‘సర్వేంద్రియానం.. నయనం ప్రధానం’ అన్నారు. కండ్లు మనకు దేవుడిచ్చిన అపురూపమైన అవయవం. కండ్లతోనే ఈ లోకాన్ని చూడగలుగుతున్నాం. అలాంటి నేత్రాలను కాపాడడంలో వైద్యుల సేవలు వెలకట్టలేనివి. కంటి సమస్యలతో వస్తున్న రోగులకు గజ్వేల్ ప్రభుత్వ దవాఖాన భరోసా కల్పిస్తున్నది. ఇక్కడి వైద్యులు అన్నిరకాల చికిత్సలతో పాటు శస్త్ర చికిత్సలు చేస్తున్నారు. కంటి ఆపరేషన్లలో ఉమ్మడి మెదక్ జిల్లాలో ఈ దవాఖాన టాప్‌లో ఉంది. ఏడాదిలో 385 కంటి ఆపరేషన్లు చేసి సర్కారు వైద్యంపై రోగులకు నమ్మకాన్ని కల్పించింది. నెలలో సరాసరి 35 నుంచి 40 వరకు కంటి శస్త్ర చికిత్సలు చేస్తున్నారు. క్యాటరాక్ట్, టెరిజం ఆపరేషన్లు నిర్వహిస్తున్నారు. క్యాటరాక్ట్‌తో బాధపడే వృద్ధులకు ఈ దవాఖానలో మెరుగైన వైద్యం అందించి నేత్ర సమస్యలను దూరం చేస్తున్నారు.
గజ్వేల్ రూరల్, మార్చి 3 : ‘నేను రాను బిడ్డో సర్కారు దవాఖానకు అంటూ మాట్లాడిన వారే… నేడు నేను పోత బిడ్డ సర్కారు దవాఖానకు’ అంటూ రోజు వందల సంఖ్యలో గ్రామీణ ప్రాంత రోగులు చికిత్స కోసం వెళ్తున్నారు. సర్కారు వైద్యంపై సీఎం కేసీఆర్ పెంచిన నమ్మకంతో అన్ని రకాల చికిత్సలు చేయించుకుంటున్నారు. కంటి ఆపరేషన్లలో గజ్వేల్ దవాఖాన ఉమ్మడి మెదక్ జిల్లాలో మొదటి స్థానంలో నిలిచింది. గతేడాది ఫిబ్రవరి 18న గజ్వేల్ దవాఖానలో కంటి శస్త్ర చికిత్సలు ప్రారంభమయ్యాయి. ఏడాదికాలంలో ఇక్కడ 385 మందికి చికిత్సలు చేశారు. గజ్వేల్ నియోజకవర్గంతోపాటు, దుబ్బాక, మెదక్, భువనగిరి, తుర్కపల్లి, నర్సాపూర్, తూప్రాన్, శివ్వంపేట, వెల్దుర్తి, చేగుంట ప్రాం తాల నుంచి వచ్చి చికిత్సలు చేయించుకుంటున్నారు.
సీఎం కేసీఆర్ కృషి ఫలితంగా గజ్వేల్ దవాఖానను సకల సౌకర్యాలతో రూ.20 కోట్లతో నిర్మించారు. 2018లో నూతన భవనంలోకి దవాఖానను మార్చారు. ఇక్కడ అన్నిరకాల వైద్య పరీక్షలు చేయాలనే ప్రభుత్వ ఆదేశాలతో వైద్యులు ఆ దిశగా చికిత్సలు ప్రారంభించారు. సర్కారు దవాఖానలో కంటి శస్త్ర చికిత్సలంటే భయపడే వారు నేడు అదే దవాఖానలో శస్త్ర చికిత్సలు చేయించుకునేందుకు మందుకు వస్తున్నారు. ఇప్పటి వరకు వైద్యుల బృందం డాక్టర్లు సింధూర, శ్రీవాణి, జ్యోతి 385 మందికి కంటి శస్త్ర చికిత్సలు చేశారు. వారంలో 10 ఆపరేషన్లు చేస్తుండగా, సరాసరి నెలలో 35 నుంచి 40 వరకు కంటి శస్త్రచికిత్సలు చేస్తున్నారు. ముఖ్యంగా క్యాటరాక్ట్, టెరిజం శస్త్ర చికిత్సలు ఎక్కువగా చేస్తున్నారు. వృద్ధాప్యంలో చాలామంది క్యాటరాక్ట్‌తో బాధపడుతున్న వారికి ఇక్కడ అందుతున్న సేవలు ఎంతో ఉపయోగపడుతున్నాయి. గతంలో ఇక్కడ కంటి పరీక్షలు చేసిన తర్వాత శస్త్ర చికిత్సల కోసం మౌలాలీలోని ఎంఎస్‌రెడ్డి లయన్స్ దవాఖానకు తరలించేవారు. కానీ, నేడు సీఎం కేసీఆర్, వైద్య ఆరోగ్య శాఖ మంత్రి తన్నీరు హరీశ్‌రావు కృషితో అన్ని సదుపాయాలు అందుబాటులోకి వచ్చాయి. దీంతో గజ్వేల్ దవాఖానలో అన్ని రకాల చికిత్సలు చేస్తున్నారు.
