హైదరాబాద్, అక్టోబర్ 5 (నమస్తేతెలంగాణ) : సింగరేణి సొమ్మును కాంగ్రెస్ సర్కార్ ఇష్టారీతిన వాడుతున్నది. సింగరేణి ప్రాంతంలో మౌలిక వసతుల కల్పనకు వినియోగించాల్సిన నిధులను యంగ్ ఇండియా గురుకులాల నిర్మాణానికి దారిమళ్లిస్తున్నది. సింగరేణి సహా ఇతర మైనింగ్ కార్యకలాపాల ద్వారా సమకూరిన డిస్ట్రిక్ట్ మినరల్ ట్రస్ట్ ఫండ్ (డీఎంఎఫ్టీ) నిధుల నుంచి ఈ ఏడాదిలోనే రూ.450 కోట్లు మళ్లించినట్టు వెలుగులోకి వచ్చింది. వచ్చే రెండు ఆర్థిక సంవత్సరాల్లోనూ ఇదే తరహాలో నిధులను మళ్లించబోతున్నట్టు తెలుస్తున్నది. డీఎంఎఫ్టీ నిధులను మైనింగ్ ప్రభావిత ప్రాంతాల్లోనే ఖర్చు చేయాలి. తాగునీరు, ప్రజారోగ్య పరిరక్షణ తదితర సదుపాయాల కల్పనకు వినియోగించాలి. అందుకు భిన్నంగా ఖర్చు చేయడం డీఎంఎఫ్టీ లక్ష్యాలకు పూర్తి విరుద్ధమని కార్మిక సంఘాల నేతలు అంటున్నారు. ఇప్పటికే ప్రభుత్వ బడుల్లో శానిటేషన్‌కు సింగరేణి డీఎంఎఫ్టీ నిధులనే వాడుతున్నారని మండిపడుతున్నారు.
ఎస్సీ, మైనారిటీ గురుకులాల నిధులను కూడా యంగ్ ఇండియా గురుకులాల నిర్మాణానికి మళ్లించినట్టు తెలుస్తున్నది. విద్యార్థుల డైట్ చార్జీల కోసం కేటాయించిన బడ్జెట్‌ను యంగ్ ఇండియా గురుకులాలకు బదలాయించినట్టు ఆరోపణలు వినిపిస్తున్నాయి. రూ.17,400కోట్లు వె చ్చించి 87 యంగ్ ఇండియా గురుకులాలను నిర్మించాలని భావిస్తున్న ప్రభుత్వం.. బడ్జెట్లో రూ.5వేల కోట్లు కేటాయించింది. ఈ నిధులను నేరుగా కేటాయించకుండా ఇతర శాఖల నుంచి మళ్లిస్తున్నారు. బడ్జెట్ నుంచి క్యాపిటల్ ఇన్వెస్ట్మెంట్ రూపంలో రూ.1,288.75 కోట్లు మాత్ర మే యంగ్ ఇండియా గురుకులాలకు కేటాయించిన ప్రభుత్వం.. మైనారిటీ గురుకులాలకు కేటాయించిన రూ.723.72 కోట్ల నుంచి దొడ్డిదారిన రూ.300 కోట్లు యంగ్ ఇండియా గురుకులాలకు మళ్లించింది. యంగ్ ఇండియా గురుకులాల నిర్మాణం కోసం సర్కార్ దాదాపు రూ.8 వేల కోట్ల అప్పులు చేయనున్నది. ఈ ఆర్థిక సంవత్సరంలో నాబార్డ్ నుంచి రూ.1,300 కోట్లు, ఆసియా అభివృద్ధి బ్యాంక్ నుంచి రూ.800 కోట్ల అప్పులు తెచ్చింది.
