Soaked Raisins Water | ఆయుర్వేద ప్రకారం రోజూ ఉదయాన్నే పరగడుపునే ఏదో ఒక ఆరోగ్యకరమైన ఆహారం లేదా పానీయం తీసుకుంటే ఎన్నో వ్యాధులకు చెక్ పెట్టవచ్చని వైద్యులు చెబుతుంటారు. అందులో భాగంగానే రోజూ ఉదయం కొందరు నిమ్మరసం, తేనె మిశ్రమం తాగితే కొందరు గోరు వెచ్చని నీళ్లను తాగుతారు. ఇంకా కొందరు భిన్నరకాల ఆహారాలను తీసుకుంటారు. అయితే ఉదయం పరగడుపున సేవించాల్సిన పానీయాల్లో కిస్మిస్ నీళ్లు కూడా ఒకటి. కిస్మిస్లను మనం తరచూ అనేక రకాల వంటకాల తయారీలో ఉపయోగిస్తుంటాం. వీటితో తీపి పానీయాలను, స్వీట్లను తయారు చేస్తుంటారు. కిస్మిస్లను నేరుగా కూడా తింటారు. ఇవి ఎంతో రుచిగా ఉంటాయి. అనేక పోషకాలను అందిస్తాయి. అయితే ఆయుర్వేద ప్రకారం ఉదయం పరగడుపునే కిస్మిస్లను నానబెట్టిన నీళ్లను తాగుతుంటే ఎంతో మేలు జరుగుతుందని వైద్యులు చెబుతున్నారు. కిస్మిస్లను రాత్రంతా నీటిలో నానబెట్టి మరుసటి రోజు ఉదయం పరగడుపునే ఆ నీళ్లను తాగి అనంతరం ఆ కిస్మిస్లను తినాల్సి ఉంటుంది. ఇలా రోజూ చేయడం వల్ల అనేక లాభాలు కలుగుతాయి.
కిస్మిస్లను నానబెట్టిన నీళ్లను రోజూ ఉదయం పరగడుపునే సేవిస్తుంటే జీర్ణ వ్యవస్థకు ఎంతో మేలు జరుగుతుంది. ఈ నీళ్లు సహజసిద్ధమైన లాక్సేటివ్గా పనిచేస్తాయి. జీర్ణశక్తిని మెరుగు పరుస్తాయి. ఆహారం సులభంగా జీర్ణం అయ్యేలా చేస్తాయి. మలబద్దకాన్ని తగ్గిస్తాయి. జీర్ణ వ్యవస్థను ఆరోగ్యంగా ఉండేలా చూస్తాయి. ఈ నీళ్లలో ఐరన్ అధికంగా ఉంటుంది. ఇది ఎర్ర రక్త కణాలను ఉత్పత్తి చేస్తుంది. దీని వల్ల రక్తం వృద్ధి చెందుతుంది. రక్తహీనత తగ్గుతుంది. ఐరన్ లోపం సమస్య నుంచి బయట పడవచ్చు. అలాగే నీరసం, అలసట తగ్గిపోతాయి. కిస్మిస్లలో పాలిఫినాల్స్, ఫ్లేవనాయిడ్స్ వంటి యాంటీ ఆక్సిడెంట్లు పెద్ద మొత్తంలో ఉంటాయి. ఇవి ఫ్రీ ర్యాడికల్స్‌ను తొలగిస్తాయి. దీని వల్ల ఆక్సీకరణ ఒత్తిడి, శరీరంలోని వాపులు తగ్గిపోతాయి. శరీరంలోని వ్యర్థాలు బయటకు వెళ్లిపోతాయి. లివర్‌లోని వ్యర్థాలు బయటకు వెళ్లి లివర్ క్లీన్ అవుతుంది. దీంతో లివర్ పనితీరు మెరుగు పడుతుంది. లివర్ వ్యాధులు తగ్గిపోతాయి.
కిస్మిస్లలో పొటాషియం అధికంగా ఉంటుంది. ఇది శరీరంలో సోడియం స్థాయిలను నియంత్రణలో ఉంచుతుంది. బీపీ తగ్గేలా చేస్తుంది. హైబీపీ ఉన్నవారికి ఎంతో మేలు జరుగుతుంది. కిస్మిస్లలో అధికంగా ఉండే యాంటీ ఆక్సిడెంట్లు, ఫైబర్ కారణంగా శరీరంలోని చెడు కొలెస్ట్రాల్ తగ్గుతుంది. మంచి కొలెస్ట్రాల్ పెరుగుతుంది. దీని వల్ల గుండె ఆరోగ్యంగా ఉంటుంది. గుండె జబ్బులు రాకుండా నివారించవచ్చు. కిస్మిస్లలో గ్లూకోజ్, ఫ్రక్టోజ్ వంటి సహజసిద్ధమైన చక్కెరలు ఉంటాయి. అందువల్ల ఈ నీళ్లను తాగితే శరీరానికి తక్షణ శక్తి లభిస్తుంది. ఉదయం నుంచి యాక్టివ్‌గా ఉంటారు. ఉత్సాహంగా పనిచేస్తారు. బద్దకం పోతుంది. నీరసం, అలసట తగ్గుతాయి. రోజంతా శరీర శక్తి స్థాయిలు అధికంగా ఉంటాయి. ముఖ్యంగా బయట తిరిగే వారు, శారీరక శ్రమ చేసేవారు, వ్యాయామం చేసేవారికి ఎంతో మేలు జరుగుతుంది.
కిస్మిస్లలో యాంటీ ఆక్సిడెంట్లు అధిక మొత్తంలో ఉన్న కారణంగా ఫ్రీ ర్యాడికల్స్ తొలగించబడతాయి. దీని వల్ల చర్మ కణాలకు జరిగే నష్టం నివారించబడుతుంది. వృద్ధాప్య ఛాయలు తగ్గుతాయి. చర్మం మీద ఉండే ముడతలు, మచ్చలు తొలగిపోతాయి యవ్వనంగా కనిపిస్తారు. చర్మం కాంతివంతంగా మారుతుంది. ఇక రాత్రి పూట 10 నుంచి 15 కిస్మిస్లను తీసుకుని ఒక గ్లాస్ నీటిలో వేసి నానబెట్టాలి. ఉదయం పరగడుపునే ఆ నీళ్లను తాగాలి. అనంతరం ఆ కిస్మిస్లను తినాలి. ఇలా రోజూ చేయాల్సి ఉంటుంది. అయితే విరేచనాలు అవుతున్నవారు, లోబీపీ, డయాబెటిస్ ఉన్నవారు, ఐరన్ ట్యాబ్లెట్లను వాడేవారు ఈ మిశ్రమాన్ని తీసుకోకూడదు. ఇలా జాగ్రత్తలను పాటిస్తూ ఈ నీళ్లను తాగుతుంటే అనేక లాభాలను పొందవచ్చు.