సిటీబ్యూరో, జూలై 16 (నమస్తే తెలంగాణ) ; ఆషాఢం వచ్చిందంటే ఆఫర్ల వర్షం కురుస్తుంది. విభిన్న రకాల రాయితీలతో అనేక ఆఫర్లు పుట్టుకొస్తాయి. మార్కెట్లో పోటాపోటీగా ప్రత్యేక ఆఫర్ అంటూ వ్యాపార దిగ్గజాలు ప్రకటనలు చేస్తాయి. ఏదైనా ఒక కొత్త వస్తువు కొనుగోలు చేయడం ఆషాఢం అనవాయితీగా ఉండటంతో వస్త్ర, జువెల్లరీ, ఎలక్ట్రికల్ ఇలా అన్ని రంగాల దుకాణాలు కస్టమర్లను ఆకట్టుకోవడానికి కొంగొత్త ఆఫర్లను ముస్తాబు చేస్తున్నాయి. ఇప్పుడు నగరంలో ఎక్కడ చూసినా ఆషాఢం ఆఫర్ అంటూ కస్టమర్లకు ఆహ్వానం పలుకుతున్నాయి. ప్రధానంగా ఆర్ఎస్ బ్రదర్స్, సౌత్ ఇండియా షాపింగ్, చందన బ్రదర్స్, సీఎంఆర్ తదితర వస్త్ర దుకాణాలతో పాటు కల్యాణ్, లలిత, సీఎంఆర్, సౌత్ ఇండియా తదితర జువెల్లరీ దుకాణాలు సైతం ఆషాఢం ఆఫర్లతో సందడి తలపిస్తున్నాయి. ఓ వస్త్ర దుకాణం కేజీల లెక్క దుస్తులను విక్రయిస్తుంటే.. మరో వస్త్ర దుకాణం 50 నుంచి 70 శాతం వరకు డిస్కౌంట్ అంటూ బోర్డులు పెడుతున్నాయి.
జువెల్లరీలోనూ ఆఫర్లు..!
అలంకరణ అనేది ఇప్పుడు ఒక పెద్ద బిజినెస్‌గా మారింది. అందులో బంగారు ఆభరణాలది ప్రత్యేక స్థానం. సీజన్‌తో సంబంధం లేకుండా మగువల మనుసును దోచే ఆభరణాలు అనేకం. చెవి పోగుల నుంచి వడ్డాణం వరకు ప్రతీది ఓ ప్రత్యేకత. ట్రెండ్‌కు తగ్గ జువెల్లరీని పరిచయం చేయడానికి నగరంలో సరికొత్త జువెల్లరీ దుఖాణలు తమ బ్రాంచీలను విస్తృతం చేస్తున్నాయి. ముఖ ఆకారాన్ని ఆధారం చేసుకుని.. వయస్సును దృష్టిలో ఉంచుకుని..వర్కింగ్‌ను బటీ,్ట డ్రెస్సును ఆధారంగా చేసుకుని.. ఇలా విభిన్న రకాలుగా జ్యువెల్లరీని మార్కెట్లోకి తీసుకొస్తున్నారు. అందుకు తగ్గట్టు జువెల్లరీ ట్రెండ్‌ను మగువలు ఫాలో అవుతున్నారు. ఇందులోనూ ఆషాఢం ఆఫర్ల పేరుతో కస్టమర్లను ఆకట్టుకోవడానికి జువెల్లరీ నిర్వాహకులు రెడీ అయ్యారు. ఇంకోవైపు ఎలాంటి మేకింగ్ ఛార్జీలు లేకుండా బంగారు ఆభరణాలపై అదిరిపోయే ఆఫర్లు ఇస్తున్నారు.
సోమాజిగూడలోని ముకుంద జువెల్లరీ వాళ్లు ఆషాఢం బంపర్ సేల్‌లో భాగంగా వీఏ మీద 20 శాతం ప్రత్యేక డిస్కౌంట్ ఇస్తున్నారు. డైరెక్ట్ ఫ్యాక్టరీలే అవుట్ లెట్ కావడంతో ఇలాంటి ఆఫర్ ఇవ్వడం సాధ్యపడుతుందని నిర్వాహకులు తెలిపారు. ఎలక్ట్రికల్ వస్తువులు ఫ్రిజ్‌లు, వాషింగ్ మిషన్లు, ల్యాప్‌టాప్‌లు తదితర వాటిపై కూడా ఆషాఢం ఆఫర్లు విరివిగా వస్తున్నాయి. మరోవైపు ఆన్‌లైన్‌లోనూ ఆషాఢం ఆఫర్లు ప్రకటిస్తుండంటతో కస్టమర్లు ఆర్డర్ పెట్టడంలో బిజీగా మారుతున్నారు. ప్రస్తుతం మహిళలు తక్కువ ధరలో అందమైన డిజైన్లను వెతుకుతున్నారు. ఇందుకు ఆషాడం వేదికగా చేసుకుంటున్నారు. అవి అన్ని అవసరాలకు తగ్గట్టుగా ఉండాలని భావిస్తున్నారు. బ్రైడల్ జువెగల్లరీలో మహిళలు అన్ని రకాల ఆభరణాలు అంటే పాపిడి బిళ్ల, ముక్కుపోగు, జూకాలు, నెక్లెస్, మీడియం నెక్లెస్, చెవిజూకాలు, చెవిపోగులు, దండె కడియాలు, చేతి వంకీలు, వడ్డాణం, గజ్జెలు, మెట్లెలు లాంటి వాటిపై మనసు పారేసుకుంటున్నారు.
