సిద్దిపేట, మార్చి 24 : బీజేపీ ప్రభుత్వం అనుసరిస్తున్న రైతు, ప్రజా వ్యతిరేక విధానాలను ప్రజ లు, రైతులకు వివరించాలని, వడ్లు కొనేలా ప్రతి పంచాయతీ తీర్మానం చేసి, కేంద్రంపై ఒత్తిడి తీసుకురావాలని మంత్రి హరీశ్‌రావు అన్నారు. గురువారం సిద్దిపేటలోని పద్మనాయక కల్యాణ మండపంలో జడ్పీ చైర్పర్సన్ వేలేటి రోజాశర్మతో కలిసి ‘వడ్ల కొనుగోలుపై భవిష్యత్ కార్యాచరణ’పై సిద్దిపేట నియోజకవర్గస్థాయి సన్నాహక సమావేశం నిర్వహించారు.
ఈ సందర్భంగా మంత్రి మాట్లాడారు. ప్రజలకు ఆహార భద్రత కల్పించాల్సిన బాధ్యత కేంద్రానిదేనని, కానీ, కేంద్రం దానిని విస్మరించి, మొదటిసారిగా వడ్లను కొనబోమని తొండి పెడుతున్నదన్నారు. ఎందుకు కొనరని అడిగితే, స్టాక్ ఎక్కువగా ఉందని కుంటిసాకులు చెబుతున్నదన్నారు. పంజాబ్‌లో 100శాతం ధాన్యం కొంటారు గానీ, తెలంగాణలో కొనాలని చెబితే, కాలికేస్తే మెడకు.. మెడకేస్తే కాలికి వేస్తూ రైతుల ఉసురు పోసుకుంటున్నదన్నారు. అన్ని రాష్ర్టాల్లో సమానంగా ధాన్యం కొనాలన్నారు. మద్దతు ధరను ప్రకటించి వడ్లు కొనాలని డిమాండ్ చేశారు.
తెలంగాణ రాష్ట్రం వచ్చాక సీఎం కేసీఆర్ రైతులకు కాళేశ్వరం ప్రాజెక్టు ద్వారా సాగునీరు, 24 గంటల కరెంట్, రైతుకు రూ.10వేల పెట్టుబడి అందించి రైతుబీమాను అందిస్తున్నారని మంత్రి తెలిపారు. బీజేపీ పాలిత రాష్ర్టాల్లో ఇలా ఇస్తున్నారా? అని ప్రశ్నించారు. డీజిల్, పెట్రో, గ్యాస్ ధరలు పెంచుకుంటూ ఝూటా మాటలు చెప్పే బట్టేబాజ్ పార్టీ బీజేపీ అని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఐదు రాష్ర్టాల్లో ఎన్నికలు రాగానే, పెట్రో , డీజిల్ ధరలు దించి, ఎన్నికలు కాగానే రేట్లు పెంచిందన్నారు. ఈ విషయాన్ని తాను గతంలో చెప్పానని మంత్రి గుర్తు చేశారు. బావుల దగ్గర మీటర్లు పెట్టుడు.. సబ్సిడీలు తగ్గిస్తూ, ఎరువుల ధరలు పెంచారని కేంద్రం తీరును దుయ్యబట్టారు. కేంద్రం తీరును నిరసిస్తూ పార్టీ ఆదేశాల మేరకు త్వరలో ప్రతి ఇంటిపై నల్లా జెండాను ఎగురవేయాలని, బీజేపీ నాయకుల తప్పుడు ప్రచారాలపై ప్రతీ కార్యకర్త గొంతు విప్పాలని సూచించారు. పెట్రో, గ్యాస్ ధరల పెంపును నిరసిస్తూ పట్టణాల్లో వివిధ రూపాల్లో నిరసనలు తెలుపాలన్నారు.
కార్యక్రమంలో టీఆర్ఎస్ రాష్ట్ర కార్యదర్శి వేలేటి రాధాకృష్ణ శర్మ, రైతుబంధు సమితి జిల్లా అధ్యక్షుడు వంగ నాగిరెడ్డి, సుడా చైర్మన్ రవీందర్‌రెడ్డి, మున్సిపల్ చైర్మన్ మంజులారాజనర్సు, ఎంపీపీలు శ్రీదేవి, మాణిక్యరెడ్డి, మాజీ ఎంపీపీ జాప శ్రీకాంత్ రెడ్డి, టీఆర్ఎస్ మండలాధ్యక్షులు ఎర్ర యాదయ్య, ఎద్దు యాదగిరి, లింగం గౌడ్, జడ్పీటీసీలు శ్రీహరిగౌడ్, ఉమ, ఏఎంసీల చైర్మన్లు సాయిరాం, సారయ్య, శ్రీనివాస్, ఆత్మ కమిటీ చైర్మన్ ప్రభాకర్ వర్మ, పీఏసీఎస్ చైర్మన్లు కోల రమేశ్‌గౌడ్, మహిపాల్‌రెడ్డి, నరేందర్‌రెడ్డి, ముల్కాల కనకరాజు, నాయకులు కోమండ్ల రాంచంద్రారెడ్డి, మో హన్‌లాల్, గుండు భూపేశ్, బూర విజయ, మెకిల్ల మోహన్‌రెడ్డితోపాటు గ్రామాల ప్రజాప్రతినిధులు, కార్యకర్తలు పాల్గొన్నారు.
టీఆర్ఎస్లోకి బీజేపీ పట్టణ మీడియా సెల్ కన్వీనర్
బీజేపీ మీడియా సెల్ సిద్దిపేట పట్టణ కన్వీనర్ జనగాం సతీశ్ తన అనుచరులతో కలిసి గురువారం మంత్రి సమక్షంలో టీఆర్ఎస్లో చేరారు. ఈ సందర్భంగా మంత్రి వారికి గులాబీ కండువాను కప్పి పార్టీలోకి ఆహ్వానించారు.