జప్తిశివునూర్ నుంచి 50 మందికి చికిత్సలు..
మెదక్ నియోజకవర్గంలోని జప్తిశివునూర్ గ్రామానికి చెందిన ఓ వ్యక్తి కంటి సంబంధిత వ్యాధిలో గజ్వేల్ దవాఖానకు రాగా, వైద్యులు పరీక్షించిన అనంతరం శస్త్రచికిత్స చేశారు. గజ్వేల్ దవాఖానలో అందుతున్న కంటి సేవలపై అతడు గ్రామంలో తెలియజేశాడు. దీంతో 50 మందికి కంటి శస్త్రచికత్సలు చేసినట్లు వైద్యులు తెలిపారు. ఇక్కడ శస్త్రచికిత్సలు చేయించుకున్న వారు బంధువులకు సేవలపై తెలియజేశారు. దీంతో గజ్వేల్ దవాఖానకు చాలామంది కంటి చికిత్సల కోసం వస్తున్నారు.
కుడి కన్నుకు ఆపరేషన్ చేయించుకున్న
కంటికి మబ్బులు రావడంతో గజ్వేల్ దవాఖానకు వచ్చా. కండ్లను పరీక్షించిన డాక్టర్లు ఆపరేషన్ చేస్తామని చెప్పినారు. కుడి కన్నుకు ఆపరేషన్ చేశారు. పైస ఖర్చు లేకుండా ఆపరేషన్ అయ్యింది. కన్ను మంచిగా కనబడుతున్నది. ఏమి ఇబ్బంది లేదు. ఇన్ని సవులతులు కల్పించిన సీఎం కేసీఆర్ సల్లంగా ఉండాలె.
– బాల్ నర్సమ్మ, దామరకుంట
దవాఖానలో అన్ని రకాల సేవలు
దవాఖానలో అన్నిరకాల వైద్య సేవలను రోగులకు అందిస్తున్నం. ప్రభుత్వం దవాఖానలో అవసరమయ్యే పరికరాలను అందుబాటులోకి తీసుకొచ్చింది. రోజు వం దల సంఖ్యలో ఓపీ కేసులు నమోదవుతున్నాయి. ప్రతిరోజు ఇక్కడ కంటి శస్త్రచికిత్సలు విజయవంతగా చేస్తున్నాం.
-డాక్టర్ మహేశ్, సూపరింటెండెంట్, గజ్వేల్
నెలలో 40 వరకు శస్త్ర చికిత్సలు చేస్తున్నాం
ప్రతి నెలా కంటి శస్త్రచికిత్సలు సుమారుగా 50 వరకు చేస్తున్నాం. ప్రతిరోజు పదుల సంఖ్యలో చికిత్సల కోసం వస్తున్నారు. అవసరమైన వారికి శస్త్రచికిత్సలను ఇక్కడే చేస్తున్నాం. గతేడాది ఫిబ్రవరిలో ప్రారంభమైన శస్త్ర చికిత్సలు ఇప్పటి వరకు విజయవంతంగా చేశాం.
– డాక్టర్ సింధూర, గజ్వేల్ దవాఖాన
ఇప్పుడు ఎలాంటి ఇబ్బంది లేదు
కుడి కన్నుకు మబ్బు రావడంతో గజ్వేల్ దవాఖానకు వచ్చాను. పరీక్షలు చేసిన తర్వాత డాక్టర్లు ఆపరేషన్ చేస్తామంటే చేయించుకున్న. ఇప్పుడు ఎలాంటి ఇబ్బంది లేదు. అంతా బాగానే ఉంది. రోజు డాక్టర్లు వచ్చి మం చిగా చూస్తుర్రు.
– కుమార్, కొత్తూర్