గజ్వేల్ నియోజకవర్గంలోని పుణ్యక్షేత్రాలకు రాజయోగం పట్టనున్నది. 600 ఏండ్ల నాచగిరి, 700ఏండ్ల వర్ధరాజపూర్ క్షేత్రాలకు పూర్వ వైభవం రానున్నది. సీఎం కేసీఆర్ ఆదేశాలతో నాచగిరి లక్ష్మీనరసింహస్వామి, మర్కూక్ మండలం వర్ధరాజ్‌పూర్ ఆలయాల అభివృద్ధికి అధికారులు ప్రణాళికలు సిద్ధం చేశారు. లక్ష్మీనర్సింహస్వామి ఆలయాభివృద్ధి మాస్టర్ ప్లాన్ అమలుకు రూ.100కోట్లు ఖర్చు అవుతుందని అధికారులు అంచనా వేశారు. రూ.10కోట్లతో వరదరాజస్వామి ఆలయాభివృద్ధికి చర్యలు తీసుకుంటున్నారు. జగదేవ్‌పూర్ మండలం తీగుల్ నర్సాపూర్ గ్రామ పరిధిలోని కొండపోచమ్మ ఆలయాన్ని రూ.20కోట్లతో పునర్నిర్మించనున్నారు. ఇప్పటికే యావత్ దేశమే తెలంగాణ వైపు చూసేలా యాదాద్రిని గొప్ప క్షేత్రంగా సీఎం కేసీఆర్ తీర్చిదిద్దుతున్నారు. అలాగే, గజ్వేల్ నియోజకవర్గంలోని పుణ్యక్షేత్రాలకు మహర్దశ పట్టించనున్నారు.
గజ్వేల్, మార్చి 10 : ప్రజలనే కాదు.. ప్రజలు కొలిచే దేవుళ్లను సైతం సీమాంధ్ర ప్రభుత్వాలు నిర్లక్ష్యం చేశాయి. ప్రత్యేక రాష్ట్రం ఏర్పాటుతో ప్రజలతో పాటు దేవుళ్లకు కూడా తెలంగాణలో మంచిరోజులొచ్చాయి. ఇప్పటికే యావత్ దేశమే తెలంగాణ వైపు చూసేలా యాదాద్రిని శ్రీ కృష్ణదేవరాయలు కన్నా గొప్పగా సీఎం కేసీఆర్ తీర్చిదిద్దుతున్నారు. గజ్వేల్ నియోజకవర్గంలోని పుణ్యక్షేత్రాలు సమైక్య ప్రభుత్వాల హయాంలో నిర్లక్ష్యానికి గురి కాగా, వాటి అభివృద్ధికి గ్రహణం పట్టింది. సీఎం కేసీఆర్ ప్రత్యేక చొరవతో మళ్లీ ఆ పుణ్యక్షేత్రాలకు రాజయోగం పట్టింది.
గజ్వేల్ నియోజకవర్గం నాచగిరి లక్ష్మీనరసింహస్వామి ఆలయం, మర్కూక్ మండలం వర్ధరాజ్‌పూర్ ఆలయాల అభివృద్ధికి సీఎం కేసీఆర్ ఆదేశాలతో అధికారులు చర్యలను ముమ్మరం చేశారు. 2017లో తూప్రాన్ పర్యటన ముగించుకుని గజ్వేల్ వైపు వస్తున్న క్రమంలో అప్పటి నాచారం ఆలయ చైర్మన్ కొట్టాల యాదగిరితో పాటు కమిటీ సభ్యులను చూసి బస్సు దిగారు. నాచారం ఆలయ పరిసరాలు, హరిద్రానది పరిశీలించారు. ఆలయాభివృద్ధిలో భాగంగా వెంటనే హరిద్రానదిని ప్రక్షాళన చేసి సుందరీకరించాలని కలెక్టర్‌కు ఆదేశాలు జారీ చేశారు.
