తూప్రాన్, మార్చి 10: దళిత బంధు లబ్ధిదారులు ఎంచుకున్న యూనిట్లను క్షేత్రస్థాయిలో పరిశీలించి ఈనెల 16లోగా డీపీఆర్‌లు అందజేయాల్సిందిగా మెదక్ కలెక్టర్ హరీశ్ దళితబంధు ప్రత్యేకాధికారులను ఆదేశించారు. గురువారం మెదక్ జిల్లా తూప్రాన్ ఆర్డీవో కార్యాలయంలో స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ ప్రతిమాసింగ్, ట్రైని అసిస్టెంట్ కలెక్టర్ అశ్విని థానాజీ వాకడేల, ప్రత్యేకాధికారులతో కలిసి సమావేశంలో మాట్లాడారు. దళితుల కుటుంబాల్లో వెలుగులు నింపేందుకే సీఎం కేసీఆర్ దళిత బంధు పథకం ప్రవేశపెట్టారని, దీంతో దళితులు సామాజికంగా, ఆర్థికంగా అభివృద్ధి సాధిస్తారని అన్నారు.
జిల్లాలోని మెదక్, నర్సాపూర్, అందోల్ నియోజక వర్గాల్లో 256 మంది లబ్ధిదారులను గుర్తించి, బ్యాంకు ఖాతాలు తెరిపించామన్నారు. వారంతా 44 రకాల వ్యాపారాలు చేసేందుకు ముందుకొచ్చారన్నారు. అందులో ప్రధానంగా పాడి పరిశ్రమ, పౌల్ట్రీ, గొర్రెల పెంపకం, ఫర్టిలైజర్స్, సెంట్రింగ్, టెంట్‌హౌజ్, హార్వెస్టర్, రవాణా వాహనాలు, ఫొటో స్టూడియో, విస్తరాకుల తయారీ తదితర యూనిట్లు నెలకొల్పేందుకు ఆసక్తి చూపుతున్నారన్నారు. యూనిట్లకు సరైన సెంటర్ ఎంపిక చేసుకున్నారా, పూర్వ అనుభవం ఉందా, మార్కెటింగ్‌కు ఉన్న అవకాశాలను ఎంపీడీవోలతో కలిసి పరిశీలించి డీపీఆర్‌లను అందజేయాల్సిందిగా కలెక్టర్ సూచించారు.
మొదట రూ.3, 4 లక్షలతో ప్రారంభించి, పుంజుకున్న తర్వాత తమ అనుభవంతో మిగిలిన డబ్బులతో వ్యాపారాన్ని మరింత అభివృద్ధి చేసుకునేలా లబ్ధిదారులకు అవగాహన కల్పించాలన్నారు. పాడి పరిశ్రమ, పౌల్ట్రీ, గొర్రెల పెంపకానికి సంబంధించి 81 మంది లబ్ధిదారులు ఆసక్తి చూపుతున్నారన్నారు. కామన్‌గా ఈ యూనిట్లకు వంద గజాల్లో ఎన్‌ఆర్‌ఈజీపీ కాంపోనెంట్ క్రింద షెడ్లు నిర్మించాల్సిందిగా డీఆర్డీవోలను ఆదేశించారు. సమావేశంలో గడ ప్రత్యేకాధికారి ముత్యంరెడ్డి, డీఎస్డీవో విజయలక్ష్మి, తూప్రాన్ ఆర్డీవో శ్యామ్ ప్రకాశ్, మెదక్ ఆర్డీవో సాయిరాంలతో పాటు దళిత బంధు ప్రత్యేకాధికారులు పాల్గొన్నారు.