న్యూఢిల్లీ : కేంద్ర ప్రభుత్వం ప్రతీ సంవత్సరం ఇచ్చే క్రీడా అవార్డుల కోసం రంగం సిద్ధమైంది. ఆయా క్రీడా విభాగాల్లో దేశ ఖ్యాతిని ఇనుమడింపజేసేలా రాణించిన ప్లేయర్ల ప్రతిభను గుర్తిస్తూ వారి పేర్లను సిఫారసు చేశారు. ముఖ్యంగా అత్యున్నత క్రీడా పురస్కారంగా పేరొందిన ధ్యాన్‌చంద్ ఖేల్త్న్ర అవార్డుకు గాను ఈసారి భారత హాకీ వైస్‌కెప్టెన్ హార్దిక్సింగ్ పేరును ప్రతిపాదించారు. టోక్యో(2020)తో పాటు పారిస్(2024) ఒలింపిక్స్‌లో కాంస్య పతకాలు గెలిచిన భారత జట్టులో సభ్యుడైన హార్దిక్ అద్భుత ప్రదర్శనతో రాణించాడు. దీనికి తోడు ