NTR- Prashant Neel | టాలీవుడ్ యంగ్ టైగర్ ఎన్టీఆర్ (NTR) హీరోగా నటిస్తున్న భారీ యాక్షన్ ఎంటర్టైనర్ “డ్రాగన్ (Dragon)” చిత్రంపై సినీ అభిమానుల్లో విపరీతమైన హైప్ నెలకొంది. ప్రశాంత్ నీల్ (Prashanth Neel) దర్శకత్వం వహిస్తున్న ఈ పాన్ ఇండియా సినిమాను మైత్రీ మూవీ మేకర్స్ సంస్థ అత్యంత ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తోంది. ఈ సినిమాలో రుక్మిణి వసంత్ హీరోయిన్గా నటిస్తోంది. ఇప్పటికే విడుదలైన పోస్టర్స్, ఫస్ట్ లుక్‌లు ప్రేక్షకులను ఆకట్టుకుని, సినిమాపై అంచనాలను మరింత పెంచేశాయి.అయితే తాజాగా ఈ భారీ ప్రాజెక్ట్‌పై అనూహ్యమైన వార్త బయటకు రావడంతో అభిమానుల్లో కలకలం రేగింది.
సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్న రూమర్స్ ప్రకారం ఎన్టీఆర్, ప్రశాంత్ నీల్ల మధ్య సృజనాత్మక విభేదాలు తలెత్తాయి అని టాక్ నడుస్తుంది. మొదటి షెడ్యూల్ అవుట్‌పుట్ చూసి ఎన్టీఆర్ సంతృప్తి చెందలేదని, కొన్ని మార్పులు చేయాలని సూచించడంతో డైరెక్టర్–హీరో మధ్య చిన్న విభేదాలు చోటుచేసుకున్నాయని సమాచారం. ఈ నేపథ్యంలో ప్రాజెక్ట్‌ను తాత్కాలికంగా నిలిపివేసినట్లు కూడా టాలీవుడ్ వర్గాల్లో ప్రచారం జరుగుతోంది. మేకర్స్ మాత్రం ఇప్పటివరకు అధికారిక ప్రకటన చేయలేదు. అయితే “డ్రాగన్” షూట్ నిలిచిందా లేదా అన్న దానిపై త్వరలోనే క్లారిటీ రానుందని సినీ వర్గాలు చెబుతున్నాయి.
ఎన్టీఆర్ తన లుక్ కోసం బాగా కష్టపడి, శరీరాకృతిని కూడా పూర్తిగా మార్చుకున్న సంగతి తెలిసిందే. మరోవైపు ప్రశాంత్ నీల్ కూడా “సలార్” తరువాత ఈ ప్రాజెక్ట్‌ను తన కెరీర్లో కీలకమైనదిగా భావిస్తున్నారు. ఇంతలో ఈ రూమర్స్ రావడంతో అభిమానులు కొంత ఆందోళనకు గురవుతున్నారు. మరి “డ్రాగన్” షూట్ నిజంగానే ఆగిపోయిందా? లేక ఇవన్నీ కేవలం గాసిప్స్ మాత్రమేనా? అన్నది అధికారిక సమాచారం వస్తే కాని తెలియదు.వార్ 2 చిత్రంతో ఎన్టీఆర్ ఫ్యాన్స్ కాస్త నిరాశ చెందడంతో ఇప్పుడు అంతా కూడా డ్రాగన్‌పైనే ఫుల్ హోప్స్ పెట్టుకున్నారు.