రాష్ట్రంలోని బీజేపీ, కాంగ్రెస్ ఎంపీలకు తెలంగాణ రైతుల ప్రయోజనాలు పట్టడం లేదు. యాసంగి ధాన్యం కొనుగోలుపై స్పష్టమైన వైఖరిని వెల్లడించాలని పార్లమెంట్ ఉభయసభల్లో టీఆర్ఎస్ ఎంపీలు మూడు రోజులుగా ఫ్లకార్డులు ప్రదర్శిస్తూ పోరాటం చేస్తుంటే, వారికి అండగా నిలిచి మద్దతు తెలపాల్సిన రాష్ట్ర బీజేపీ, కాంగ్రెస్ ఎంపీలు పట్టనట్లుగా వ్యవహరిస్తున్నారు. వీరి తీరును రైతులు, రైతు సంఘాల నాయకులు తీవ్రంగా విమర్శిస్తున్నారు. కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం పూర్తిగా రైతు వ్యతిరేక విధానాలు అవలంబిస్తున్నది. రైతులపై బీజేపీ నాయకులు కపట ప్రేమ చూపుతున్నారు. ఢిల్లీ నాయకత్వానిది ఒకమాట…గల్లీలోని బీజేపీ నాయకులది మరోమాట..ఎవరికి వారే అన్న తీరుగా వ్యవహరిస్తూ తెలంగాణ రైతుల ప్రయోజనాలను తీవ్రంగా దెబ్బతీస్తున్నారు. పార్లమెంట్లో జరుగుతున్న తతంగం చూస్తుంటే బీజేపీ, కాంగ్రెస్ పార్టీలకు రైతులపై ఏపాటి ప్రేమ ఉందో తెలియజేస్తున్నది. ఈ పార్టీలకు రైతులపై చిత్తశుద్ధి ఉంటే ఎందుకు పార్లమెంట్లో గొంతెత్తడం లేదని రైతులు, రైతు సంఘాల నాయకులు ప్రశ్నిస్తున్నారు.
సిద్దిపేట, డిసెంబర్ 2 (నమస్తే తెలంగాణ ప్రతినిధి) : కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం రైతులపై పూర్తిగా కపట ప్రేమ చూపిస్తున్నది. ఢిల్లీ నాయకత్వానిది ఒకమాట…గల్లీలోని బీజేపీ నాయకులది మరోమాట.. ఎవరికి వారే అన్న తీరుగా వ్యవహరిస్తున్నారు. ఇక జిల్లా నాయకులది మరోమాట.. ఇలా పూటకో మాట మార్చుతూ రైతాంగాన్ని మోసం చేస్తున్నారు. యాసంగి ధాన్యం కొనుగోలు విషయంపై స్పష్టమైన వైఖరిని వెల్లడించాలని పార్లమెంట్ ఉభయసభల్లో టీఆర్ఎస్ ఎంపీలు మూడు రోజులుగా ప్లకార్డులు ప్రదర్శిస్తూ పోరాటం చేస్తున్నారు. అయినా కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం తన మొండి వైఖరిని వీడడం లేదు. రైతుల సంక్షేమానికి టీఆర్ఎస్ ఎంపీలు ఉభయ సభలను స్తంభింపజేస్తున్నారు. కానీ, బీజేపీ, కాంగ్రెస్ పార్టీలకు చెందిన ఎంపీలు నోరు మెదపడం లేదు. ఈ రెండు పార్టీలకు రైతులపై ఎలాంటి ప్రేమ ఉందో అర్థమవుతున్నది. రైతుల వద్దకు వచ్చి కపట ప్రేమను చూపే ఈ పార్టీలు, యాసంగి ధాన్యం సేకరణపై కేంద్ర ప్రభుత్వాన్ని ఎందుకు నిలదీయడం లేదని రైతులు, రైతు సంఘాల నాయకులు ప్రశ్నిస్తున్నారు. పైగా యాసంగిలో వరి వేయండి అని బీజేపీ నాయకులు, జిల్లాకు చెందిన ఎమ్మెల్యే రైతులకు సూచిస్తున్నారు. యాసంగి ధాన్యం కొనుగోలుపై కేంద్ర ప్రభుత్వం నుంచి స్పష్టమైన హామీని ఎందుకు తీసుకు రావడం లేదని బీజేపీ నాయకులను రైతులు ప్రశ్నిస్తున్నారు. “ఇక్కడ వరి వేస్తే ఎవరు కొనుగోలు చేయాలి..? ఒకే దేశంలో రెండు విధానాలు ఎలా ఉంటాయి..? పంజాబ్ రాష్ట్రంలో ధాన్యం చివరి గింజ వరకూ కొనుగోలు చేసిన కేంద్ర ప్రభుత్వం.. తెలంగాణ రాష్ట్రంలో రైతులు పండించిన ధాన్యాన్ని ఎందుకు కొనుగోలు చేయదు. స్థానిక నాయకులు తమ అధినాయకత్వాన్ని ఎందుకు ఒప్పించడం లేదు. ఇవన్నీ తెలసి కూడా బీజేపీ నాయకులు వరి పెట్టండి అని ఎలా చెబుతారు. ఇది రైతులను మోసం చేయడం కాదా..?”