మిరుదొడ్డి, మార్చి 10 : పేద విద్యార్థులకు చదువుకోవాలని శ్రద్ధ ఉన్నా.. వారి ఇంటి ఆర్థిక పరిస్థితులు అంతంతా మాత్రమే ఉండడంతో విద్యార్థులపై తీవ్రమైన ఆర్థిక ప్రభావం చూపడంతో పైచదువులకు దూరమైన వారు ఎందరో వివిధ రంగాల్లో స్థిర పడ్డారు. విద్యావంతులకు ఉద్యోగ వేటలో ఆర్థిక పరిస్థితులు వెంటాడకుండా పేద విద్యార్థులకు తోడుగా ఉంటూ.. మంచి పుస్తకాలను అందిస్తూ పేద వారిని సమాజంలో ఒకరిగా ఉన్నతులుగా తీర్చిదిద్దుతూ దిక్సూచిగా మారినా గ్రంథాలయంపై అందిస్తున్న ప్రత్యేక కథనం..
మిరుదొడ్డి గ్రంథాలయాన్ని పట్టణంలోని గ్రామ నడిబొడ్డున ఉన్న కచీర్(గ్రామ సేవకులు ఉండే చిన్న భవనం)లో ప్రారంభించారు. నాడు పాఠకులు కూర్చోవడానికి ఒకే గది, పుస్తకాలు భద్రపర్చడానికి చిన్నపాటి ఇరుకు గది ఉండేది. సమస్యలు ఎన్నీ ఉన్నా పాఠకులు మాత్రం వాటిని పట్టించుకోకుండా నిల్చోని మరి పత్రికలు, పుస్తకాలు చదివేవారు.
ఉద్యోగాల కోసం పోటీ పడేందుకు విద్యావంతులు గ్రంథాలయంలో సభ్యత్వం స్వీకరించి, వారికి అవసరమైన పుస్తకాలను ఇంటికి తీసుకొని వెళ్లి చదివి కండక్టర్లు, టీచర్లుగా, ఇతర ఉద్యోగాల్లో స్థిరపడ్డారు. పాఠకులకు ఇబ్బందులను తొలిగించడానికి నూతన భవన నిర్మాణానికి 2004లో దివంగత ఎమ్మెల్యే సోలిపేట రామలింగారెడ్డి శంకుస్థాపన చేసి, 2008లో భవనాన్ని ప్రారంభించారు. నేడు గ్రంథాలయంలో తెలుగు 6,209, హిందీ 196, ఇంగ్లిష్ 1,533, ఉర్దూ 115 మొత్తం 8,053 పుస్తకాలుండగా, వివిధ ఉద్యోగ పోటీ పరీక్షలకు ఉపయోగపడే పుస్తకాలు 1500 వరకు ఉన్నాయి. దిన పత్రికలు ప్రతి రోజు 17 రాగా, ఇతర పత్రికలు 49తో కలిపి మొత్తం 66 పత్రికలను నిత్యం పాఠకులు చదువుతున్నారు.
గ్రంథాలయంలో సభ్యత్వం పొందిన వారు పురుషులు 342, స్త్రీలు 27, బాల/బాలికలు 181 మొత్తం 550 మంది ఉన్నారు. ఏటా సుమారుగా లక్షా 7950 మంది వరకు గ్రంథాలయానికి వస్తూ చదువుకుంటున్నారు. ప్రతి రోజూ ప్రత్యేకంగా వివిధ రకాల పుస్తుకాలను చదివే వారు 30 మంది వరకు ఉన్నారు. చెప్యాల, అల్వాల గ్రామాల్లో పుస్తక ఉప నిక్షేపక కేంద్రాలు మిరుదొడ్డి గ్రంథాలయం ఆధ్వర్యంలో కొనసాగుతున్నా యి. సమైక్య పాలకులు పట్టించుకోకుండా నిర్లక్ష్యానికి గురైన గ్రంథాలయాలు నేడు సీఎం కేసీఆర్ ప్రత్యేక చొరవతో ప్రజలకు మరింత చేరువ కావడంతో ఆయా గ్రామాల ప్రజలు సంతోషం వ్యక్తం చేస్తూ కృతజ్ఞతలు తెలుపుతున్నారు.
సెల్ ఫోన్లు వీడితే.. యువతకు బంగారు భవిష్యత్
నేడు గ్రామాల్లో యువతీ యువకులు, విద్యార్థులు మాత్రం సెల్ ఫోన్లపైనే అధికంగా మక్కువ పెంచుకొని దానిలోనే లీనమైన పోతూ చదువులను విస్మరిస్తున్నారనే అభిప్రాయం వారి తల్లిదండ్రులను తీవ్ర ఆందోళనకు గురి చేస్తోంది. సెల్ ఫోన్లే జీవితం అనుకోకుండా విద్యార్థులు, యువకులు తమ సమయాన్ని గ్రంథాలయానికి వెచ్చించి అక్కడ పోటీ పరీక్షలకు లభించే పుస్తకాలను చదివితే వారి జీవితం బంగారు భవిష్యత్గా మారుతుందనే దానికి నిదర్శనం దేశంలోని ప్రముఖులేనని ప్రతి ఒక్కరూ గ్రహించాల్సిన అవసరం ఎంతైనా ఉందని విద్యావంతులు, మేధావులు, కవులు సూచిస్తున్నారు.
గ్రంథాలయం విద్యార్థుల కోసమే..
గ్రంథాలయంలోని ప్రతి పుస్తకం యువతకు, విద్యార్థులకు తమ జీవితంలో మంచి మిత్రునిలాగా ఎప్పటికీ తోడు నీడగా ఉపయోగపడుతుంది. ప్రభుత్వం నిర్వహిం చే అన్ని పోటీ పరీక్షలకు అవసరపడే పాఠ్య పుస్తకాలు అందుబాటులో ఉన్నాయి. విద్యార్థులు మంచి పుస్తకాలను చదివి తమ జీవితాన్ని స్థిర పర్చుకోవాలని కోరుతున్నాం.
– బోయ శ్రీనివాస్, జిల్లా గ్రంథాలయ బోర్డు డైరెక్టర్, భూంపల్లి, మిరుదొడ్డి