హైదరాబాద్, మే9 (నమస్తే తెలంగాణ) : జియోఫిజికల్ పరీక్షలు నిర్వహించిన తర్వాతే ఎస్ఎల్బీసీ (శ్రీశైలం లెఫ్ట్ బ్యాంక్ కెనాల్) టన్నెల్ పనులపై ముందుకు వెళ్లాలని ప్రభుత్వం నియమించిన నిపుణుల సబ్ కమిటీ అభిప్రాయ పడింది. ఏకకాలంలో సాంకేతిక పరీక్షలు, సహాయక చర్యలను కొనసాగించాలని నిర్ణయించింది. ఆయా సాంకేతిక పరీక్షల నిర్వహణకు దాదాపు 2 నుంచి 3 నెలల సమయం పడుతుందని అంచనా వేసింది. ఎస్ఎల్బీసీ ప్రమాద ఘటనలో గల్లంతయిన కార్మికుల మృతదేహాలను త్వరితగతిన వెలికితీసేందుకు ఉన్న ప్రత్యామ్నాయ మార్గాలపై అధ్యయనం చేసేందుకు ప్రభుత్వం తొలుత 12 మందితో ఒక టెక్నికల్ కమిటీని నియమించిన విషయం తెలిసిందే. అనంతరం పర్యావరణ మంత్రిత్వశాఖ విధించిన షరతుల మేరకు అధ్యయనం చేసి పనుల సాధ్యాసాధ్యాలను పరిశీలించి, సిఫార్సులు చేసేందుకు సాంకేతిక నిపుణులతో ఆ కమిటీ మరో సబ్ కమిటీని ఏర్పాటు చేసింది. తాజాగా రాష్ట్ర ఇరిగేషన్‌శాఖ ప్రభుత్వ సలహాదారు ఆదిత్యనాథ్‌దాస్, ఈఎన్సీ అనిల్‌కుమార్ నేతృత్వంలో ఆ సబ్ కమిటీ జలసౌధలో శుక్రవారం ప్రత్యేకంగా హైబ్రీడ్మోడ్లో సమావేశమైంది.
ఎస్ఎల్బీసీ ప్రస్తుత పరిస్థితులపై, తదుపరి తీసుకోవాల్సిన చర్యలపై చర్చించింది. అయితే ఎస్ఎల్బీసీ సొరంగానికి సంబంధించి ఏ పనులు చేపట్టాలన్నా జియోఫిజికల్ టెస్ట్‌లు నిర్వహించాల్సిందేనని స్పష్టం చేసింది. సొరంగంపై 30 మీటర్ల ఎగువ వరకు, ఇరు పక్కలా 20 మీటర్ల వరకు భూభౌతిక పరీక్షలు నిర్వహించి, ఆ నివేదిక ఆధారంగా ముందుకు వెళ్లాలని నిర్ణయించింది. ఎన్జీఆర్ఐ నేతృత్వంలో ఈ పరీక్షలునిర్వహించాలని సూత్రప్రాయ అంగీకారానికి వచ్చింది. సాంకేతిక పరీక్షలు నిర్వహిస్తూనే, మరోవైపు రెస్క్యూ ఆపరేషన్‌ను ఏకకాలంలో కొనసాగించాలని, అందుకు 2 నుంచి 3 నెలల సమయం పడుతుందని అంచనా వేసింది. సొరంగంలో ప్రమాద స్థలం అత్యంత దుర్లభమైన, సున్నితమైందని ప్రాంతమని, ఈ నేపథ్యంలో 50 మీటర్ల మేర పేరుకుపోయిన శిథిలాలను, మట్టి, రాళ్లను ఒకేసారి, ఒకే వైపు నుంచి కాకుండా దఫదఫాలుగా, నలువైపుల నుంచి కొద్దికొద్దిగా తొలగిస్తూ ముందుకు పోవాల్సి ఉంటుందని సబ్‌కమిటీలోని సభ్యుడు, రాక్మెకానిక్స్ నిపుణుడు నైథాని సూచించారని తెలిసింది.
సాధారణంగా సొరంగాల తవ్వకం సులభంగా త్వరితగతిన పూర్తి కావాలంటే మధ్యలో ఆడిట్ పాయింట్స్ ఏర్పాటు చేస్తుంటారు. అదేవిధంగా సొరంగంలో పనిచేసే కార్మికులకు గాలి, వెలుగురు అందించేందుకు షాఫ్ట్ పాయింట్లను ఏర్పాటు చేస్తారు. కానీ, ఎస్ఎల్బీసీ టన్నెల్లో అవి రెండూ లేవు. అందుకు ప్రధాన కారణం సొరంగం పోయే ప్రాంతం పూర్తిగా అభయారణ్య జోన్లో ఉండటమే. కేంద్రం అనుమతులు నిరాకరించడంతో టీబీఎం టెక్నాలజీతో సొరంగ తవ్వకాన్ని చేపట్టారు. ఇప్పటివరకు 34 కి.మీ. పైగా తవ్వకం పూర్తయింది. ప్రస్తుతం ఇన్‌లెట్‌లో 13.93 కి.మీ. పాయింట్ వద్ద ప్రమాదం సంభవించింది. ఆ పనులపై ఎలా ముందుకు వెళ్లాలనే అంశాన్ని కూడా నిఫుణులతో కూడిన సబ్‌కమిటీ చర్చించింది.
అయితే అభయారణ్యం నేపథ్యంలో షాఫ్ట్ పాయింట్ ఏర్పాటుకు కేంద్రం అనుమతులు అసాధ్యమని నిర్ధారణకు వచ్చింది. అయితే టీబీఎంతోపాటు, డీబీఎం టెక్నాలజీని కూడా వినియోగించి సొరంగం తవ్వకాన్ని పూర్తి చేయవచ్చని బ్లాస్టింగ్ నిపుణులు మోరె రాములు చెప్పినట్టు సమాచారం. ఇతరత్రా సాంకేతిక పరీక్షలను కూడా కేంద్ర సంస్థలకు అప్పగించాలని సబ్‌కమిటీ అభిప్రాయానికి వచ్చింది. సమావేశంలో సొరంగ నిపుణుడు కల్నల్ పరీక్షిత్ మెహ్రా, జియోలాజికల్ సర్వే ఆఫ్ ఇండియా, నేషనల్ జియోఫిజికల్ రీసెర్చ్ ఇనిస్టిట్యూట్, నేషనల్ సెంటర్ ఫర్ సీస్మోలజీ, నేషనల్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ రాక్ మెకానిక్స్, నేషనల్ రిమోట్ సెన్సింగ్ సెంటర్, సెంట్రల్ ఇనిస్టిట్యూట్ ఫర్ మైనింగ్ అండ్ ఫ్యూయల్ రీసెర్చ్, బోర్డర్ రోడ్స్ ఆర్గనైజేషన్ నుంచి నిపుణులు పాల్గొన్నారు.