హైదరాబాద్, జూన్ 12 (నమస్తే తెలంగాణ) : గ్లోబల్ లాజిస్టిక్స్ డెస్టినేషన్‌గా తెలంగాణను తీర్చిదిద్దేందుకు ప్రణాళికాబద్ధంగా కృషి చేస్తున్నామని రాష్ట్ర ఐటీ, పరిశ్రమల శాఖల మంత్రి దుద్దిళ్ల శ్రీధర్‌బాబు పేర్కొన్నారు. ఈ మేరకు శుక్రవారం ఎఫ్‌టీసీసీఐ ఆధ్వర్యంలో హైదరాబాద్‌లో ‘ఇంటర్నేషనల్ కాన్ఫరెన్స్ ఆన్ షిప్పింగ్ అండ్ లాజిస్టిక్స్ 2026’కు ఆయన ముఖ్య అతిథిగా హాజరై మాట్లాడుతూ.. రాబోయే రోజుల్లో ఈ రంగంలో ఎదురయ్యే సవాళ్లను అధిగమిస్తూ, సరికొత్త అవకాశాలను అందిపుచ్చుకునేలా రాష్ట్రంలో ‘ఫ్యూచర్ రెడీ ఎకో సిస్టం’ను చిత్తశుద్ధితో అభివృద్ధి చేస్తున్నామని చెప్పారు.
ఎగుమతుల సన్నద్ధత సూచీలో తెలంగాణ ఎనిమిదో స్థానంలో నిలిచిందన్న ఆయన.. సముద్ర తీరం లేని రాష్ట్రాల (ల్యాండ్ లాక్డ్) జాబితాలో రెండో స్థానంలో ఉందన్నారు. మర్చండైజ్ ఎగుమతుల్లో దేశంలోనే ఏడో స్థానంలో నిలువడం తెలంగాణ పారిశ్రామిక వృద్ధికి నిదర్శనమని వివరించారు. ‘తెలంగాణ రైజింగ్-2047’ విజన్ లక్ష్యసాధనలో ‘లాజిస్టిక్స్’ రంగం కీలక పాత్ర పోషించేలా ప్రణాళికలు రూపొందించామని, తెలంగాణకు సముద్ర తీరం లేకపోవడాన్ని ఒక పరిమితి (లిమిటేషన్)గా కాకుండా, ఒక డిజైన్ అడ్వాంటేజ్‌గా మార్చుకుంటున్నట్టు వెల్లడించారు. ‘లాజిస్టిక్స్ పాలసీ 2.0’ ద్వారా రాష్ట్రంలో మెగా మల్టీ మాడల్ లాజిస్టిక్ పార్, డ్రై పోర్టులు, బాండెడ్ వేర్ హౌజింగ్, లాజిస్టిక్ పారుల అభివృద్ధికి పెద్దపీట వేయబోతున్నట్టు చెప్పారు.