మునివరుడు శుకుడు ఇలాగని వినిపించగా భూజాని- రాజు ఇట్లని అన్నాడు…
‘మహాత్మా! ఈశ్వరుడు ధర్మానికి కర్త, భర్త కదా! ఆయన స్వరూపమే ధర్మం! సత్కర్మలాచరించే పుణ్యమూర్తి కదా! ధర్మాన్ని బోధించడానికి, రక్షించడానికి, బాధించేవారిని శిక్షించడానికి అవనిలో అవతరించినవాడు గదా! మునీశ్వరా! అట్టి భగవంతుడు- అనంగ జనకుడు, సంగరహితుడు, ఆప్తకాముడు (అన్ని కోరికలు తీరినవాడు), అది ఏమి ధర్మమని మదినెంచి పరాంగనలతో సంగమించాడో నాకు వివరంగా చెప్పండి? రాజయోగి మాటలు విని శుకయోగి ఇలా అన్నాడు..
ఆ॥ ‘సర్వభక్షకు డగ్ని సర్వంబు భక్షించి
దోషిగాని పగిది దోషమైన
జేసి దోషపదము జెందరు తేజస్వు
లగుట జంద్ర వాసవాదు లధిప!’
ఉర్వీశా! సర్వభక్షకుడైన అగ్నిదేవుడు సర్వమూ భుజించి కూడా అశుచి- దోషి కానట్లు, అరవిందభవుడు (బ్రహ్మదేవుడు), ఇంద్రుడూ, చంద్రుడూ, విశ్వామిత్రుడూ మొదలైన తేజోవంతులు ఆర్యులు దోషయుక్తాలైన కార్యాలు ఆచరించినా దోషఫలాన్ని పొందరు.
క॥ ‘ఈశ్వరుడు గానివాడు న
రేశ్వర! పరకాంత దలచి యెట్లు బ్రదుకు? గౌ
రీశ్వరుడు దక్క నన్యుడు
విశ్వ భయద విషము మ్రింగి వెలయం గలడే?!’
రాజా! ఈశ్వరులు- సమర్థులు శాస్ర్తానికి వశులై (కట్టుబడి) ఉండరు. వారు ఇష్టానుసారం ధర్మాన్ని- చట్టాన్ని అతిక్రమిస్తుంటారు. వారికది కష్టప్రదం కాదు, నష్టదాయకమూ కాదు. ఈశ్వర, దేవతా, మానవ ధర్మాలు విడివిడిగా ఉంటాయి. కాని ఉమ్మడి- కలిసికట్టుగా ఉండవు. మానవ ధర్మాలు మానవులకే కాని, పశుపక్ష్యాదులకు, దేవదానవులకు వర్తించవు. సంకుచిత బుద్ధిగల మానవుడు అనుచితంగా తన ధర్మాన్ని దేవునిపై కూడా వర్తింపజేస్తాడు. అనీశ్వరుడు- ఈశ్వరుడు కానివాడు (దేహేంద్రియ ప్రాణ మనోబుద్ధులకు బద్ధుడై- లొంగి ఉండేవాడు) ఇట్టి పనులు ఎట్టి పరిస్థితుల్లోనూ చేయరాదు. అట్టివాడు మనసులోనైనా పరకాంతను ముట్టుకొని బట్టకట్టగలడా- మనగలడా? నీల గళుడు మారవైరి- ఈశ్వరుడు కాలకూట విషం ఆరగించాడని, అనీశ్వరుడు- ధర్మకర్మలకు లోబడినవాడు అలా చేసి బ్రతకగలడా? ఈశ్వరుల- ప్రభువుల మాట మాత్రమే సత్యం. అదే ప్రమాణం. ఆర్యులు వారి మాటలనే అనుసరిస్తారు కాని వారి కార్యాలను- చేష్టలను కాదు. దాశరథి రాముని ఆచరణ అందరికీ అనుసరణీయం. కాని, వాసుదేవ కృష్ణుని ఆదేశాలే- ఉపదేశాలే అనుసరణీయాలు. ఆయన ఆచరణులు- లీలలు మాత్రం అనుకరణీయాలు కావు.
