జోగులాంబ గద్వాల : జోగులాంబ గద్వాల జిల్లాలోని గట్టు పీఏసిఎస్ కార్యాలయానికి సింగిల్ విండో సభ్యులు తాళం వేశారు. కోర్టు తీర్పు మేరకు గట్టు పీఏసిఎస్ (PACS – ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘం) చైర్మన్గా క్యామ వెంకటేష్ మరో మారు బాధ్యతలు స్వీకరించిన నేపథ్యంలో పీఏసీఎస్ కార్యాలయంలో బుధవారం ఉదయం తీవ్ర ఉద్రిక్తత నెలకొంది. సహకార సంఘాల పాలకవర్గాల సభ్యులు లేనిదే పీఏసీఎస్ చైర్మన్గా ప్రమాణ స్వీకారం ఎలా చేస్తారంటూ సింగిల్ విండో డైరెక్టెర్ లు కార్యాలయానికి తాళం వేసి ఆందోళనకు దిగారు.
నిబంధనలకు విరుద్ధంగా ప్రమాణ స్వీకారం చేశారంటూ ఆరోపించారు. ఈ వివాదంపై పీఏసీఎస్ చైర్మన్ క్యామ వెంటేష్ స్పందిస్తూ.. కోర్టు ఆదేశాల ప్రకారమే పీఏసీఎస్ పాలకవర్గ ప్రమాణ స్వీకారం చేసినట్లు స్పష్టం చేశారు. పీఏసీఎస్ కార్యలయ అధికారులు డైరెక్టర్లకు ముందస్తుగానే సమాచారం అందించారని, కాని ఒక వర్గం డైరెక్టర్లు గైర్హాజరు అయ్యారని తెలిపారు. దీంతో గట్టు పోలీసులు రంగప్రవేశం చేసి, కార్యాలయానికి వేసిన తాళాలను తొలగించి పరిస్థితిని అదుపులోకి తెచ్చారు.