సిటీబ్యూరో, డిసెంబర్ 18 (నమస్తే తెలంగాణ): పేదలకు ప్రభుత్వాలు నిర్మించే గృహాలు అగ్గిపెట్టెల్లా ఉంటాయనుకోవడం ఒకప్పటి మాట.. కానీ నేడు కార్పొరేట్ సంస్థలు నిర్మించే అపార్ట్మెంట్లకు దీటుగా ప్రభుత్వం నిర్మిస్తున్నది. హైదరాబాద్ మహానగరంలో మురికి వాడలు లేకుండా చూడటం, విశ్వనగరంగా మార్చడంతో పాటు పేదలు ఆత్మగౌరవంతో జీవించేలా సీఎం కేసీఆర్ లక్ష డబుల్ బెడ్రూం ఇండ్ల నిర్మాణానికి సంకల్పించిన విషయం విదితమే. మరే ఇతర మెట్రో నగరాల్లో లేని విధంగా మురికి వాడల్లో భారీ భవంతులను నిర్మిస్తున్నారు. ఇందులో భాగంగానే 4,038 చోట్ల రెండు పడకల గదుల నిర్మాణాలను ప్రారంభించగా, తాజాగా శుక్రవారం సనత్‌నగర్ నియోజకవర్గంలోని బన్సీలాల్‌పేట సీసీ నగరంలో రూ.20.64కోట్లతో నిర్మించిన 264 ఇండ్లను లబ్ధిదారులకు మంత్రులు కేటీఆర్, తలసాని, వేముల ప్రశాంత్‌రెడ్డి, మహమూద్ అలీలు అందజేశారు.
మార్చిలోగా పూర్తి..
మురికి వాడల్లోని పేదలు నివసిస్తున్న ఇరుకు ఇండ్లను కూల్చివేసిన అధికారులు 40 ప్రాంతాల్లో 8,898 బహుళ అంతస్తుల నిర్మాణాలను చేపట్టారు. మరో 71 ఖాళీ ప్రదేశాల్లో 91,102 ఇండ్ల నిర్మాణం ప్రారంభించారు. వీటిలో మౌలిక సదుపాయాలతో సహా ఇప్పటి వరకు 4,038 ఇండ్లను ప్రారంభించి లబ్ధిదారులకు అందజేశారు. ఇప్పటి వరకు జీహెచ్ఎంసీ 64,628 డబుల్ బెడ్ రూం ఇండ్ల నిర్మాణ పనులను పూర్తి చేయగా, మరో 35,372 ఇండ్ల నిర్మాణ పనులు పురోగతిలో ఉన్నాయి. ఈ పనులను వచ్చే ఏడాది మార్చి వరకు పూర్తి చేసి లబ్ధిదారులకు అందజేస్తామని అధికారులు పేర్కొంటున్నారు.