సిద్దిపేట కమాన్, మార్చి 23 : సీఎం సహాయనిధి నిరుపేదలకు సంజీవనిలా ఉపయోగపడుతున్నదని రాష్ట్ర ఆర్థిక, వైద్య ఆరోగ్యశాఖల మంత్రి తన్నీరు హరీశ్‌రావు అన్నారు. బుధవారం సిద్దిపేట క్యాంపు కార్యాలయంలో 31 మంది బాధితులకు రూ.12,25,500 సీఎంఆర్ఎఫ్ చెక్కులను అందజేశారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ పేదల సంక్షేమమే ధ్యేయంగా తెలంగాణ ప్రభుత్వం పని చేస్తున్నదన్నారు. పేదలకు ఎలాంటి కష్టమొచ్చినా ఆత్మీయ భరోసా ఇస్తున్నామన్నారు. పేదలు ఇబ్బంది పడొద్దనే సిద్దిపేట ప్రభుత్వ దవాఖానలో మెరుగైన వైద్య సేవలు అందజేస్తున్నామని చెప్పారు.
ప్రభుత్వ దవాఖానల్లో అన్ని రకాల వైద్య సదుపాయాలు అందుబాటులో ఉన్నాయని తెలిపారు. రూ.8 కోట్లతో క్యాథ్‌ల్యాబ్ మిషనరీ తెప్పించబోతున్నట్లు చెప్పారు. సిద్దిపేట నియోజకవర్గంలో ఇప్పటివరకు 4,753 మందికి రూ.19,66,63, 234 ఆర్థిక భరోసా కల్పించామన్నారు. చిన్నకోడూరు మండలంలో 9 మందికి రూ.3.85 లక్షలు, నంగునూరులో ముగ్గురికి రూ.1.80 లక్షలు, నారాయణరావుపేటలో ముగ్గురికి రూ.52,500, సిద్దిపేట రూరల్ ఒకరికి రూ.55 వేలు, సిద్దిపేట అర్బన్ ఒకరికి రూ.60 వేలు, పట్టణంలో 14 మందికి రూ.4. 93 లక్షల చొప్పున మొత్తం 31 మందికి సీఎంఆర్ఎఫ్ చెక్కులు అందజేశామన్నారు. కార్యక్రమంలో మాజీ మున్సిపల్ చైర్మన్ రాజనర్సు, సుడా చైర్మన్ రవీందర్‌రెడ్డి, మార్కెట్ కమిటీ చైర్మన్ సాయిరాం పాల్గొన్నారు.
సీఎం రిలీఫ్ ఫండ్ నిరుపేదలకు వరం
బెజ్జంకి, మార్చి 23 : సీఎం రిలీఫ్ ఫండ్ నిరుపేదలకు వరంలాంటిదని రాష్ట్ర సాంస్కృతిక సారథి చైర్మన్, ఎమ్మెల్యే రసమయి బాలకిషన్ అన్నారు. మండలంలోని గుగ్గిళ్లలో పలువురికి మంజూరైన సీఎం రిలీఫ్ ఫండ్ చెక్కులను నేరుగా బాధితుల ఇంటికెళ్లి ఎమ్మెల్యే అందజేశారు. ఎమ్మెల్యే సాధారణ వ్యక్తిలా ఇంటింటికీ వెళ్లి చెక్కులు అందజేయడంతో గ్రామస్తులు సంతోషం వ్యక్తం చేశారు. అనంతరం గ్రామానికి చెందిన టీఆర్ఎస్ నాయకుడు చిట్టెల శంకరయ్య తల్లి మల్లవ్వ ఇటీవల మరణించగా, ఎమ్మెల్యే వారి కుటుంబ సభ్యులను పరామర్శించి ప్రగాఢ సంతాపం తెలిపారు. ఆయన వెంట మార్కెట్ కమిటీ చైర్మన్ రాజయ్య, నాయకులు లక్ష్మణ్, తిరుపతి, శ్రీనివాస్‌గుప్తా, భూమయ్య, తిరుపతి, సంతోశ్, సురేశ్ పాల్గొన్నారు.