హైదరాబాద్, జూన్ 21 (నమస్తే తెలంగాణ) : వ్యాపార విస్తరణలో భాగంగా పెద్ద ఎత్తున విద్యుత్తు ప్లాంట్లను నెలకొల్పుతున్న సింగరేణి సంస్థ తాజాగా రాష్ట్రంలోనే తొలి పంప్డ్ స్టోరేజీ విద్యుత్తు ప్లాంట్‌ను ఏర్పాటు చేయడానికి సిద్ధమైంది. రామగుండం -1 ఏరియాలోని మేడిపల్లి ఓపెన్‌కాస్ట్‌లో తొలి పంప్డ్ స్టోరేజీ ప్లాంట్‌ను నెలకొల్పనున్నట్లు సింగరేణి సీఎండీ ఎన్ బలరామ్ శనివారం ప్రకటించారు. ఇప్పటికే ప్రాథమిక అధ్యయనం పూరత్యుందని, డీపీఆర్ రూపొందించే బాధ్యతలను వ్యాప్కోస్ లిమిటెడ్ సంస్థకు అప్పగించినట్లు ఆయన తెలిపారు.
జియోలాజికల్, జియో టెక్నికల్, హైడ్రాలజీ అధ్యయనాలు, సివిల్, మెకానికల్, ఎలక్ట్రికల్ డిజైన్లు, పర్యావరణ సంబంధ అంశాలు రక్షణ చర్యలపై అధ్యయనం జరిపి డీపీఆర్‌ను రూపొందిస్తామన్నారు. మేడిపల్లి ఓపెన్‌కాస్టు మూసివేయగా, ఈ ప్లాంట్ ఏర్పాటుతో తిరిగి వినియోగంలోకి తీసుకురాన్నట్లు సీఎండీ వెల్లడించారు. రూ.3 వేల కోట్లతో ఈ ప్లాంట్‌ను ఏర్పాటు చేయనుండగా, 40 ఏండ్ల పాటు 500 మెగావాట్ల విద్యుత్తును ఈ ప్లాంట్ నుంచి ఉత్పత్తి చేస్తామన్నారు.
పంప్డ్‌స్టోరేజీ అనేది ఒక రకంగా జల విద్యుత్తు ప్లాంటే. అయితే జల విద్యుత్తు కేంద్రాల్లో నీటి ప్రవాహం సహజంగా ఉంటుంది. కానీ పంప్డ్ స్టోరేజీని నీటిని కింది నుంచి పైకి పంపింగ్ చేసి, కిందికి వదిలి విద్యుత్తును ఉత్పత్తి చేస్తారు. అంటే సంపులో నీటిని నిల్వచేయడం, పైకి పంపింగ్ చేయడం, తిరిగి కిందికి వదలడంతో దానిద్వారా విద్యుత్తు ఉత్పత్తి కానున్నది. ప్రతిపాదిత మేడిపల్లి ఓసీని నీటి సంపుగా మార్చి, 157 మీటర్ల లోపులో నీటిని నిల్వచేస్తారు. ఈ నీటిని తోడి ఎత్తైన ప్రదేశానికి పంపింగ్ చేస్తారు. పై భాగంలో టర్బైన్లు, జనరేటర్లతో కూడిన విద్యుత్తు తయారీ ప్లాంట్‌ను నెలకొల్పుతారు. పైకి పంపింగ్ చేసిన నీటిని అక్కడి నుంచి తిరిగి కిందికి వదులుతారు. ఈ నీటి ద్వారా టర్బైన్లను తిప్పి విద్యుత్తు ఉత్పత్తి చేస్తారు.