భూధవా! (రాజా!) మాధవుని పాదారవింద పరాగ ధ్యాన పరాయణులైన సనక సనందనాది వందనీయులు కర్మబంధాలు వీడి ఎలాంటి నిబంధనలు- కట్టుబాట్లు లేక నిచ్చలు (నిత్యం) విచ్చలవిడిగా- ఇచ్చకొలది మెలుగుతుంటారని అంటారే. అలాంటిది, క్రీడార్థమై శుద్ధ సత్తమయ శరీరం స్వీకరించిన ఆ శోభనమూర్తి ఫుల్లాబ్జాక్షుడు- నల్లనయ్య ఎల్లా వర్తిల్లితే- నడుచుకుంటే, ఏమి? ఆయనకు బంధనాలు ఉంటాయా?
ఆ॥ ‘గోప జనములందు గోపికలందును
సకల జంతులందు సంచరించు
నా మహాత్మునకు బరాంగనలెవ్వరు?
సర్వమయుడు లీల సలిపె గాక!’
రాజా! ఇందిరావరుడు గోవిందుడు నందననందనుడైన వల్లవ బాలునిగా బృందావనంలో ఎల్లరి మధ్యా వర్తిల్లు (మసలు) తుండటం వల్ల అతనిని ఒక మానవ పిల్లవానిగా లౌకిక దృష్టితో చూడటం వల్ల నీకు ఇలాంటి కల్లబొల్లి సందేహం కలుగుతున్నది. గోపకులలో, గోపికలలో, ఇతర జీవరాసులలో ఎవడు అంతరాత్మయై వ్యవహరిస్తున్నాడో, అట్టి మహాత్మునికి, ఓ మహీపతీ! పరసతులు ఎవరు? స్వపరభేదం లేని- సర్వమూ తానే అయిన జ్ఞానానందమయుడు, లీలా వినోద విగ్రహుడు అయిన బాలగోపాలుని ఆ క్రీడ కేవలం దివ్య ఆనందహేల మాత్రమే! ఔత్తరేయా! ‘ఆప్త కాముడైన గోవిందునికి ఈ నిందనీయమైన కర్మయందు ప్రవృత్తి- ప్రవేశం ఎందులకు కలిగింది’ అని అందువేమో! ‘రసరాజమైన శృంగారపు పసచే ఆకర్షింపబడు మలీమస (మాసిన) మనస్సులు గల- విషయలంపటులైన బహిర్ముఖులను కూడా పటుతరంగా- బలంగా తనకు అభిముఖులుగా- అంతర్ముఖులుగా చేయుటకే!’ అని పరమార్థం.
రాజా! మాధవుని మాయచే మోహితులైన గోపీ పతులు- గోపాలురు అతనిపై ఎంత మాత్రమూ అసూయ చెందక తమ సతులు తమ ప్రక్కనే ఉన్నట్లు భావించారు. సోముని (చంద్రుని)తో సమానమైన మోములు గల వామలోచనలు- ఆ గొల్ల భామలు, చంద్రవంశంలో జన్మించిన కృష్ణ చంద్రునితో నటింపగా, చుక్కలతో గూడి రిక్కరేడు (చంద్రుడు) చక్కని నాట్యం చూస్తూ ఎకసెక్కము- పరిహాసపు మాటలాడుతూ ఉండటం చేత రాత్రి తడవుగ- ఆలస్యంగా గడిచింది. తన కృపా పాత్రలైన సుగాత్రు- గోపికలకు ఆ ఒక్క క్షప- రాత్రిలోనే అనేక దీర్ఘరాత్రులను తోపించి ఉపేంద్రుడు, జీవ (నర) సఖుడు సుఖరూపుడు, అఖిలాత్ముడూ అయిన శిఖిపింఛమౌళి వారిచే దీర్ఘకాలం ఆత్యంతిక సుఖం అనుభవింపజేశాడు. బ్రహ్మముహూర్తం రాగానే తెల్లవారుజామున నల్లనయ్య అనుమతి పొంది, భగవంతునికి ప్రేమాస్పదలైన ఆ వల్లవ లేమలు ఇష్టం లేకున్నా ఎంతో కష్టంగా కృష్ణుని వదిలి తమ తమ గీము- గృహాలకు వెళ్లారు. రాసలీల దేహాత్మ బుద్ధి కలిగిన స్త్రీ-పురుష మేళనం కాదు. అంశ (జీవ), అంశీ (ఈశ్వర) మేళనం.
