ప్రమాదాల నివారణ.. ప్రజల రక్షణ నినాదంతో పోలీసు యంత్రాంగం ముందుకెళ్తున్నది. అతివేగం.. ప్రమాదాలపై ప్రజలకు అవగాహన కల్పిస్తున్నది. సిద్దిపేట జిల్లాలో ఉన్న 95 కిలోమీటర్ల రాజీవ్ రహదారిపై అతివేగానికి కళ్లెం వేస్తున్నది. ఈ రహదారిపై ఎక్కడెక్కడ ఎంతెంత వేగంతో వెళ్లాలనే సూచిక బోర్డులు ఏర్పాటు చేసింది. జిల్లా పరిధిలో పది చోట్ల ప్రమాద స్థలాలను గుర్తించి, దానికి అనుగుణంగా చర్యలు తీసుకుంటున్నది. సిద్దిపేట, గజ్వేల్ ట్రాఫిక్ పోలీసుస్టేషన్ల పరిధిలో రెండు స్పీడ్ లేజర్‌గన్స్ ఏర్పాటు చేసింది. లిమిట్ దాటి వెళ్లే వాహనాలకు అంతేవేగంగా 200మీటర్లు దాటే లోపే చలానా యజమానికి చేరుతున్నది. ఇలా అతివేగంగా వెళ్లిన వాహనాలకు జనవరి నుంచి అక్టోబర్ వరకు పది నెలల్లో 89,749 కేసులు నమోదు చేసి, రూ.9,28,39,875 జరిమానాలు విధించింది.
సిద్దిపేట, నవంబర్ 10 (నమస్తే తెలంగాణ ప్రతినిధి) : అతి వేగంతో ప్రమాదాలు జరిగి ఎంతోమంది ప్రాణాలు పోతుండగా.. మరెంతో మంది క్షతగాత్రులవుతున్నారు. ఎన్నో కుటుంబాలు రోడ్డున పడుతున్నాయి. రాజీవ్ రహదారిపై అతివేగంగా వెళ్లే వాహనాలకు పోలీసులు కళ్లెం వేస్తున్నారు. ప్రమాదాల నివారణకు సిద్దిపేట పోలీసు కమిషనరేట్ పరిధి సిద్దిపేట, గజ్వేల్ ట్రాఫిక్ పోలీసుస్టేషన్ల పరిధిలో రెండు స్పీడ్ లేజర్‌గన్స్ ఏర్పాటుచేశారు. జిల్లాలో రాజీవ్ రహదారి సుమారు 95 కిలోమీటర్లు ఉండగా, ప్రత్యేక నిఘా పెట్టారు. అతివేగంగా వెళ్లే వారికి జరిమానాలు వేయడంతో పాటు కేసులూ నమోదు చేస్తున్నారు. ఈ ఏడాది జనవరి నుంచి అక్టోబర్ వరకు పది నెలల కాలంలో 89,749 కేసులు నమోదు కాగా రూ.9,28,39,87 జరిమానాలు విధించారు.
లిమిట్ దాటొద్దు.. ఫైన్ కట్టొద్దు..
సిద్దిపేట జిల్లాలో ప్రమాదాల నివారణకు రాజీవ్ రహదారిపై స్పీడ్ లేజర్‌గన్స్ ఏర్పాటు చేశారు. ఈ స్పీడ్ లేజర్‌గన్స్ ద్వారా ప్రమాదాలను నివారిస్తున్నారు. రాజీవ్ రహదారిపై సిద్దిపేట, గజ్వేల్ ట్రాఫిక్ పోలీసుస్టేషన్ల పరిధిలో అత్యాధునిక రెండు స్పీడ్ లేజర్గన్స్ను ఏర్పాటు చేశారు. అతి వేగంగా వచ్చే వాహనాలను స్పీడ్‌ను లేజర్‌గన్‌తో లెక్కిస్తారు. పరిమితికి మించి వేగం ఉంటే, ఫొటోతో పాటు వాహన నంబరు ప్లేటు, వివరాలను ఆటోమేటిక్‌గా సర్వర్‌కు వెళ్తాయి. వెంటనే చలాన్ జనరేట్ అవుతుంది. 200మీటర్లు దాటే లోపే వాహన యజమాని ఫోన్‌కు మెసేజ్ వస్తుంది. తర్వాత యజమాని ఇంటి అడ్రస్‌కు పోస్టు రూపంలో జరిమానా వెళ్తుంది. లిమిట్ స్పీడ్ అధికంగా ఉన్న వాహనాలకు రూ.వెయ్యి వరకు జరిమానా విధిస్తారు. జరిమానాను యజమానులు పేటీఎం, ఈ-సేవ, మీ-సేవ ద్వారా చెల్లించాల్సి ఉంటుంది. వాహన వేగాన్ని తగ్గించడానికి, ప్రజల ప్రాణాన్ని కాపాడడానికి ఈ స్పీడ్ లేజర్‌గన్ ఉపయోగపడుతుంది. రాజీవ్ రహదారిపై స్పీడ్ లిమిట్ బోర్డులను ప్రభుత్వం ఏర్పాటు చేసింది. ఒకచోట గంటకు 40 కి.మీ, మరోచోట గంటకు 60 కి.మీ, ఇంకోచోట గంటకు 80 కి.మీ ఇలా బోర్డులను ఏర్పాటు చేసి వాహనదారులకు సూచిస్తున్నది. ప్రమాదాలు జరిగే ప్రదేశాలను గుర్తించారు. రాజీవ్ రహదారిపై మొత్తం 10 ప్రమాదాలు జరిగే ప్రదేశాలున్నాయి. ప్రమాదాల నివారణ, స్పీడ్ లేజర్ గన్ తదితర వాటిపై ప్రజలకు అవగాహన కల్పిస్తున్నారు. స్పీడ్ లేజర్‌గన్ ద్వారా చలాన్ వస్తే మూడు సార్లు పెండింగ్‌లో ఉంటే, ఆ వాహనాన్ని సీజ్ చేస్తారు.
నిరంతరం నిఘా..
వాహనదారులు ట్రాఫిక్ నిబంధనలు పాటించి వాహనాలు నడపాలి. అతివేగంగా నడిపి ప్రమాదాలకు గురికావద్దు. రాజీవ్ రహదారిపై ప్రమాదాల నివారణకు రెండు లేజర్ గన్స్‌తో ప్రతిరోజు నిఘా పెడుతు న్నాం. 80 కిలోమీటర్ల కంటే ఎక్కువ వేగంతో వెళ్లే వాహనాలపై కేసులు నమోదు చేస్తున్నాం. ప్రమాదాల నివారణ, ప్రజల రక్షణే మా లక్ష్యం. నిర్ణీత వేగంతో వాహనాలు నడిపి క్షేమంగా గమ్యస్థానాలకు చేరుకోవాలి. ఒక్క ప్రమాదం కుటుంబాలను చిందర వందర చేస్తున్నది. ప్రమాదాల నివారణ గురించి అవగాహన సదస్సులు నిర్వహిస్తున్నాం.