హైదరాబాద్, డిసెంబర్ 15 (నమస్తే తెలంగాణ): తెలంగాణ సిరుల గని సింగరేణి.. లాభాల్లో దూసుకుపోతున్నది. అమ్మకాల్లో కోల్ ఇండియా కన్నా మెరుగైన వృద్ధిని నమోదు చేసింది. ఈ ఆర్థిక సంవత్సరం (2021-22) గడిచిన 8 నెలల కాలం (ఏప్రిల్-నవంబర్)లో సింగరేణి సంస్థ మునుపెన్నడూ లేనివిధంగా రూ.16,512 కోట్ల అమ్మకాలను జరిపింది. ఇది గత ఆర్థిక సంవత్సరం ఇదే కాలానికి జరిగిన రూ.10,127 కోట్ల కంటే 63 శాతం ఎక్కువ. ఇక ఈ 8 నెలల కాలంలో రూ.924.40 కోట్ల లాభాలను ఆర్జించింది.
గతేడాదితో పోల్చితే 189 శాతం వృద్ధిరేటును సాధించింది. నిజానికి కరోనా పరిస్థితుల నేపథ్యంలో గతేడాది రూ.1,038 కోట్ల నష్టాలను చవిచూసినప్పటికీ.. ఈ ఏడాది అన్నింటిని అధిగమించి లాభాలు సాధించటంలో పరుగులు పెడుతున్నది. విద్యుత్తు అమ్మకాల్లోనూ 18 శాతం వృద్ధిని నమోదు చేసింది. తొలి అర్ధ సంవత్సరంలో కోల్ ఇండియా అమ్మకాల్లో 23 శాతం, లాభాల్లో 16 శాతం వృద్ధే నమోదైంది.
ఇదే స్ఫూర్తితో పనిచేయాలి: సీఎండీ శ్రీధర్
మెరుగైన ఉత్పత్తి, బొగ్గు రవాణా జరిపి గతేడాది కన్నా అమ్మకాలు, లాభాల్లో ఆకర్షణీయమైన వృద్ధి సాధించడంపట్ల సింగరేణి సీఎండీ ఎన్ శ్రీధర్ హర్షం వ్యక్తం చేశారు. కార్మికులకు, అధికారులకు, కార్మిక సంఘాల నాయకులకు ఆయన అభినందనలు తెలిపారు. ఇదే స్ఫూర్తితో మిగిలిన నాలుగు నెలల్లోనూ పనిచేసి లక్ష్యాలను అధిగమించాలని ఆకాంక్షించారు.