ధరామయ్య నేతృత్వంలోని కర్ణాటక కాంగ్రెస్ సర్కారు విధానాలు కర్ణాటక భవిష్యత్తును నాశనం చేస్తున్నాయి. 2024-25 ఆర్థిక సంవత్సరంలో రెవెన్యూలోటు రూ. 21,000 కోట్లకు పైగా నమోదవ్వగా, 2025-26 ఆర్థిక సంవత్సరంలోనూ ఇది రూ. 19 వేల కోట్లకు పైగా ఉన్నది. ఉచిత హామీల అమలు కోసమని పెద్దయెత్తున అప్పులు చేస్తున్నారు. గ్యారెంటీల కోసం పన్నుల వాతకు తెగబడుతున్నారు.
ఇది పన్ను చెల్లింపుదారులకు శరాఘాతంలా మారుతున్నది. దీంతో ఉత్పాదకత మందగిస్తున్నది. ఉచిత పథకాలు పేదవారి కోసం ఉద్దేశించినవి తప్ప రాష్ట్రంలోని 60 శాతం జనాభా మొత్తానికి కాదు. గ్యారెంటీ పథకాలు అనర్హులకు కూడా అందుతున్నాయి. అలా జరుగకుండా చూడాల్సిన అవసరమున్నది. ట్రాఫిక్ సమస్య, అస్తవ్యస్తమైన రోడ్లు, గుంతలు, చెత్తతో బెంగళూరు తన మునుపటి ప్రభను కోల్పోతున్నది. ఇలాంటి సమయంలో ఆర్థిక, సంక్షేమ పథకాలపై ప్రభుత్వ పెద్దలు పునరాలోచించాల్సిన అవసరం ఉన్నది. ఉచితాల కోసం వెచ్చిస్తున్న మొత్తాన్ని తగ్గించి ఆ నిధులను ఉపాధి, మౌలిక వసతుల కల్పనకు వెచ్చించాల్సిన సమయం వచ్చింది. మరో రెండు బడ్జెట్లు ప్రవేశపెట్టే నాటికి ప్రస్తుత ప్రభుత్వ కాలపరిమితి ముగుస్తుంది. ఒకవేళ, ఉచితాల పేరిట అప్పులు ఇలాగే కొనసాగితే కర్ణాటక నాశనమవ్వడం ఖాయం. ఇది జరుగకుండా ఉండాలంటే వెంటనే దిద్దుబాటు చర్యలు చేపట్టాలి’ అంటూ పాయ్ హెచ్చరించారు.
కర్ణాటకలాగే హిమాచల్‌ప్రదేశ్‌లోనూ ఎన్నికల్లో ఇచ్చిన హామీలు నెరవేర్చడానికి కాంగ్రెస్ ప్రభుత్వం ఆపసోపాలు పడుతున్నది. గ్యారెంటీల అమలుకు అవసరమైన నిధుల సేకరణకు చివరకు ప్రజలపై ధరల భారం మోపుతున్నది. ఇప్పటికే వివిధ రకాల చార్జీలు పెంచిన సుఖ్విందర్ సుఖు ప్రభుత్వం తాజాగా రాష్ట్రంలో లీటర్ పాల ధరను ఏకంగా రూ.6 పెంచుతున్నట్టు తెలిపింది. ఈ మేరకు సోమవారం శాసనసభలో రాష్ట్ర బడ్జెట్ ప్రవేశపెట్టిన సందర్భంగా ముఖ్యమంత్రి సుఖు ఈ విషయాన్ని వెల్లడించారు. దీంతో లీటరు ఆవు పాల ధర రూ.51కి, గేదె పాల ధర రూ.61కి చేరుకోనుంది. ఇప్పటికే నిత్యావసరాల ధరల పెరుగుదలతో కుదేలైన పేద, మధ్య తరగతి ప్రజలపై తాజా పెంపు మరో అదనపు భారంగా మారిందని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.