దోహా: డబ్ల్యూటీటీ కంటెండర్ టోర్నీలో భారత్‌కు రెండు పతకాలు దక్కాయి. భారత జోడీ మనికా బాత్రా-సాతియాన్కు రజతం, స్టార్ ప్యాడ్లర్ శరత్ కమల్ కాంస్యంతో టోర్నీని ముగించారు. గురువారం జరిగిన మిక్స్డ్ డబుల్స్ ఫైనల్లో మనికా బాత్రా-సాతియాన్ జోడీ 0-3 (4-11, 5-11, 3-11)తో టాప్ సీడ్ లిన్ యుంజు- చెంగ్ ఐచింగ్ (చైనీస్ తైపీ) జంట చేతిలో ఓటమి పాలైంది. ప్రత్యర్థి ధాటికి ఏమాత్రం పోటీనివ్వని భారత జోడీ రన్నరప్‌గా నిలిచింది. హోరాహోరీగా జరిగిన పురుషుల సింగిల్స్ సెమీస్‌లో 2020 ఒమన్ ఓపెన్ టైటిల్ విజేత శరత్ 3-4తో యువాన్ లిసెన్ (చైనా)పై పోరాడి ఓడాడు. గంటపాటు సాగిన పోరులో శరత్ ఆఖరి మెట్టులో మ్యాచ్‌ను చేజార్చుకుని కాంస్యంతో సరిపెట్టుకున్నాడు.