సిద్దిపేట అర్బన్, మార్చి 24 : మహిళలు స్వయం ఉపాధి కార్యక్రమాలు చేపట్టి ఆర్థిక స్వావలంబన, స్వయం సమృద్ధి సాధించాలన్నదే ప్రభుత్వ ధ్యేయమని ఆర్థిక, వైద్యారోగ్య శాఖల మంత్రి హరీశ్‌రావు అన్నారు. గురువారం పట్టణంలోని రెడ్డి ఫంక్షన్హాల్లో ఎస్బీఐ సిద్దిపేట రీజియన్ ఆధ్వర్యంలో చేపట్టిన స్వయం సహాయక సంఘాల లోన్ మేళాలో పాల్గొని మాట్లాడారు. ఒక్కో మహిళా గ్రూపుకు రూ.20 లక్షల రుణాలు ఇవ్వడం హర్షణీయన్నారు. గతంలో గ్రూపుకు రూ.50 వేలు ఇచ్చేందుకు ఎన్నోసార్లు ఆలోచించేవారన్నారు. స్వయం సహాయక సంఘాలపై ఉన్న నమ్మకంతోనే బ్యాంకర్లు రుణాలు ఇవ్వడానికి ముందుకు వస్తున్నారన్నారు. కాళేశ్వరం ప్రాజెక్టుతో గ్రామాల్లో నీటి కొదువ లేనందున పాడి యూనిట్లను ఎంచుకొని ఆర్థికంగా ఎదగాలన్నారు. తెలంగాణలోని స్వయం సహాయక గ్రూపులు దేశానికే ఆదర్శంగా నిలిచాయన్నారు. త్వరలోనే స్వయం సహాయం సంఘాలకు వడ్డీ లేని రుణాలను అందిస్తామన్నారు. అభయ హస్తంలో కట్టిన డబ్బులు కూడా వడ్డీతో సహా త్వరలోనే మీ బ్యాంకు అకౌంట్లో జమ చేస్తామని తెలిపారు. రెండు మూడు నెల్లలో అర్హులైన వారికి కొత్త పెన్షన్లు మంజూరు చేస్తామని మంత్రి తెలిపారు.
అన్ని రంగాల్లో గణనీయమైన అభివృద్ధి..
మంత్రి హరీశ్‌రావు నాయకత్వంలో సిద్దిపేట అన్ని రంగాల్లో గణనీయమైన అభివృద్ధి సాధిస్తున్నదని ఎస్బీఐ హైదరాబాద్ సర్కిల్ చీఫ్ జనరల్ మేనేజర్ అమిత్ జింగ్రాన్ అన్నారు. అనంతరం నియోజకవర్గ పరిధిలోని 120 స్వయం సహాయక సం ఘాలకు బ్యాంకు లింకేజీ కింద రూ.10కోట్లు, సిద్దిపేట పట్టణానికి చెందిన 41 స్వయం సహాయం సంఘాలకు రూ.5 కోట్ల వడ్డీ లేని రుణాలను ఎస్బీఐ ఆధ్వర్యంలో మంత్రి హరీశ్‌రావు అందజేశారు. కార్పొరేట్ సోషల్ రెస్పాన్సిబిలిటీ కింద ఎస్బీఐ ట్రాఫిక్ జంక్షన్లలో సీసీ టీవీ ఏర్పాటుకు సిద్దిపేట అడిషనల్ డీసీపీకి రూ.10 లక్షలు అందజేశారు. స్వయం సహాయక గ్రూపులకు రూ.20 లక్షల రుణాల చెక్కులను మంత్రి అందజేశారు. కార్యక్రమంలో జడ్పీ చైర్పర్సన్ వేలేటి రోజాశర్మ, అదనపు కలెక్టర్ ముజామ్మిల్‌ఖాన్, మున్సిపల్ చైర్మన్ మంజులారాజనర్సు, ఎస్బీఐ జనరల్ మేనేజర్ చంద్రకాంత్, డిప్యూటీ జనరల్ మేనేజర్ సత్యనారాయణ, డీఆర్డీవో గోపాల్‌రావు పాల్గొన్నారు.