మనోహరాబాద్, మార్చి 23 : మెదక్ జిల్లాలోని మనోహరాబాద్ ప్రాంతం పారిశ్రామికంగా పరుగులు తీస్తున్నది. ప్రభుత్వం కృషితో ఈ ప్రాంతానికి పరిశ్రమలు తరలి వస్తున్నాయి. వేలాది మందికి ఉపాధి కల్పించేందుకు మనోహరాబాద్ మండలానికి మరో రెండు పారిశ్రామిక వాడలు రానున్నాయి. ప్రత్యేక రాష్ట్రం ఏర్పడిన ఏడేండ్లలోనే తెలంగాణ అభివృద్ధి వైపు దూసుకెళ్తుండడంతో దేశంతో పాటు ఇతర దేశాల పారిశ్రామిక వేత్తలు పెట్టుబడులు పెట్టేందుకు ముందుకు వస్తున్నారు. మంత్రి కేటీఆర్ కృషితో హైదరాబాద్ నగరానికి చేరువలో ఉన్న మనోహరాబాద్ మండలంలో తమ పరిశ్రమలను ఏర్పాటు చేసేందుకు ఉత్సాహం చూపుతున్నారు.
ఇప్పటికే వేలాది మందికి దేశ ప్రజలకు జీవనోపాధికి నిలయమైన మనోహరాబాద్ మండలం, మరో రెండు పారిశ్రామిక వాడలతో మెదక్ జిల్లాలోనే అతిపెద్ద పారిశ్రామిక వాడగా నిలువనున్నది. తెలంగాణ స్టేట్ ఇండస్ట్రియల్ ఇన్ఫాస్ట్రక్చర్ కార్పొరేషన్ లిమిటెడ్(టీఎస్ఐఐసీ ) ద్వారా మండలంలోని ముప్పిరెడ్డిపల్లి, కాళ్లకల్లో 342,35 4 సర్వే నంబర్లో 750 ఎకరాల్లో పారిశ్రామిక వాడ ఏర్పాటైంది. కూచారంలో 148వ సర్వే నంబర్లో 82.20 ఎకరాల్లో మరో పారిశ్రామిక వాడ ఉంది. వీటిలో ఏర్పాటు చేసిన పరిశ్రమలతో రాష్ట్రంలోని పలు ప్రాంతాలతో పాటు వివిధ రాష్ర్టాల ప్రజలు ఉపాధి కోసం మనోహరాబాద్ మండలానికి వలస వచ్చి జీవనోపాధి పొందుతున్నారు.
ఐటీశాఖ మంత్రి కేటీఆర్ కృషితో తెలంగాణలో పెట్టుబడి పెట్టేందుకు ముందుకు వస్తున్నారు. ఇటీవలే కొండాపూర్, ముప్పిరెడ్డిపల్లి శివారులో 191 ఎకరాల భూమిని టీఎస్ఐఐసీ కోసం రైతులకు ఎకరాకు రూ. 10.50 లక్షల చొప్పున నష్టపరిహారం చెల్లించి భూమిని సేకరించింది. ప్రస్తుతం కొండాపూర్ నుంచి 1.4 కిలోమీటర్ల మేర 100ఫీట్ల రోడ్డును నిర్మాణ పనులు శరవేగంగా కొనసాగుతున్నాయి.
ఉపాధిపైనే ఆయా గ్రామాల ఆశలు..
పారిశ్రామిక వాడలు ఏర్పాటైతే ఉపాధి లభిస్తుందని మనోహరాబాద్ మండల ప్రజలు ఆశపడుతున్నారు. ఎప్పటి నుంచో పరిశ్రమల కోసం వేచి చూస్తున్నారు. ప్రస్తుతం వస్తున్న రెండు పారిశ్రామిక వాడలతో వారికి ఉపాధి కల్పించనున్నాయి. ఇంతకు ముందు ఉపాధి కోసం నలు నగరాలకు వలస వెళ్లి జీవించే వారు. ఇప్పుడు వస్తున్న పరిశ్రమలతో స్థానికంగా ఉపాధిని పొందవచ్చని ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు.
నూతనంగా మరో రెండు పారిశ్రామిక వాడలు..
ఇదివరకు కాళ్లకల్, ముప్పిరెడ్డిపల్లి, కూచారంలో ఉన్న రెండు పారిశ్రామిక వాడలతో పాటు నూతనంగా కొండాపూర్లో 191 ఎకరాల్లో మరో పారిశ్రామిక వాడ ఏర్పాటు కాబోతున్నది. మనోహరాబాద్ మండలంలోని రంగాయిపల్లి, పోతారంలో గ్రామాల్లో పరిశ్రమల ఏర్పాటుకు స్థలం కావాలని టీఎస్ఐఐసీ ప్రతిపాదించింది. రంగాయిపల్లిలో 45 ఎకరాలు, పోతారంలో 229 ఎకరాల భూమి అవసరం ఉందని కోరింది. దీంతో ఆయా గ్రామాల్లో పారిశ్రామిక వాడల కోసం భూ సేకరణ చేసే పనిలో రెవెన్యూ అధికారులు నిమగ్నమయ్యారు. దీని కోసం ఆయా గ్రామాల్లో అప్పట్లో ప్రభుత్వం ఇచ్చిన భూమిలో సర్వే నిర్వహిస్తున్నారు. రైతులతో చర్చలు జరుపుతున్నారు. ప్రభుత్వం తాము కోరిన నష్టపరిహారం చెల్లిస్తే పరిశ్రమ ఏర్పాటుకు తమ భూములను స్వచ్ఛందంగా అప్పగిస్తామని ఆయా గ్రామాల రైతులు తెలుపుతున్నారు.
రైతులతో చర్చిస్తున్నాం..
మనోహరాబాద్ మండలంలో రెం డు పరిశ్రామిక వాడల కోసం భూసేకరణ చేయాలని ప్రభుత్వం ఆదేశించింది. దీనికోసం రంగాయిపల్లి, పోతా రం గ్రామాల్లో పారిశ్రామిక వాడల కోసం భూసేకరణ ప్రారంభించాం. రంగాయిపల్లిలో 45 ఎకరాలు, పోతారంలో 229 ఎకరాల్లో సర్వే జరిపి, రైతులతో చర్చిస్తున్నాం. రైతుల సమ్మతితో భూసేకరణ చేసి ప్రభుత్వానికి నివేదిక అందజేస్తాం.
-శ్యాంప్రకాశ్, తూప్రాన్ ఆర్డీవో