సిద్దిపేట, మార్చి 31 : తెలంగాణలో రైతులు పండించిన ధాన్యాన్ని కేంద్ర ప్రభుత్వమే కొనుగోలు చేయాలని మున్సిపల్ చైర్పర్సన్ కడవేర్గు మంజులారాజనర్సు డిమాండ్ చేశారు. గురువారం సిద్దిపేట మున్సిపల్ కార్యాలయంలో మున్సిపల్ సర్వసభ్య సమావేశం నిర్వహించారు. రాష్ట్రంలో పండించిన ధాన్యాన్ని కేంద్ర ప్రభుత్వం కొనుగోలు చేయాలని మున్సిపల్ వైస్ చైర్మన్ కనకరాజు తీర్మానం ప్రవేశపెట్టడంతో కౌన్సిలర్లు ఆమోదం తెలిపారు. ఈ సందర్భంగా చైర్పర్సన్ మాట్లాడుతూ పంజాబ్‌లో మాదిరిగా తెలంగాణలోని ధాన్యాన్ని కేంద్రమే కొనుగోలు చేయాలన్నారు.
బయోగ్యాస్ ఉత్పత్తి ప్రారంభం..
రోజువారీగా తడి చెత్తతో సిద్దిపేట మున్సిపల్ పరిధిలో బుస్సాపూర్‌లో బయోగ్యాస్ ప్లాంట్ ద్వారా బయో గ్యాస్ ఉత్పత్తి ప్రారంభించామని మున్సిపల్ చైర్పర్సన్ మంజుల అన్నారు. బయోగ్యాస్ ఉత్పత్తి జరుగుతున్న తీరును ప్రొజెక్టర్ ద్వారా సభ్యులకు ఆమె వివరించారు.
పెండింగ్ పనులు పూర్తి చేయాలి..
మున్సిపల్ సర్వసభ్య సమావేశం ప్రారంభం కాగానే కౌన్సిలర్లు తమ వార్డుల్లో యూజీడీ పనులు, మ్యాన్‌హోల్స్, రోడ్లు అసంపూర్తిగా నిర్మించారని చైర్పర్సన్ దృష్టికి తీసుకెళ్లారు. ఈ సందర్భంగా మున్సిపల్ చైర్పర్సన్ మాట్లాడుతూ పెండింగ్‌లో ఉన్న పనులను వెంటనే పూర్తి చేయాని అధికారులకు సూచించారు.
మాజీ కౌన్సిలర్ బాల్‌రెడ్డి మృతికి సంతాపం..
సిద్దిపేట మున్సిపల్ మాజీ కౌన్సిలర్ పెరుగు బాల్‌రెడ్డి ఇటీవల మృతి చెందాడు. ఆయన మృతికి సంతాప సూచకంగా మున్సిపల్ పాలకవర్గ సభ్యులు, అధికారులు సమావేశంలో సంతాపం తెలిపారు.