గజ్వేల్ రూరల్, మార్చి 23: రాజ్యాంగాన్ని విచ్ఛిన్నం చేసే కుట్ర జరుగుతోందని రాష్ట్ర వైద్య సేవల మౌలిక వసతుల కార్పొరేషన్ చైర్మన్ ఎర్రోళ్ల శ్రీనివాస్ అన్నారు. గిరిజనుల రిజర్వేషన్ అమలులో కేంద్ర అవలంబిస్తున్న విధానాలకు నిరసనగా బుధవారం సాయంత్రం గజ్వేల్‌లోని అంబేద్కర్ చౌరస్తాలో ప్రధాని మోదీ దిష్టిబొమ్మను దహనం చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. 2017లో సీఎం కేసీఆర్ నాయకత్వంలో గిరిజనులకు ఆరు నుంచి 10శాతం రిజర్వేషన్లు కల్పించాలని అసెంబ్లీలో తీర్మానం చేసి కేంద్రానికి పంపితే, అదే సమయంలో ప్రతిపక్ష నేతగా ఉన్న కిషన్‌రెడ్డి నేడు అసలు బిల్లు ఎక్కడుందో తెలియని చెప్పడం విడ్డూరంగా ఉందన్నారు. తండాలను గ్రామ పంచాయతీలుగా చేసిన ఘనత సీఎం కేసీఆర్‌కే దక్కిందన్నారు. గిరిజనులకు ప్రధాని మోదీ, సంబంధితశాఖ మంత్రి క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు. కార్యక్రమంలో ఎమ్మెల్సీ యాదవరెడ్డి, ఎఫ్డీసీ చైర్మన్ వంటేరు ప్రతాప్‌రెడ్డి, మాదాసు శ్రీనివాస్, దేవీ రవీందర్ పాల్గొన్నారు.
కేంద్ర ప్రభుత్వ దిష్టిబొమ్మ దహనం
హుస్నాబాద్, మార్చి 23: గిరిజనుల రిజర్వేషన్లు 10శాతానికి పెంచాలని కోరుతూ బుధవారం పట్టణంలోని అంబేద్కర్ చౌరస్తాలో ఎంపీపీ లకావత్ మానస ఆధ్వర్యంలో గిరిజనులు కేంద్ర ప్రభుత్వ దిష్టిబొమ్మను దహనం చేశారు. ఈ సందర్భంగా ఎంపీపీ మాట్లాడుతూ గిరిజనులకు 10శాతం రిజర్వేషన్లు పెంచాలని తీర్మానం చేసి కేంద్ర ప్రభుత్వానికి ప్రతిపాదనలు పంపినప్పటికీ పార్లమెంట్లో అలాంటి ప్రతిపాదన రాలేదన్నారు. అవగాహన లేకుండా మాట్లాడిన కేంద్ర మంత్రిని బర్తరఫ్ చేయాలని డిమాండ్ చేశారు. సర్పంచ్ రజిత, నాయకులు రమేశ్‌నాయక్, రాజునాయక్, మోతీలాల్, తిరుపతినాయక్ పాల్గొన్నారు.