కొల్లాపూర్, జూన్ 12 : వచ్చే ఎన్నికల్లో బీఆర్ఎస్ విజయం ఖాయమని మాజీ మంత్రి సింగిరెడ్డి నిరంజన్‌రెడ్డి ధీమా వ్యక్తంచేశారు. శుక్రవారం నాగర్‌కర్నూల్ జిల్లా కొల్లాపూర్ పట్టణంలోని మహబూబ్ ఫంక్షన్హాల్లో నియోజకవర్గ బీఆర్ఎస్ సభ్యత్వం, సర్‌పై అవగాహన కార్యక్రమంలో ఆయన మాట్లాడుతూ.. 90శాతం పూర్తయిన పాలమూరు-రంగారెడ్డి ప్రాజెక్టులో 10శాతం పెండింగ్ పనులు చేయకుండా రేవంత్‌రెడ్డి ప్రభుత్వం కావాలనే నిర్లక్ష్యం చేస్తున్నదని మండిపడ్డారు. పీఆర్ఎల్ఐ పనులు పూర్తి చేయాలన్న డిమాండ్‌తో బీఆర్ఎస్ ఆధ్వర్యంలో పాదయాత్ర చేస్తామని ప్రకటించడంతో సీఎం రేవంత్ హెలికాప్టర్లో ఉమ్మడి పాలమూరు జిల్లాలోని ప్రాజెక్టులను హడావుడిగా సందర్శించారని దుయ్యబట్టారు. పెండింగ్ పనులు ఎలా పూర్తి చేస్తారో చెప్పకుండా, గత ప్రభుత్వం భూసేకరణ చేయకపోవడంతోనే నీళ్లు ఇవ్వలేదని తప్పుడు ప్రచారం చేస్తున్నారని మండిపడ్డారు.
నాడు 27,081.95 ఎకరాలకు 26,950.97 ఎకరాల భూసేకరణ పూర్తయ్యిందని, ఇంకా మిగిలిన 128.75 ఎకరాలను కూడా సేకరించలేని దుస్థితిలో ప్రభుత్వం ఉన్నదని విమర్శించారు. కృష్ణా జలాలను వట్టెం రిజర్వాయర్ వరకు తీసుకెళ్లే అవకాశం ఉన్నా.. కాంగ్రెస్ ప్రభుత్వం చర్యలు తీసుకోవడం లేదని ఆగ్రహం వ్యక్తంచేశారు. తొమ్మిదిన్నరేండ్లలో 3.25 లక్షల కోట్ల అప్పయితే.. ఏ ప్రాజెక్టు నిర్మాణం చేపట్టని, ఏ సంక్షేమ పథకం ప్రవేశపెట్టని కాంగ్రెస్ ప్రభుత్వం రెండున్నరేండ్లలో 3 లక్షలకుపైగా అప్పు లు ఎందుకు చేసిందని ప్రశ్నించారు. కేఎల్ఐ, భీమా, జూరాల ప్రాజెక్టుల నిర్మాణంలో జూపల్లి కృష్ణారావు పాత్ర శూన్యమని స్పష్టంచేశారు. రూ.50 కోట్లతో పాన్‌గల్ మండలంలో తలపెట్టిన రిజర్వా యర్‌ను కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చాక జూపల్లి క్యాన్సిల్ చేయించాడని ఆరోపించారు. కేసీఆర్‌ను సీఎం చేసే వరకూ ప్రతి కార్యకర్త సైనికుడిలా పనిచేయాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో నాగర్‌కర్నూల్ జిల్లా ఇన్చార్జి మెట్టు శ్రీనివాస్, మాజీ ఎమ్మెల్యేలు బీరం హర్షవర్ధన్‌రెడ్డి, మర్రి జనార్దన్‌రెడ్డి, కొల్లాపూర్ నియోజకవర్గ ఇన్చార్జి వెంకటేశ్వర్‌రెడ్డి, నాయకులు రఘువర్ధన్‌రెడ్డి హాజరయ్యారు.