మత్తకోకిల॥
‘ధర్మకర్తయు ధర్మభర్తయు ధర్మమూర్తియునైన స
త్కర్ముడీశుడు ధర్మశిక్షయు ధర్మరక్షయు జేయగా
నర్మిలిన్ ధర మీద బుట్టి పరాంగనా జన సంగమే
ధర్మమంచు దలంచి చేసె? నుదాత్త మానస! చెప్పుమా?’
ఈ లీలలో గోపబాలలందరూ కృష్ణమయలయ్యారు. ‘శ్రీకృష్ణ పరబ్రహ్మణే నమః’- బ్రహ్మత్వం పొందిన తర్వాత జీవునికి అస్తిత్వం, స్వత్వం (ఇండివిడ్యువాలిటీ) ఉంటుందా? ఇది లౌకిక కామలీల అయితే, విశాల బుద్ధి వేద వ్యాసుడు భాగవతంలో వచిస్తాడా? అవధూత శిరోమణి వైయాసకి శుకుడు, ప్రాయోపవిష్టుడు, ముముక్షువు అయిన పరీక్షిత్తుకు ప్రవచిస్తాడా? గీర్వాణులు- దేవతలు దర్శించి నిర్వాణ- మోక్ష సుఖాన్ని అనుభవిస్తారా? ఈ భావన, చింతనతో రాసలీల పఠన శ్రవణాలు చెయ్యాలి. పరమార్థంలో.. గోవిందుడు కాని గోపిక అంటూ ఉన్నదా? అందువలన ఆ ఇందువదనలతో ఎన్ని చిందులు వేసినా, ఆ ఇంతులతో ఎన్ని గంతులాడినా, ఎన్ని పొందులు పెట్టుకున్నా ఆయన అస్ఖలిత బ్రహ్మచారే! షోడశ స్త్రీ సహస్రేశుడైనా అజస్రమూ అనాది బ్రహ్మచారే! కృష్ణుణ్ని వ్యభిచారి అనడం మన గ్రహచారం. వాస్తవానికి విష్ణుని విస్మరణమే వ్యభిచారం. పురుషుడనగా పరమాత్మే. ఆయన్ని సదా సర్వదా సేవించడమే పాతివ్రత్యం! రాసక్రీడ ప్రసంగాన్ని ఆషామాషీగా, ఈసడింపు- చులకనగా కన్నా, రోష- అసూయ ఆవేశాలతో విన్నా, దోషరోపణం చేసినా.. పాపం మూటగట్టుకుంటారని పెద్దల మాట. ప్రాకృత దృష్టితో ఎంచితేనే దోషం. పరమాత్మ దృష్టితో పరిశీలించితే నిర్దోషం, నిరవద్యం! సారాతిసారంగా- కృష్ణుడు ఆత్మ. రాధ ఆత్మాకార వృత్తి. గోపికలు ఆత్మాభిముఖ వృత్తులు (మనోభావాలు) ఇవన్నీ ధారావాహికంగా నిరంతరం ఆత్మలో రమించుటే రాసం! (సశేషం)