ఆ మేరకు నది అభివృద్ధికి రూ.8.50 కోట్లు విడుదల చేశారు. హరిద్రానదిలో చెక్‌డ్యాంలు పూర్తి కాగా ప్రస్తుతం పుష్కరఘాట్లు నిర్మించాల్సి ఉంది. అలాగే, కమిటీ కోరిక మేరకు వెంటనే ఆలయాభివృద్ధికి మాస్టర్ ప్లాన్ సిద్ధం చేయాలని అధికారులను ఆదేశించారు. అప్పటి ఆలయ కమిటీ చైర్మన్ యాదగిరి, అధికారులు దాదాపు మాస్టర్ ప్లాన్ అమలుకు రూ.100కోట్లు ఖర్చు అవుతుందని అంచనా వేశారు. అప్పుడే యాదాద్రి ఆర్కిటెక్చర్ ఆనందసాయి, యాదాద్రి ఈవీ గీత, దేవాదాయశాఖ అధికారులు సమావేశాలు కూడా నిర్వహించారు.
అలాగే ఆలయ అభివృద్ధిలో భాగంగా తిరుమాడ వీధుల నిర్మాణం, రథశాల, కోనేరు, షాపింగ్ కాంప్లెక్స్, అండర్ గ్రౌండ్ డ్రైనేజీ, తాగునీటి వసతి తదితర పనులను పూర్తి ప్రణాళికాబద్ధంగా నిర్వహించాలని అధికారులకు సీఎం కేసీఆర్ సూచించారు. కరోనా మూలంగా కొద్ది రోజులు పనుల్లో ముందడగు వేయలేకపోయారు. ఇటీవల సీఎం కేసీఆర్ నియోజకవర్గ ప్రజాప్రతినిధులతో పాటు అధికారులతో చర్చించి, నియోజకవర్గంలోని పెండింగ్ పనులను పూర్తి చేయాలని ఆదేశించారు. ఇదే సందర్భంలో నాచారం ఆలయ కమిటీ అధ్యక్షుడు హనుమంతరావు మంత్రి హరీశ్‌రావు ద్వారా సీఎం కేసీఆర్ దృష్టికి ఆలయాభివృద్ధికి గురించి తీసుకెళ్లారు. దీంతో తిరిగి నాచారం ఆలయ అభివృద్ధి చర్యల్లో వేగం పెరిగింది. ఇటీవలే దేవాదాఖ శాఖ కమిషనర్, ఎఫ్డీసీ చైర్మన్ ప్రతాప్‌రెడ్డి, ఎమ్మెల్సీ యాదవరెడ్డి, నాచారం ఆలయకమిటీ అధ్యక్షుడు హన్మంతరావు తదితరులు ఆలయాభివృద్ధిపై చర్చించారు. పనుల నిర్వహణకు పూర్తి ప్రణాళికలు సిద్ధం చేసి, త్వరలో పనులను ప్రారంభించనున్నారు.
కొండపోచమ్మ ఆలయ పునర్నిర్మాణానికి రూ.20కోట్లు
కోరిన కోర్కెలు తీర్చే కొండపోచమ్మ ఆలయాభివృద్ధికీ సీఎం కేసీఆర్ ప్రత్యేక చొరవ తీసుకున్నారు. కొండపోచమ్మ పేరున మర్కూక్‌లో ఇప్పటికే కొండపోచమ్మ సాగర్ రిజర్వాయర్ నిర్మించడంతో కొండపోచమ్మ ఆలయం మరింత ప్రఖ్యాతి పొందింది. తెలంగాణ ఏర్పాటు తర్వాత కొమురవెల్లి ఆలయాన్ని అద్భుతంగా తీర్చిదిద్దగా, ఆలయ చరిత్రతో కొండపోచమ్మ ఆలయం కూడా అనుసంధానమై ఉండడం.. కొమురవెల్లిని దర్శించుకున్న భక్తులు కొండపోచమ్మను తప్పనిసరిగా దర్శించుకోవడం ఆచారంగా వస్తున్నది. ఈ విషయాన్ని గుర్తించిన సీఎం కేసీఆర్, జగదేవ్‌పూర్ మండలం తీగుల్ నర్సాపూర్ గ్రామ పరిధిలోని కొండపోచమ్మ ఆలయాన్ని కూడా అభివృద్ధి చేయడానికి నిర్ణయం తీసుకున్నారు. ఈ మేరకు రూ.20కోట్లతో ఆలయాన్ని పునర్నిర్మించడానికి చర్యలను ముమ్మరం చేశారు. తెలంగాణ ఏర్పాటుతోనే రాజీవ్ రహదారి నుంచి కొండపోచమ్మ, కొమురవెల్లికి భక్తులకు ప్రయాణం సులభతరం చేయడానికి రోడ్లను విస్తరించారు. ప్రస్తుతం ఆ రోడ్లను అందంగా తీర్చిదిద్దడంతో ప్రయాణికులతో ఎప్పుడు రద్దీగా ఉంటున్నాయి.
