వర్గల్, మార్చి 31 : సమగ్ర విద్యాభివృద్ధే టీఆర్ఎస్ ప్రభుత్వధ్యేయం సంక్షేమ పథకాలను సమర్థవంతంగా అమలు చేస్తున్నది. ఆరోగ్యం, విద్యకు సమప్రాధాన్యం ఇస్తున్నది.. ఇప్పుడు ప్రభుత్వ బడులను బలోపేతం చేయడమే లక్ష్యంగా ‘మన ఊరు-మనబడి’ ప్రారంభించింది. వర్గల్ మండలంలో ‘మన ఊరు-మనబడి’ కార్యక్రమంలో భాగంగా మొత్తం 16 ప్రభుత్వ పాఠశాలలను ఎంపిక చేసింది. ఆయా పాఠశాలల్లో మౌలిక వసతులను కల్పించడమే ఉద్దేశంగా ప్రణాళికలను రూపొందించింది. అవసరం మేరకు నిధులను ప్రకటించింది. ప్రహరీలు, వంటగదుల నిర్మాణం, డిజిటల్ తరగతుల నిర్వహణ, ఆట వస్తువులు, తాగునీటి సౌకర్యం, స్కూల్ భవనాలకు కొత్త హంగులు అద్దడం, పౌష్టికాహార ఏర్పాటులో ఎలాంటి లోటుపాట్లు లేకుండా చర్యలు చేపడుతున్నది.
పాఠశాలల్లో 310 మంది విద్యార్థులు
నెంటూర్తోపాటు సామలపల్లి, రాంసాగర్‌పల్లి, జెబ్బాపూర్, గోవిందాపూర్, గిర్మాపూర్, కాశగుడిసెలు, మాలపల్లి తదితర చుట్టు పక్కల గ్రామాల నుంచి పెద్ద సంఖ్యలో విద్యార్థులు వస్తున్నారు. సక్సెస్‌కు మారుపేరుగా నిలిచిన నెంటూర్ ప్రభుత్వ ఉన్నత పాఠశాల అటు చదువులోనూ.. ఇటు ఆటల్లోనూ మంచి రికార్డులు సాధించింది. బేస్‌బాల్, వాలీబాల్, కబడ్డీ ఆటల్లో జిల్లా, రాష్ట్రస్థాయిలో రాణించిన ఘనతను సొంతం చేసుకుంది.
14 ఏండ్లుగా ఆంగ్ల బోధన
నెంటూర్ ప్రభుత్వ పాఠశాల్లో తెలుగు మీడియంతో పాటు ఆంగ్లబోధనను 14 ఏండ్ల కిందటనే ప్రారంభించారు. కార్పొరేట్ చదువుల మోజులో పడిన విద్యార్థుల తల్లిదండ్రులను అప్పట్లోనే ఆకర్షించి, తమ పాఠశాలలో చేర్పించేలా సుశిక్షితమైన ఆంగ్లబోధనను ప్రారంభింది. గ్రామస్తుల సహకారం, దాతల ఆర్థికసాయం పాఠశాల పురోభివృద్ధిలో ఎంతగానో తోడ్పపడ్డాయి.
వంద శాతం ఫలితాల కోసం కృషి చేస్తున్నం..
పాఠశాలలో తెలుగు, ఇంగ్లిష్ మాధ్యమాల్లో కలిపి మొత్తం 310 మంది విద్యార్థులు చదువుతున్నారు. ఆయా సబ్జెక్టులకు సరిపడా బోధన సిబ్బంది ఉన్నారు. చదువుల్లో వెనకబడిన విద్యార్థులను గుర్తించి, వారికి ప్రత్యేక తరగతులు నిర్వహిస్తున్నాం. రాబోయే పబ్లిక్ పరీక్షలో వందశాతం ఉత్తీర్ణులయ్యేలా ఇప్పటినుండే ప్రణాళికబద్ధంగా ముందుకెళ్తున్నాం.
– సుబ్రహ్మణ్యేశ్వరరెడ్డి, హెచ్ఎం, నెంటూర్
దాతల సహకారం మరువలేనిది..
గతంలో చాలీచాలని గదులు, సబ్జెక్టులకు సరిపడా టీచర్లు ఉండేవారు కాదు.. బతుకు దెరువు కోసం గ్రా మం నుంచి ఇతర ప్రాంతాల్లో స్థిరపడిన వారిని కలిసి పాఠశాల అభివృద్ధికి తోడ్పాటను అందించాలని కోరాం. ఎవరికి తోచిన విధంగా వారు ఆర్థిక సాయం అందించారు. అలాగే ప్రభుత్వం గడా నిధులతో కొత్తగా జీ+1 భవనం నిర్మించింది. విద్యార్థులకు తరగతి గదుల కొరత లేకుండా చేసింది.
-నిమ్మ రంగారెడ్డి, సర్పంచ్, నెంటూర్ )
ప్రభుత్వ సహకారంతోనే సాధ్యమైంది..
కొవిడ్ కారణంగా చదువులో వెనకబడిన విద్యార్థులకు మా పాఠశాల ఉపాధ్యాయులు ఆన్క్లాస్లతో పాటు ప్రత్యేక జాగ్రత్తలు తీసుకొని చదువు చెబుతున్నారు. సబ్జెక్టులో వెనకబడిన వారిని గుర్తించి, వారి తల్లిదండ్రులతో సమావేశం నిర్వహించి, విషయాన్ని తెలియజేశాం. ఉపాధ్యాయులు, తల్లిదండ్రులు సమష్టిగా ఉం టేనే ఫలితాలు వందశాతం వస్తాయని చెప్పడానికి మా పాఠశాలే నిదర్శనం.
– నల్లనాగుల మెట్టయ్య, స్కూల్ చైర్మన్, నెంటూర్