‘మా పిల్లలకు అడ్మిషన్ ఇవ్వండి ప్లీజ్.. ఈ యేడాది కాకపోయినా వచ్చే యేడాది అయినా చూడండి’.. అని తల్లిదండ్రులు వేడుకోవడం అక్కడ కనిపిస్తుంది.. అలా అని అది ఏ హయ్యర్ ఎడ్యుకేషన్ సొసైటీ కాదు.. కేవలం ప్రభుత్వ ప్రైమరీ స్కూల్ అది..
హుస్నాబాద్ టౌన్, మార్చి 10 : అది సర్కారు బడైనప్పటికీ ఈ పాఠశాలలో చేరేందుకు విద్యార్థులు పోటీ పడుతుంటారు. ఆరేండ్లుగా ఆంగ్ల విద్యను పూర్తిస్థాయిలో ప్రారంభించి ప్రైవేట్ బడులకు దీటుగా మలిచి, జిల్లాలోనే విద్యార్థులు అధికంగా ఉన్న పాఠశాలల జాబితాలో మొదటిగా నిలిచింది. సర్కారుతో పాటు స్థానికుల సహకారంతో ఇక్కడి ఉపాధ్యాయులు విద్యార్థులకు ఆంగ్లలోనే విద్యనందిస్తూ తల్లిదండ్రుల నమ్మకాన్ని నిలబెడుతూ హుస్నాబాద్మండల పరిషత్ ప్రాథమిక పాఠశాలను మనందరి బడిగా మార్చారు.
320మంది విద్యార్థులతో జిల్లాలోనే మొదటి
హుస్నాబాద్ పట్టణంలోని మండల పరిషత్ ప్రాథమిక పాఠశాలలో ఒకప్పుడు 150మంది విద్యార్థులు మాత్రమే ఉండేవారు. కానీ, మారుతున్న కాలానికి అనుగుణంగా ఈ పాఠశాలలో ఇంగ్లిష్ మీడియం మొదలు పెట్టడంతో నేడు విద్యార్థుల సంఖ్య 320మందికి చేరింది. 1వ తరగతి నుంచి 5వ తరగతి వరకు ఉన్న ఈ పాఠశాలలో మూడో తరగతి నుంచి ఐదో తరగతి వరకు విద్యార్థుల సంఖ్య అధికంగా ఉండటంతో రెండేసి సెక్షన్లు పెట్టి విద్యనందిస్తున్నారు. పాఠశాలలో ఆరు తరగతి గదులుండగా, ఐదుగురు ఉపాధ్యాయులు, మరో ఇద్దరు క్రాఫ్ట్ టీచర్లతో పాఠశాలలో బోధనను కొనసాగిస్తున్నారు. సిద్దిపేట జిల్లాలోనే అత్యధిక విద్యార్థులు కల్గిన పాఠశాలగా హుస్నాబాద్ మండలపరిషత్ ప్రాథమిక పాఠశాల మొదటి స్థానంలో ఉండటం విశేషం.
ప్రత్యేక శ్రద్ధ.. తల్లిదండ్రుల నమ్మకం..
ప్రైవేటు పాఠశాలలపై మక్కువ చూపించే ఈ తరుణంలో ప్రభుత్వ ప్రాథమిక పాఠశాలలో విద్యార్థులు చేరేందుకు ఆసక్తిచూపించడం ఈ పాఠశాల పనితీరుకు నిదర్శనమనే చెప్పవచ్చు. ఉపాధ్యాయుల అంకితభావం, ప్రత్యేక శ్రద్ధ, ఇంగ్లిష్ మీడియంలో బోధనతో విద్యార్థులు ఈ పాఠశాలలో చేరేందుకు ఆసక్తిచూపుతున్నారు. విద్యార్థుల ప్రగతిని ఎప్పటికప్పుడు పరిశీలించేందుకు ప్రతినెలా పరీక్షతోపాటు సాంస్కృతిక కార్యక్రమాలను సైతం నిర్వహిస్తున్నారు. ప్రగతిపై విద్యార్థుల తల్లిదండ్రులకు ఎప్పటికప్పుడు సమాచారం అందించడం చేస్తున్నారు. ఈ ఏడాది 40మందికిపైగా విద్యార్థులకు అడ్మిషన్లు ఇవ్వకుండా వెనక్కి పంపారంటే విద్యార్థుల తల్లిదండ్రులకు పాఠశాలపై ఉన్న నమ్మకమే ఎలాంటిదో చెప్పవచ్చు.
దాతల సహకారం..
ఈ పాఠశాలకు పలువురు దాతలు సైతం సహాయం అందిస్తున్నారు. పాఠశాలలో 1988 ఎస్సెస్సీ బ్యాచ్ విద్యార్థులు గాంధీ విగ్రహాన్ని నెలకొల్పగా, బాల వికాస సంస్థ ఆధ్వర్యంలో శానిటైజేషన్, లెగ్ పుట్ హ్యాండ్ వాష్ స్టేషన్, లెగ్ ఆపరేటింగ్ హ్యాండ్ వాష్ బేసిన్ను బహూకరించగా, మరికొందరు పాఠశాలకు అవసరమైన సామగ్రి ఇచ్చారు.
ఉపాధ్యాయుల పిల్లలు సైతం..
హుస్నాబాద్ పట్టణానికి చెందిన ప్రభుత్వ ఉపాధ్యాయులైన గడిపె సంపత్, చామంతుల ఆంజనేయులుకు చెందిన పిల్లలు సైతం ఈ పాఠశాలలోనే విద్యను అందుకుంటున్నారు. ప్రభుత్వ ఉపాధ్యాయులు తమ పిల్లలను ప్రైవేట్ పాఠశాలలకు పంపకుండా సర్కారు బడిలోనే చదివించడం కూడా పలువురికి ఆదర్శమని చెప్పవచ్చు.
ఇంగ్లిష్ మీడియం, ప్రత్యేక శ్రద్ధతోనే..
ఈ పాఠశాలలో ఇంగ్లిష్ మీడియంతోపాటు ఉపాధ్యాయుల ప్రత్యేక శ్రద్ధతోనే విద్యార్థుల సంఖ్య పెరిగింది. 2016 నుంచి అంగ్లలోనే విద్యార్థులకు బోధన జరుగుతుంది. మంచినీటి వసతితో పాటు పలు సౌకర్యాలున్నాయి. మాపై నమ్మకంతోనే విద్యార్థుల సంఖ్య యేటేటా పెరుగుతున్నది.
– లింగాల యాదయ్య, ఉపాధ్యాయుడు, హుస్నాబాద్
చాలా మంది పిల్లలు వస్తున్నారు..
సీఎం కేసీఆర్ సార్ సర్కారు వచ్చిన తర్వాతే ఈ పాఠశాలలో ఇంగ్లిష్ మీడియం మొదలుపెట్టాం. టీచర్ల సహకారంతో మా బడికి ప్రైవేట్ పాఠశాలల పిల్లలు కూడా ఇందులో చేరిండ్రు. ప్రతినెలా సమావేశాలు నిర్వహించి, పాఠశాలకు ఏం అవసరమో తెలుసుకుని పని చేస్తాం. అందరికి నమ్మకం కుదిరి, మస్తుమంది పిల్లలు మా బడికి వస్తున్నారు.
– పున్న విజయలక్ష్మి, చైర్పర్సన్, ఎస్ఎంసీ, హుస్నాబాద్