గజ్వేల్ రాముడికీ ఘనమైన ఆలయం
గజ్వేల్ పట్టణంలోని శతాబ్దాల చరిత్ర కలిగిన సీతారామ ఉమామహేశ్వర ఆలయంలో రామున్ని, శివున్ని భక్తితో పూజించిన వారే తప్పా, ఆలయాభివృద్ధికి ఏ ప్రభుత్వాలు పట్టించుకున్న పాపాన పోలేదు. గజ్వేల్ అభివృద్ధిలో భాగంగా పలు అంశాలను పరిశీలించిన సీఎం కేసీఆర్ దృష్టికి స్థానికులు గజ్వేల్ రామాలయ అభివృద్ధిని చేయాలంటూ కోరారు. వెంటనే సీఎం కేసీఆర్ స్పందించి ఆలయ నిర్మాణానికి రూ.5 కోట్లు మంజూరు చేశారు. ఎంతో అద్భుతంగా పూర్తి కృష్ణశిలతో యాదాద్రి తరహా ఆలయాల నిర్మాణం అద్భుతంగా జరుగుతున్నది. ఇప్పటివరకు రామాలయం, శివాలయాల గర్భగుడులు రూపుదిద్దుకోగా, వాటికి గోపురాలు, మండపనిర్మాణాలు, గోపురం తదితర పనులు కొనసాగుతున్నాయి. పర్వదినాల్లో సీతారామ ఉమామహేశ్వరులను బాలాలయంలో దర్శించుకునే భక్తులు కొనసాగుతున్న ఆలయ పునర్సిర్మాణ పనులను చూసి సంతోషాన్ని వ్యక్తం చేస్తున్నారు.
రూ.10కోట్లతో వరదరాజస్వామి ఆలయాభివృద్ధికి చర్యలు
మర్కూక్ మండలం వర్ధరాజ్పూర్లో క్రీ.శ.1356లో నిర్మించిన వరదరాజస్వామి ఆలయం ఇప్పటికీ ఎలాంటి అభివృద్ధికి నోచుకోలేదు. ఆలయాన్ని సీఎం కేసీఆర్ క్షుణ్ణంగా పరిశీలించారు. ఆలయాభివృద్ధికి అవసరమైన సలహాలు,సూచనలు చేశారు. రూ.10కోట్లతో వరదరాజస్వామి ఆలయ రాజగోపురం, ప్రహ రీ, వంటశాల, యాగశాల, కల్యాణ మం డపం తదితర పనులను చేయడానికి వెంటనే చర్యలు చేపట్టాలని సీఎం కేసీఆర్ ఆదేశాలు జారీ చేయడంతో ఇటీవల ఎమ్మెల్సీ వెంకట్రామ్రెడ్డి, ఎఫ్డీసీ చైర్మన్ ప్రతాప్‌రెడ్డి, కలెక్టర్ హనుమంతరావు ఆలయాభివృద్ధిపై మరోసారి స్థానికులతో చర్చించారు. ఆలయాభివృద్ధికి మాస్టర్‌ప్లాన్ రూపొందించడంలో నిమగ్నమయ్యారు. ఆలయాభివృద్ధితోపాటు ప్రజల కోరిక మేరకు వర్ధరాజ్‌పూర్ గ్రామాభివృద్ధికి సైతం రూ.10కోట్లను సీఎం కేసీఆర్ మంజూరు చేశారు.
