“శ్యామ్ సింగరాయ్’ చిత్రం ప్రేక్షకుల్ని మరో ప్రపంచంలోకి తీసుకెళ్తుంది’ అని అన్నారు నాని. ఆయన కథానాయకుడిగా రాహుల్ సంకృత్యాన్ దర్శకత్వంలో వెంకట్ బోయనపల్లి నిర్మించిన ఈ చిత్రం నేడు ప్రేక్షకులముందుకురానుంది. సాయిపల్లవి, కృతిశెట్టి, మడోన్నా సెబాస్టియన్ కథానాయికలు. గురువారం హైదరాబాద్లో చిత్రబృందం మీడియా వారితో సంభాషించింది. నాని మాట్లాడుతూ ‘కేవలం దక్షిణాది భాషల్లోనే ఈ సినిమాను విడుదల చేస్తున్నాం. ఈ కథలో చాలా కొత్త విషయాలున్నాయి. ఇంట గెలిచి రచ్చ గెలుద్దామనే ఉద్దేశ్యంతోనే పాన్ ఇండియా మార్కెట్లోకి అడుగుపెట్టడం లేదు.
సినిమా కథ విన్నప్పుడే నవ్యానుభూతికిలోనయ్యా. ప్రేక్షకుల్లో కూడా అదే భావన కలుగుతుంది. ఈ సినిమా కోసం బెంగాలీ భాష నేర్చుకున్నా. ఇందులో చేసిన రెండు పాత్రల్లో వాసు పాత్ర నా నిజ జీవితానికి దగ్గరగా ఉంటుంది. ముందుగా పెట్టుకున్న అంచనాల్ని మించి ఈ సినిమా చేశామనుకుంటున్నా’ అని చెప్పారు. ఈ సినిమాలో దేవదాసి పాత్ర చేయడం ద్వారా నటిగా మరింత ఎత్తుకు ఎదిగాననుకుంటున్నానని సాయిపల్లవి ఆనందం వ్యక్తం చేసింది. కోల్కతా బ్యాక్డ్రాప్లో చాలా సినిమాలొచ్చినా ఇదొక విజువల్ వండర్లా ఉంటుందని దర్శకుడు రాహుల్ సంకృత్యాన్ పేర్కొన్నారు. ఇలాంటి గొప్ప సినిమా తీసినందుకు గర్వంగా ఉందని నిర్మాత వెంకట్ బోయనపల్లి తెలిపారు.
రేట్ల తగ్గింపు ప్రేక్షకుల్ని అవమానించడమే
సినిమా టికెట్ రేట్ల విషయంలో ఏపీ ప్రభుత్వం అనుసరిస్తున్న వైఖరిని తప్పుబట్టారు హీరో నాని. రేట్లు తగ్గించి టికెట్లను విక్రయించడం ఓరకంగా ప్రేక్షకుల్ని అవమానించడమేనన్నారు. పాత్రికేయులతో మాట్లాడిన నాని.. టికెట్ రేట్ల విషయంలో ఏపీ ప్రభుత్వ తీరుపై విమర్శలు చేశారు. పదిమందికి ఉపాధినిచ్చి పెద్ద థియేటర్ నిర్వహిస్తున్న ఓ వ్యక్తి కౌంటర్ కంటే..పక్కనుండే కిరాణాషాప్ వ్యక్తి కౌంటర్ ఎక్కువగా ఉండటం ఏమాత్రం సమంజసంగా అనిపించదన్నారు. సినిమా, రాజకీయాల్ని పక్కనపెట్టి ఆలోచించాలని..ప్రేక్షకుల్ని అవమానపర్చడం మంచిది కాదని హితవు పలికారు. స్కూల్లో పిక్నిక్ వెళ్లినప్పుడు చెరో వంద రూపాయలు ఇమ్మని అడిగి..‘నాని నువ్వు అంత ఇవ్వలేవు…పదిరూపాయలు మాత్రమే ఇవ్వు’ అని అడగడం తనను అవమానించినట్లేనని నాని ఉదాహరణ చెప్పుకొచ్చారు. సినిమా విడుదల సమయంలో ఏది మాట్లాడినా వివాదం అవుతుందని నాని చెప్పారు. ఆయన వ్యాఖ్యలు సినీ, ఏపీ రాజకీయ వర్గాల్లో సంచలనంగా మారాయి.