దుబ్బాక/తొగుట, మార్చి 31 : తప్పుడు హామీలతో ఎమ్మెల్యేగా గెలిచాక.. ప్రజా సమస్యలను పూర్తిగా విస్మరించావంటూ బీజేపీ ఎమ్మెల్యేపై దుబ్బాక ప్రజలు ఆగ్రహం వ్యక్తం చేశారు. మాయమాటలతో ఇంకెన్ని రోజులు మోసం చేస్తావంటూ రఘునందన్‌రావును ప్రజలు నిలదీశారు. ఎమ్మెల్యేగా గెలిచి ఏడాది గడిచినా, రూపాయి పనిచేయలేదంటూ ఎమ్మెల్యేపై ప్రశ్నలు గుప్పించారు. ఇన్నాళ్లూ ప్రశ్నించే గొంతుకనంటూ మీడియా, స్టూడియోల్లో ఉపన్యాసాలతో ఊదరగొట్టే రఘునందన్‌రావుపై సొంత నియోజకవర్గ ప్రజలు తిరుగుబాటు చేశారు. నిజం నిప్పులాంటిది. అవాస్తవాలతో ఎక్కువ రోజులు గడుపలేమని ఎమ్మెల్యే రఘునందన్‌కు గురువారం దుబ్బాక నియోజకవర్గం తొగుట మండలం గుడికందులలో జరిగిన సంఘటన గుణపాఠంగా మారింది. ఉప ఎన్నికల్లో నోటికొచ్చిన(ఆచరణ సాధ్యం కాని) హామీలతో ఎమ్మెల్యేగా గెలిచిన రఘునందన్, ఏడాది కాలంలో ఏ ఒక్క హామీ నెరవేర్చకపోవడంతో ప్రజలు తిరుగుబాటు చేశారు. ఎమ్మెల్యే రఘునందన్‌కు ప్రజల నుంచి వ్యతిరేకత పెరుగటంతో ఇక ప్రశ్నించే గొంతును పరుగెత్తిస్తున్నారంటూ సోషల్ మీడియాలో నెటిజన్లు ట్రోల్ చేశారు.
ఈ ఎమ్మెల్యే మాకొద్దు.. గుడికందుల గ్రామస్తుల ఆందోళన..
దుబ్బాక నియోజకవర్గం తొగుట మండలం గుడికందుల గ్రామంలో గురువారం రైతుబజారు ప్రారంభోత్సవ కార్యక్రమానికి వచ్చిన బీజేపీ ఎమ్మెల్యే రఘునందన్‌రావును గ్రామస్తులు అడ్డుకున్నారు. ఉప ఎన్నికల్లో ఇచ్చిన హామీలెమయ్యా యి? తమకు కట్టిస్తానన్న ఇండ్లు ఏవి..? రైలు ఏది? అంటూ ఎమ్మెల్యేను గ్రామస్తులు ప్రశ్నిస్తూ నిలదీశారు. తమ గ్రామానికి ఏ ముఖం పెట్టుకుని వచ్చావని కొందరూ మహిళలు అడ్డుకున్నారు. గ్రామంలో 50 డబుల్ బెడ్రూం ఇండ్లు కట్టిస్తానని, గజ్వేల్ నుంచి దుబ్బాకకు రైలుకూత, నిరుద్యోగ యువతకు నిరుద్యోగ భృతి ఏమైందని గ్రామస్తులు ఎమ్మెల్యేను నిలదీశారు. పెట్రోల్, గ్యాస్ ధరలను పెంచిన బీజేపీ నాయకులను గ్రామాల్లో తిరగనీయమంటూ నినాదాలు చేశారు. ఈ సందర్భంగా గోబ్యాక్ ఎమ్మెల్యే రఘునందన్‌రావు.. డౌన్‌డౌన్ బీజేపీ అంటూ నినాదించారు. సూమారు రెండు గంటలకుపైగా గ్రామస్తులు ఆందోళన చేశారు. పోలీసులు గ్రామస్తులను సముదాయించే ప్రయత్నం చేశారు. ‘అత్త మీది కోపం.. దుత్త మీద’.. అన్నట్లు ప్రజల తిరుగబాటును జీర్ణించుకోలేని ఎమ్మెల్యే, తనకు రక్షణ కల్పించడంలో నిర్లక్ష్యంగా వ్యవహరించారం టూ పోలీసులపై రఘునందన్‌రావు ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ క్రమం లో స్థానికులకు అండగా టీఆర్ఎస్ నాయకులు నిలువడంతో అక్కడి నుంచి ఎమ్మెల్యే వెళ్లిపోయారు.
ప్రజా తిరుగుబాటును రాజకీయం చేసే ప్రయత్నం..
గుడికందుల గ్రామంలో ఎమ్మెల్యే రఘునందన్‌రావును గ్రామస్తులు అడ్డుకుని, నిరసన చేపట్టగా, దీనిని రాజకీయ లబ్ధి కోసం వాడుకునేందుకు ఎమ్మెల్యే ప్రయత్నం చేసి విఫలమయ్యాడు. గుడికందుల నుంచి ఎమ్మెల్యే రఘనందన్ తన అనుచరులతో కలిసి మిరుదొడ్డి పోలీసు స్టేషన్‌కు వెళ్లారు. తనకు రక్షణ కల్పించడంలో పోలీసులు విఫలమయ్యారని, టీఆర్ఎస్ నాయకులకు సపోర్టు చేశారంటూ ఆరోపిస్తూ ఎమ్మెల్యే ఠాణాలో ధర్నాకు దిగారు. తెలుసుకున్న మిరుదొడ్డి టీఆర్ఎస్ నాయకులు పోలీసు స్టేషన్‌కు వచ్చి, బీజేపీ ఎమ్మె ల్యే తీరుకు నిరసనగా ఆందోళనకు దిగారు. ఈ సందర్భంగా పరిస్థితి ఉద్రిక్తతగా మారుతుండటంతో సంఘటనా స్థలానికి వచ్చిన సిద్దిపేట ఏసీపీ చల్లా దేవారెడ్డి ఎమ్మెల్యేను అరెస్టు చేసి అక్కడి నుంచి తీసుకెళ్లారు.