పెన్పహాడ్, మార్చి 08 : మహిళల సాధికారతతోనే సమాజ అభివృద్ధి జరుగుతుందని, మహిళలు ఆత్మస్థైర్యంతో అడుగు ముందుకు వేయాలని యాక్షన్ ఫర్ ఇంటిగ్రేటెడ్ డెవలప్మెంట్ సంస్థ పెన్పహాడ్ మండల కమ్యూనిటీ సోషల్ మొబిలైజర్ వగ్గు సోమన్న అన్నారు. బాల్య వివాహాలను నివారిద్దాం 100 రోజుల ప్రచార ఉద్యమంలో భాగంగా ఎయిడ్ సంస్థ ఆధ్వర్యంలో ఆదివారం మండల పరిధిలోని అనాజిపురం మోడల్ స్కూల్ బాలికల హాస్టల్ లో విద్యార్థినులకు బాల్య వివాహాల వల్ల వాటిల్లే శారీరక, మానసిక నష్టాల గురించి అవగాహన కల్పించారు. మహిళా దినోత్సవంను పురస్కరించుకుని సోమన్న మాట్లాడుతూ.. మహిళలు నేడు అన్ని రంగాల్లో అగ్రగాములుగా రాణిస్తూ సమర్థవంతమైన రీతిలో బాధ్యతలు నిర్వహిస్తున్నారని తెలిపారు.
ఒకవైపు కుటుంబ బాధ్యతలు చేపడుతూ మరోవైపు తాము చేస్తున్న ఉద్యోగ, వ్యాపార, సంఘ బాధ్యతలను సైతం ధీటుగా నిర్వహిస్తున్నారని కొనియాడారు. ఈ సందర్భంగా అంకితభావంతో వ్యవహరిస్తూ విధులను ఆదర్శంగా నిర్వహిస్తున్న ఏఎన్ఎం మామిడి లక్ష్మి, వీఓఏ ధనలక్ష్మి, హెడ్ వర్కర్ నూకల నాగమ్మ, వాచ్ ఉమెన్ గ్యార మమతల, సి ఎస్ ఎం సుజాతను పుష్పగుచ్చాలు, శాలువాలతో ఘనంగా సన్మానించి మహిళా దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో ఎయిడ్ ఎన్జీఓ సభ్యురాలు సుజాత పాల్గొన్నారు.