Anthony Albanese : భారత (India) వలసదారులకు వ్యతిరేకంగా వ్యాఖ్యలు చేసిన సెనెటర్ (Senator) జసింటా నంపిజిన్పా ప్రైస్ (Jacinta Nampijinpa Price) వెంటనే క్షమాపణలు చెప్పాలని ఆస్ట్రేలియా (Australia) ప్రధాని (Prime Minister) ఆంథోనీ ఆల్బనీస్ (Anthony Albanese) సూచించారు. ఆస్ట్రేలియాలో పెరుగుతోన్న జీవన వ్యయాలకు భారత వలసదారులే కారణమని నిందిస్తూ ‘సెంటర్ రైట్ లిబరల్ పార్టీ’ కి చెందిన సెనెటర్ జసింటా ప్రైస్ విమర్శలు చేశారు.
ఆస్ట్రేలియాలో గత కొంతకాలంగా వలసదారులకు వ్యతిరేకంగా పెద్దఎత్తున ఆందోళనలు జరుగుతున్నాయి. ఈ నేపథ్యంలో జసింటా చేసిన వ్యాఖ్యలపై ఆగ్రహం వ్యక్తమవుతోంది. తమకు ఓట్లు పడేలా భారతీయ వలసదారులను రప్పిస్తున్నారని ప్రధాని ఆల్బనీస్‌కు చెందిన ‘ఆస్ట్రేలియన్ లేబర్ పార్టీ’ పైనా ఆమె విమర్శలు చేశారు. ‘ఆస్ట్రేలియాకు వలస వచ్చిన భారతీయుల సంఖ్య భారీగా ఉంది. ఆ సంఖ్యను లేబర్ పార్టీకి వచ్చిన ఓటింగ్‌లో మనం చూడొచ్చు’ అని ప్రైస్ వ్యాఖ్యానించారు.
సెనెటర్ ప్రైస్ వ్యాఖ్యలు ఆస్ట్రేలియన్-ఇండియన్ కమ్యూనిటీలో తీవ్ర ఆగ్రహానికి దారితీశాయి. వెంటనే ఆమె క్షమాపణలు చెప్పాలని వారు డిమాండ్ చేశారు. అదేవిధంగా సొంత పార్టీ కూడా ప్రైస్ వైఖరిని ఖండించింది. ఈ క్రమంలో ప్రైస్ వ్యాఖ్యలపై ఆల్బనీస్ స్పందించారు. ‘భారత కమ్యూనిటీకి చెందిన ప్రజలను ఆ వ్యాఖ్యలు బాధించాయి. ఆమె వెంటనే క్షమాపణలు చెప్పాలి. ఆమె సొంత పార్టీ నేతలు కూడా అదే చెబుతున్నారు’ అని పేర్కొన్నారు.