సిద్దిపేట టౌన్, మార్చి 31 : సాంస్కృతి, సంప్రదాయాల్లో పండుగలు ఒక భాగమని జాతీయ సాహిత్య పరిషత్ రాష్ట్ర ఉపాధ్యక్షుడు అయిత చంద్రయ్య అన్నారు. గురువారం సిద్దిపేట డిగ్రీ కళాశాలలో జాతీయ సాహిత్య పరిషత్ సిద్దిపేట శాఖ కళాశాల తెలుగు విభాగం వారు సయుక్తంగా ఉగాది వసంతోత్సవం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడు తూ ప్రకృతిలోని మార్పులకు అనుగుణంగా తెలుగు నెలలు ఏర్పడ్డాయని, రుతువులకు అనుగుణంగా మన జీవన విధా నం కొనసాగుతున్నదన్నారు. ఉగాది తెలుగు లోగిళ్లలో నవకాంతులను నింపుతుందని చెప్పారు. అనంతరం కవి సమ్మేళనంలో కవులు, కవిత, పద్య, గేయాలతో అలరించారు. ఉగాది సంబురాల్లో భాగంగా పచ్చడి చేసి బక్షాలను ఆరగించారు. కార్యక్రమంలో జాతీయ సాహిత్య పరిషత్ ప్రధాన కార్యదర్శి ఉండ్రాల రాజేశం, డిగ్రీ కళాశాల ప్రిన్సిపాల్ డాక్టర్ సీహెచ్ ప్రసాద్, వైస్‌ప్రిన్సిపాల్ హుస్సేన్, అధ్యాపకులు మధుసూదన్, సుదర్శనం, కవులు పరశురాములు, రాజ్‌కుమార్, లక్ష్మయ్య, సుధాకర్, శ్రీనివాస్, అంజిరెడ్డి పాల్గొన్నారు.
ముందస్తుగా ఉగాది వేడుకలు..
హుస్నాబాద్ టౌన్, మార్చి 31 : హుస్నాబాద్ నవభారత్ ఇంగ్లిష్ మీడియం హైస్కూల్లో గురువారం ముందుస్తుగా ఉగాది వేడుకలు నిర్వహించారు. మున్సిపల్ చైర్పర్సన్ ఆకుల రజితావెంకన్న ఆధ్వర్యంలో తయారు చేసిన ఉగాది పచ్చడిని విద్యార్థులకు పంచిపెట్టారు. తెలుగు సంవత్సరం ఉగాదితో ప్రారంభమవుతుందనే విషయాన్ని విద్యార్థులకు చైర్పర్సన్ వివరించారు. కార్యక్రమంలో మున్సిపల్ వైస్‌చైర్‌పర్సన్ అనితారెడ్డి, కౌన్సిలర్లు సుప్రజ, స్వర్ణలత, పద్మ, పాఠశాల కరస్పాండెంట్ మల్లారెడ్డి, పాఠశాల డైరెక్టర్ రాజు, పాఠశాల ఇన్చార్జి జయతోపాటు పలువురు ఉన్నారు.