జగదేవ్పూర్ మార్చి 3 : ‘మన ఊరు-మన బడి’ కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని డీఈవో రవికాంతారావు పిలుపునిచ్చారు. గురువారం మండల అభివృద్ధి కార్యాలయంలో ఆయా గ్రామాల హెచ్ఎంలు, ఉపాధ్యాయులతో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా డీఈవో మాట్లాడుతూ ‘మన ఊరు-మన బడి’తో ప్రభుత్వ పాఠశాలల రూపురేఖలు మారనున్నాయని తెలిపారు. ప్రభుత్వం ద్వారా వచ్చే గ్రాంట్తోపాటు దాతల సహకారంతో పాఠశాలలు బలోపేతం కానున్నాయని చెప్పారు. ప్రభుత్వ పాఠశాలల్లో పెద్ద సంఖ్యలో విద్యార్థులు చేరేలా ప్రజాప్రతినిధులు కృషి చేయాలని కోరారు. కార్యక్రమంలో ఎంఈవో ఉదయభాస్కర్రెడ్డి, పీజీహెచ్ఎం రహీం, ఉపాధ్యాయులు శంకర్, చంద్రం పాల్గొన్నారు.
గజ్వేల్ రూరల్లో..
గజ్వేల్ రూరల్, మార్చి 3 : ‘మన ఊరు- మన బడి’ కార్యక్రమాన్ని ఉపాధ్యాయులు విజయవంతం చేయాలని ఎంఈవో సునీత పిలుపునిచ్చారు. గురువారం మండల వనరుల కేంద్రంలో నిర్వహించిన అవగాహన సదస్సులో ఉపాధ్యాయులనుద్దేశించి ఆమె మాట్లాడారు. వచ్చే విద్యా సంవత్సరంలో ప్రారంభించుకునే ఆంగ్ల మాధ్యమంతో గ్రామీణ ప్రాంత విద్యార్థులకు ఎంతో మేలు చేకూరుతుందన్నారు. కార్యక్రమంలో ఉపాధ్యాయులు పాల్గొన్నారు.
అనంతసాగర్లో..
చిన్నకోడూర్, మార్చి 3 : మండలంలోని అనంతసాగర్లో సర్పంచ్ విజయలింగం ఆధ్వర్యంలో ‘మన ఊరు-మన బడి’ కార్యక్రమంపై సమావేశం నిర్వహించారు. మొదటి విడుతలో అనంతసాగర్ పాఠశాల ‘మన ఊరు-మన బడి’కి ఎంపిక కావడంతో మౌలిక వసతులపై చర్చించారు. సమావేశంలో ఎంపీటీసీ సరితాపరశురాములు, ఉపసర్పంచ్ రమేశ్, హెచ్ఎంలు రామచంద్రం, రవీందర్, సీఆర్పీ తిరుపతి, ఎస్ఎంసీ చైర్మన్లు, ఉపాధ్యాయులు పాల్గొన్నారు.