
చేర్యాల, అక్టోబర్ 31 : కొమురవెల్లి మల్లికార్జున స్వామి క్షేత్రం ఆదివారం భక్తులతో కోలాహలంగా మారింది. స్వామివారిని 15 వేల మంది భక్తులు దర్శించుకున్నట్లు ఆలయవర్గాలు తెలిపాయి. భక్తులు పట్నాలు, ఒడిబియ్యం, కేశఖండన, గంగిరేగు చెట్టు వద్ద ముడుపులు కట్టి మొక్కు లు తీర్చుకున్నారు. కొందరు భక్తులు స్వామి వారి నిత్య కల్యాణోత్సవం మొక్కులు చెల్లించుకున్నారు. కొండపైన ఉన్న ఎల్లమ్మను దర్శించుకుని బోనం సమర్పించారు. మరికొందరు రాతిగీరలు వద్ద ప్రదక్షిణలు, కోడెల స్తంభం వద్ద కోడెలు కట్టి పూజలు నిర్వహించారు. ఈవో బాలాజీ, చైర్మన్ గీస భిక్షపతి, ఏఈవో వైరాగ్యం అంజయ్య, ప్రధానార్చకుడు మహాదేవుని మల్లికార్జున్, డైరెక్టర్లు, సిబ్బంది, అర్చకులు భక్తులకు సేవలందించారు.
వనదుర్గమ్మ సన్నిధిలో..
పాపన్నపేట, అక్టోబర్ 31 : ఏడుపాయల వనదుర్గా భవానీ మాత సన్నిధిలో భక్తుల సందడి నెలకొంది. వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన భక్తులు అమ్మవారికి ఒడిబియ్యం, కుంకుమార్చనలు, తలనీలాలు, బోనాలు సమర్పించి మొక్కు లు చెల్లించుకున్నారు. భక్తులు ఇబ్బందులు తలెత్తకుండా ఆలయ ఈవో సార శ్రీనివాస్ ఆధ్వర్యం లో ఏర్పాట్లు చేశారు. సుదూర ప్రాంతాల నుంచి భక్తులు పెద్ద సంఖ్యలో తరలివచ్చి అమ్మవారిని దర్శించుకున్నారు. పాపన్నపేట పోలీసులు బందోబస్తు విధుల్లో పాల్గొన్నారు.
సంగమేశ్వరాలయంలో..
ఝరాసంగం, అక్టోబర్ 31 : దక్షిణకాశీగా ప్రసిద్ధ్ది చెందిన కేతకీ సంగమేశ్వరస్వామి దర్శనానికి ఆదివారం భారీగా భక్తులు తరలివచ్చారు. తెలంగాణ, కర్ణాటక, మహారాష్ట్ర నుంచి భక్తులు తరలివచ్చి పూజలు చేశారు. శివ నామస్మరణతో ఆలయం మార్మోగింది. తెల్లవారుజాము నుంచే భక్తులు రాక ప్రారంభమైంది. ఆలయ ప్రాగణంలో భక్తుల కోసం ఏర్పాటు చేసిన కుళాయిల వద్ద పుణ్యస్నానాలు చేశారు. ఆలయ సిబ్బంది భక్తులకు అన్నదానం చేశారు.