ప్రశాంత్‌నగర్, మార్చి 3 : సిద్దిపేట కోమటి చెరువు, రూబీ నెక్లెస్ రోడ్డులో చేపడుతున్న అభివృద్ధి పనులను వేగవంతం చేయాలని సిద్దిపేట మున్సిపల్ కమిషనర్ రవీందర్‌రెడ్డి అధికారులకు సూచించారు. గురువారం సిద్దిపేటలోని కోమటి చెరువు, రూబీ నెక్లెస్ రోడ్డులో చేపడుతున్న అభివృద్ధి పనులను ఆయన పరిశీలించారు. నెక్లెస్ రోడ్డు వద్ద నైట్ గార్డెన్ పక్కన నిర్మిస్తున్న ఫుడ్‌కోర్టు, టికెట్ కౌంటర్, బాత్రూమ్, సీసీ కెమెరాల కంట్రోల్ రూమ్ నిర్మాణ పనులను పరిశీలించారు. ఈ సందర్భంగా మున్సిపల్ కమిషనర్ మాట్లాడుతూ సిద్దిపేట కోమటి చెరువు రాష్ర్టానికే ఆదర్శంగా రూపుదిద్దుకుందన్నారు. కోమటి చెరువు, రూబీ నెక్లెస్‌లో పెండింగ్ పనులను వెంటనే పూర్తి చేయాలన్నారు. స్వచ్ఛ సర్వేక్షణ్‌లో సిద్దిపేటను జాతీయ స్థాయిలో ముందుంచేందుకు ప్రతిఒక్కరూ కృషి చేయాలని కోరారు. ప్రతిరోజూ కోమటి చెరువు కట్టపైకి వచ్చే సందర్శకుల నుంచి స్వచ్ఛ సర్వేక్షణ్‌పై ఫీడ్‌బ్యాక్ తీసుకోవాలని అధికారులకు సూచించారు.
జోరుగా స్వచ్ఛ సర్వేక్షణ్ సిటిజన్ ఫీడ్‌బ్యాక్
సిద్దిపేట, మార్చి 3 : స్వచ్ఛ సర్వేక్షణ్-2022లో భాగంగా దేశంలోనే సిద్దిపేటను ప్రథమ స్థానంలో నిలుపాలన్న లక్ష్యంతో పట్టణంలో స్వచ్ఛ సర్వేక్షణ్ సిటిజన్ ఫీడ్‌బ్యాక్ కార్యక్రమం జోరుగా కొనసాగుతున్నది. సిద్దిపేట మున్సిపల్ ఆధ్వర్యంలో చేపట్టిన స్వచ్ఛత కార్యక్రమానికి ప్రజల నుంచి సానుకులమై ఫీడ్‌బ్యాక్ లభిస్తున్నది. ఇప్పటికే రాష్ట్రంలో సిటిజన్ ఫీడ్‌బ్యాక్ సిద్దిపేట పట్టణం ముందంజలో ఉంది. పట్టణంలో మున్సిపల్ పాలకవర్గం అనేక చర్యలు చేపట్టింది. ప్రజల అభిప్రాయ సేకరణలో యువత పెద్ద ఎత్తున పాల్గొని స్వచ్ఛ సిద్దిపేటకు అనుకులంగా తమ ఓటు వేస్తున్నారు. ఆచార్య జయశంకర్ స్టేడియంలో జరుగుతున్న సీఎం కేసీఆర్ ట్రోఫీ టోర్నమెంట్ వద్ద పెద్ద ఎత్తున ప్రచారం చేసి క్యూర్‌కోడ్ ద్వారా తమ ఓటు వేసి మద్దతు తెలిపారు.
స్వచ్ఛ సర్వేక్షణ్‌పై అవగాహన..
హుస్నాబాద్, మార్చి 3 : స్వచ్ఛ సర్వేక్షణ్ -2022లో భాగంగా హుస్నాబాద్ పట్టణంలో మెప్మా ఆర్పీలతోపాటు మున్సిపల్ అధికారులు, సిబ్బంది, కౌన్సిలర్లు గురువారం ఇంటింటికీ తిరిగి ప్రజలకు అవగాహన కల్పించారు. పట్టణంలోని రెండో వార్డులో కౌన్సిలర్ రమారవి ఆధ్వర్యంలో ఇంటింటికీ తిరిగి స్వచ్ఛ సర్వేక్షణ్‌పై అవగాహన కల్పించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ హుస్నాబాద్ పట్టణాన్ని సంపూర్ణ స్వచ్ఛ పట్టణంగా తీర్చిదిద్దేందుకు ప్రజలు సహకరించాలని కోరారు. కార్యక్రమంలో ఎన్విరాన్మెంట్ ఇంజినీర్ రవికుమార్, ఆర్పీలు శ్రీలత, అరుణ, లావణ్య, సరిత పాల్గొన్నారు.