ఇన్ని రోజులూ ఎవరూ పట్టించుకోలేదు
కంచి తర్వాత అంతటి గొప్ప ఆలయంగా గతంలో వర్ధరాజస్వామి ఆలయం పేరు పొందింది. కానీ, సీమాంధ్ర ప్రభుత్వాలు ఎన్ని వచ్చినా, ఎంతమంది పాలకులు వచ్చినా మా వరదరాజస్వామిని ఏమాత్రం పట్టించుకోలేదు. సీఎం కేసీఆర్ ఆలయ విశేషాలను తెలుసుకొని, ఆలయాన్ని అభివృద్ధి చేద్దామని మా గ్రామప్రజలతో అన్నారు. ఆలయాన్ని పరిశీలించారు. అభివృద్ధి చేయడానికి అవసరమైన ప్రణాళికలు కూడా సిద్ధం చేస్తున్నారు. గతంలో ఈ ఆలయానికి పూర్వవైభవం ఎప్పుడొస్తుందా? అని అందరూ అనుకునేవాళ్లం. సీఎం సార్ ఆలయ అభివృద్ధికి రూ.10కోట్లు కేటాయించారు. దీంతో మా ఊరి ఆలయంతో పాటు మా ఊరు కూడా రాష్ట్రంలో మరింత పేరుపొందుతుంది. సీఎం సార్‌కు ధన్యవాదాలు.
– అప్పాల ప్రవీణ్, సర్పంచ్ వర్ధరాజ్‌పూర్
సీఎం సార్ ఒక్కమాటతో మా రోడ్లన్నీ బాగయ్యాయి
గతంలో కొండపోచమ్మ ఆలయానికి రావాలంటే ఇరుకురోడ్డుతో భక్తులతో పాటు గ్రామస్తులు ఇబ్బందులు పడేవారు. సీఎం కేసీఆర్ సమస్యను గుర్తించి, వెంటనే రోడ్లను వెడల్పు చేయించారు. కుకునూర్‌పల్లి, జగదేవ్‌పూర్ రెండు వైపుల నుంచి కొండపోచమ్మకు చక్కని దారులను నిర్మించారు. ఇక ఆలయ పునర్నిర్మాణానికి నిధులు మంజూరు చేయడంతో అధికారులు పనులు ప్రారంభించారు.
– గర్నెపల్లి రజిత, సర్పంచ్, తీగుల్ నర్సాపూర్
యాదాద్రి తరహాలో నాచగిరి సీఎం కేసీఆర్ సంకల్పం
సీఎం కేసీఆర్ దైవభక్తితో ఆలయాలకు మహోన్నత వైభవం చేకూరుతుంది. యాదాద్రి తరహా నాచగిరిని అభివృద్ధి చేయాలన్నది సీఎం కేసీఆర్ సంకల్పం. అందుకే నాచారం లక్ష్మీనరసింహాస్వామి ఆలయాన్ని క్షుణ్ణంగా పరిశీలించి, ఆలయాభివృద్ధికి స్వయంగా అధికారులకు సూచనలు చేశారు. అభివృద్ధిలో భాగంగా హరిద్రా నదిలో చెక్‌డ్యాంలు, పుష్కరఘాట్ల పనులను నిర్వహిస్తున్నారు. ఇప్పటికే అంతర్గత డ్రైనేజీ, తాగునీటి వసతి, ప్రధాన ఆలయాభివృద్ధి తదితర అంశాలతో మాస్టర్ ప్లాన్ రూపొందించారు. దేవాదాయశాఖ కమిషనర్ ఇటీవలే ఆలయాన్ని పరిశీలించి వెళ్లారు. పనుల నిర్వహణకు ప్రతిపాదనలు కూడా సిద్ధమవుతున్నాయి. నాచగిరిని అభివృద్ధి చేస్తున్నందుకు సీఎం కేసీఆర్, మంత్రి హరీశ్‌రావుకు కృతజ్ఞతలు.
– హన్మంతరావు, నాచగిరి ఆలయ కమిటీ చైర్మన్