సిద్దిపేట అర్బన్, మార్చి 24 : దళితుల స్థితిగతులను మార్చేందుకు సీఎం కేసీఆర్ గొప్ప ఉద్యమంలా చేపట్టిన కార్యక్రమం దళితబంధు అని మంత్రి హరీశ్‌రావు పేర్కొన్నారు. భూమి మీద ఎక్కడా లేని విధంగా బ్యాంకు బాదరాబంది లేకుండా స్వయం ఉపాధి యూనిట్లు స్థాపించే దళితులకు ప్రభుత్వం రూ.10 లక్షల ఆర్థిక సాయం చేస్తున్నదన్నారు. గురువారం సిద్దిపేట కలెక్టరేట్లో నియోజకవర్గంలోని 101 మంది దళితబంధు లబ్ధిదారులకు గానూ 70మందికి మంత్రి హరీశ్‌రావు మంజూరు పత్రాలు పంపిణీ చేశారు.
ఈ సందర్భంగా మంత్రి హరీశ్‌రావు మాట్లాడుతూ సిద్దిపేట నియోజకవర్గంలోని లబ్ధిదారులకు మంజూరు పత్రాలు పంపిణీ చేసి దళితబంధు పథకం ప్రారంభించడం సంతోషంగా ఉందన్నారు. సమాజంలో నెలకొన్న తారతమ్యాలను రూపుమాపడమే దళితబంధు ఉద్దేశమన్నారు. ఇగురంతో వ్యాపారం చేసి బతుకులు తీర్చిదిద్దుకోవాలన్నారు. ఆర్థికంగా అభివృద్ధి చెంది, సమాజంలో గెలిచి, నిలబడాలన్నారు.
తమ తర్వాతి లబ్ధిదారులకు ఇంటికి పెద్దన్నలా ఆదర్శంగా నిలబడాలని ఉద్భోద చేశారు. ప్రగతి పథంలో సాగుతూ కూలీల నుంచి ఓనర్లుగా అవతారమెత్తి, మరో నలుగురికి ఉపాధి ఇవ్వాలన్నా రు. సీఎం కేసీఆర్ నమ్మకాన్ని నిలబెట్టి సమాజానికి ఆదర్శంగా నిలవాలని మంత్రి అన్నారు. లబ్ధిదారులు గ్రౌండింగ్ చేసిన యూనిట్లను అమ్మితే.. కొన్నవారిని జైలుకు పంపిస్తామని హెచ్చరించారు. యూనిట్లు స్వాధీనం చేసుకుంటామన్నారు. మో టర్ యూనిట్లను అమ్ముకునే ఆస్కారం లేకుండా ఆర్టీఏకు ఆదేశాలు జారీ చేశారు. రిజిస్ట్రేషన్ జరగకుండా సాఫ్ట్‌వేర్‌లో మార్పులు చేయాలన్నారు.
మద్యం షాపుల కేటాయింపుల్లో ఎస్సీలకు రిజర్వేషన్లను కల్పించి, మద్యం షాపుల గల్లాపెట్టె మీద ఎస్సీలను కూర్చోబెట్టిన ఘనత సీఎం కేసీఆర్ దే అన్నారు. వైద్య ఆరోగ్య శాఖలో పలు టెండర్లలో కూడా ఎస్సీలకు రిజర్వేషన్ కల్పించామన్నారు. మెడికల్ షాప్‌లు, ఫర్టిలైజర్ షాపుల్లో నూ రిజర్వేషన్లు ఇచ్చేందుకు ప్రభుత్వం ప్రయ త్నం చేస్తున్నదన్నారు. అనంతరం లబ్ధిదారులతో ఆత్మీయంగా మాట్లాడారు. యూనిట్ల నిర్వహణలో వారికున్న అనుభవం? నిర్వహణ బాధ్యతలు ఎవరు చూస్తారు? అనే వివరాలు అడిగి తెలుసుకున్నారు. ఈ సమావేశంలో జడ్పీ అధ్యక్షురాలు రోజాశర్మ, కలెక్టర్ ఎం.హనుమంతరావు, అదనపు కలెక్టర్లు ముజామ్మిల్‌ఖాన్, శ్రీనివాస్‌రెడ్డి, సుడా చైర్మన్ రవీందర్‌రెడ్డి, ఎస్సీ కార్పొరేషన్ ఈడీ రామాచారి పాల్గొన్నారు.