సిద్దిపేట అర్బన్, నవంబర్ 5 : తన పదేండ్ల ప్రయత్నం ఫలించిందని, ఈ రోజు సిద్దిపేటకు ఇంటర్మీడియట్ మూల్యాంకన కేంద్రం వచ్చిందని మంత్రి హరీశ్‌రావు ఆనందం వ్యక్తం చేశారు. శనివారం సిద్దిపేట ప్రభుత్వ బాలుర జూనియర్ కళాశాలలో నూతన మూల్యాంకన కేంద్రాన్ని జడ్పీ అధ్యక్షురాలు రోజాశర్మతో కలిసి మంత్రి ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు. ఇంటర్మీడియట్ మూల్యాంకన కేంద్రం సిద్దిపేటకు తీసుకొచ్చేందుకు పదేండ్లుగా ప్రయత్నించామన్నారు. ప్రజా అవసరాలే కేంద్రంగా జిల్లా ఏర్పాటుకు ముందే ఎంసెట్ పరీక్షా కేంద్రం, విద్యుత్ ఎస్ఈఈ కార్యాలయం, మహిళా డిగ్రీ కళాశాల, నాలుగు పాలిటెక్నిక్ కళాశాలలు, ఐటీఐ కళాశాల, పీజీ కళాశాల, మెడికల్ కళాశాల ప్రారంభించుకొని విద్యాక్షేత్రంగా సిద్దిపేటను మార్చుకున్నామన్నారు. ఈ విద్యా సంవత్సరంలోనే ప్రభుత్వ నర్సింగ్ కళాశాల, వెటర్నరీ కళాశాల ప్రారంభిస్తామని మంత్రి వెల్లడించారు. త్వరలోనే సీఎం కేసీఆర్ ఆశీర్వాదంతో ప్రైవేట్ యూనివర్సిటీ ఏర్పాటు చేయిస్తానని పేర్కొన్నారు. త్వరలోనే ఉద్యోగ నోటిఫికేషన్లు వస్తాయని భరోసా ఇచ్చారు. అడగకుండానే కాంట్రాక్టు లెక్చరర్లకు 30శాతం పీఆర్సీ ఇచ్చామని, సీమాంధ్ర ప్రభుత్వాల హయాంలో ఇంటర్ సమస్యలపై నాంపల్లి ఇంటర్ బోర్డు కార్యాలయం ఎదుట ధర్నాలో పాల్గొన్న సంగతిని మంత్రి హరీశ్‌రావు గుర్తు చేశారు. కార్యక్రమంలో పలువురు ప్రజాప్రతినిధులు, విద్యాశాఖ అధికారులు పాల్గొన్నారు.
పేదింటి ఆడబిడ్డల పెండ్లిండ్లకు సాయం ..
సిద్దిపేట అర్బన్, నవంబర్ 6 : పేదింటి ఆడబిడ్డల పెండ్లిండ్లకు ఆర్థిక సహాయం అందించే ఏకైక రాష్ట్రం తెలంగాణనే అని మంత్రి హరీశ్‌రావు అన్నారు. శనివారం సిద్దిపేట పట్టణంలోని విపంచి కళా నిలయంలో సిద్దిపేట నియోజకవర్గ లబ్ధిదారులకు కల్యాణలక్ష్మి, షాదీముబారక్ చెక్కులను పంపిణీ చేశారు. సిద్దిపేట అర్బన్ మండలానికి చెందిన 114 మంది లబ్ధిదారులకు కల్యాణలక్ష్మి, 46 మందికి షాదీమూబారక్, సిద్దిపేట రూరల్ మండలానికి చెందిన 60, నంగునూరు 29, నారాయణరావుపేటకు చెందిన 33 మంది మొత్తం 282 మంది లబ్ధిదారులకు చెక్కులు అందించారు. అలాగే అధిక వర్షాలతో ఇండ్లు దెబ్బతిన్న 40 మందికి ఆర్థిక సహాయం అందజేశారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడారు. దేశంలో ప్రతిపక్ష పార్టీలు పలు రాష్ర్టాల్లో అధికారంలో ఉన్నా.. ఎక్కడా ఈ తరహా పథకాలను అమలు చేయడం లేదన్నారు. సమావేశంలో రెవెన్యూ డివిజనల్ అధికారి అనంతరెడ్డి, ఏఎంసీ చైర్మన్ పాల సాయిరాం, పలువురు కౌన్సిలర్లు, తహసీల్దార్ పాల్గొన్నారు.