.. అని బీజేపీ నాయకులను రైతు సంఘాలు సూటిగా ప్రశ్నిస్తున్నాయి. యాసంగి ధాన్యం కొనుగోలుపై టీఆర్ఎస్ కొన్ని రోజులుగా వివిధ రూపాల్లో తన నిరసనలు తెలియజేస్తూనే ఉంది. పార్లమెంట్ ఉభయ సభల్లో టీఆర్ఎస్ ఎంపీలు కొత్త ప్రభాకర్‌రెడ్డి, బీబీ పాటిల్, రాజ్యసభ సభ్యులు ఇతర ఎంపీలు మూడు రోజులుగా ప్లకార్డులు ప్రదర్శించి కేంద్ర ప్రభుత్వ వైఖరిని ఎండగడుతున్నారు. రైతుల మేలు కోసం అవిశ్రాంత పోరాటం చేస్తున్న టీఆర్ఎస్ ఎంపీలపై ఉమ్మడి మెదక్ జిల్లావ్యాప్తంగా రైతులు అభినందనలు తెలుపుతున్నారు. టీఆర్ఎస్ ఎంపీలు చేస్తున్న పోరాటానికి మద్దతు తెలపాల్సిన బీజేపీ, కాంగ్రెస్ ఎంపీల నోరు పెకలడం లేదు. అక్కడ మాట్లాడని బీజేపీ, కాంగ్రెస్ పార్టీ వాళ్లు.. గల్లీలకు వచ్చి తెగ ఉపన్యాసాలు ఇస్తారని ఈ రెండు పార్టీల తీరును రైతులు ఎండగడుతున్నారు. రైతులపై చిత్తశుద్ధి ఉంటే ఎందుకు పార్లమెంటులో గొంతుఎత్తడం లేదు ..? అని సూటిగా రైతు సంఘాల నాయకులు ప్రశ్నిస్తున్నారు. గడిచిన రెండు నెలలుగా యాసంగి ధాన్యం సేకరణపై కేంద్రంలోని బీజేపీ తీరును ఎండగడుతూ టీఆర్ఎస్ వివిధ రూపాల్లో పోరాటం చేస్తూనే ఉంది. కేంద్ర ప్రభుత్వం స్పష్టమైన వైఖరిని ప్రకటించే వరకు తమ పోరాటం కొనసాగిస్తామని టీఆర్ఎస్ ప్రకటించింది.
రైతుల దన్నుగా నిలిచిన రాష్ట్ర ప్రభుత్వం..
రైతుల సంక్షేమమే ధ్యేయంగా టీఆర్ఎస్ ప్రభుత్వం పనిచేస్తున్నది. తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన నాటి నుంచి గ్రామ గ్రామానా కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేసి గత ఏడేండ్లుగా ధాన్యం చివరి గింజ వరకూ ప్రభుత్వం కొనుగోలు చేస్తున్నది. 72 గంటల్లోనే నేరుగా రైతుల ఖాతాల్లో ధాన్యం డబ్బులను జమచేస్తున్నది. రెండేండ్లుగా ప్రపంచాన్ని పట్టి పీడిస్తున్న కరోనా సమయంలో సైతం తెలంగాణ ప్రభుత్వం గ్రామాల్లో కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేసి ధాన్యం సేకరించింది. ఎక్కడా రైతులకు ఎలాంటి ఇబ్బంది రాకుండా చూసుకున్నది. రైతులకు పెట్టుబడి సాయం అందించింది. సకాలంలో ఎరువులు, విత్తనాలు, 24 గంటల కరెంట్, సాగు నీరు అందిస్తూ అండగా నిలుస్తున్నది. ప్రస్తుత వానకాలంలో ఉమ్మడి మెదక్ జిల్లాలో 940 కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేసింది. ఇప్పటి వరకు సుమారుగా 5 లక్షల మెట్రిక్ టన్నులకు పైగా ధాన్యం కొన్నది. రూ.500 కోట్లు రైతుల ఖాతాల్లో ధాన్యం డబ్బులను జమచేసింది. ఇది టీఆర్ఎస్ ప్రభుత్వ చిత్తశుద్ధికి నిదర్శనంగా చెప్పవచ్చు. ఇది తెలుసుకోకుండా బీజేపీ నాయకులు వానకాలం ధాన్యం కొనుగోలు చేయడం లేదు.. ఎక్కడి కేంద్రాల్లో అక్కడే ధాన్యం ఉంది అని తప్పుడు మాటలు మాట్లాడుతూ రైతులను తప్పుదోవ పట్టిస్తున్నారు.