పెరిగిన కొనుగోలు శక్తి..!
సాధారణంగా నగరంలో షాపింగ్ మాల్స్ ఏ రోజైనా సందడిని తలపిస్తాయి. నగరవాసుల కొనుగోలు శక్తి పెరగడంతో వారు షాపింగ్, వినోదంపై అత్యధికంగా ఆసక్తి చూపిస్తున్నారు. వీరి ఆసక్తులను దృష్టిలో పెట్టుకుని జాతీయ, అంతర్జాతీయ బ్రాండ్స్ తమ కార్యాలయాలను నగరంలో ఏర్పాటు చేస్తున్నాయి. ఇప్పటికే ఉన్న షాపింగ్ మాల్స్‌కు దీటుగా ఒకే చోట వినోదం, షాపింగ్ ఉండేలా మాల్స్ వెలుస్తున్నాయి. కుటుంబ సమేతంగా అవసరమయ్యేవన్నీ అందుబాటులో ఉంచుతున్నాయి. చుట్టపక్కల రియల్ ఎస్టేట్ మార్కెట్‌ను ఇవి అంతగా ప్రభావితం చేస్తున్నాయి. అందుకే, మాల్స్ నిర్మాణంలో హైదరాబాద్ దూసుకుపోతుంది. ఐటీ కారిడార్లోనే ఇవి అత్యధికంగా వస్తున్నాయి. రిటైల్ స్పేస్‌లో వ్యవస్థీకృత మార్కెట్ వేగంగా విస్తరిస్తోంది. బ్రాండెండ్ దుకాణాల రాకతో వీటికి డిమాండ్ పెరిగిందని మార్కెట్ విశ్లేషకులు చెబుతున్నారు. వినోదం, షాపింగ్, ఆహారం వరకు అన్నీ ఒకే చోట సౌకర్యంగా ఉండటంతో సందర్శకులు ఉదయం నుంచి రాత్రి వరకు మాల్స్‌లోనే గడుపుతున్నారు. ఆదాయాలు పెరగడం, జీవన శైలిలో వచ్చిన మార్పులు కూడా వీటికి బాగా కలిసోస్తుంది. బేగంపేట, పంజాగుట్ట, బంజారాహిల్స్, ఐటీ కారిడార్, దిల్సుఖ్నగర్ పరిమితమైన మాల్స్ సంస్కృతి నగరంలోని శివార్లకు పాకింది. గచ్చిబౌలిలో అతి పెద్ద మాల్ శరత్ సిటీ మాల్, మాదాపూర్ తదితర ప్రాంతాల్లో కొత్త మాల్స్ అందుబాటులోకి వచ్చాయి. అత్తాపూర్‌లో కూడా వచ్చింది. వీటి రాకతో ఆ ప్రాంత రూపురేఖలు మాల్స్‌తో కళకళలాడుతున్నాయి. ఫలితంగా హైదరాబాద్ షాపింగ్ దుకాణాలు తమ బ్రాండ్లను నగరవాసులకు పరిచయం చేయడంలో పోటీపడుతున్నాయి.
వస్త్ర దుఖాణాలకు భలే క్రేజ్..!
ఆషాఢంలో ప్రధానంగా వస్త్ర దుకాణాల పంట పడుతుంది. కేజీ చొప్పున చీరలను విక్రయిస్తున్నారు. కొన్ని షాపు లు ఫ్యాన్సీ డ్రెస్సులపై 70 శాతం వరకు ఆఫర్లు ప్రకటిస్తున్నాయి. ఫ్యాంట్, షర్ట్స్ల్లోనూ ఆషాఢం ఆఫర్లతో రూ.700 ఖరీదును 400కు విక్రయిస్తున్నారు. బ్రాండె డ్ వస్ర్తాలు సైతం ఆషాఢం ఆఫర్లతో సగానికి సగం ధరల్లో లభిస్తున్నాయని ప్రకాశ్ అనే కస్టమర్ తెలిపాడు. దీంతో వస్త్ర దు కాణాలకు నిలయంగా ఉన్న సికింద్రాబా ద్, అమీర్‌పేట్, అబిడ్స్, దిల్షుక్ నగర్, కూకట్పల్లి ప్రాంతాలు కస్టమర్లతో కళకళలాడుతున్నాయి. ఈ ఆషాఢం ఆఫర్లు కేవ లం కొద్ది రోజులు మాత్రమే ఉండటంతో కస్టమర్లు షాపింగ్ చేయడానికి అమిత ఆసక్తి కనబరుస్తున్నారు. ఆషాఢం ఆఫర్ల తో కొనుగోలు చేసిన వస్తువులతో ఇల్లు కొత్త అనుభూతిని పంచనుంది.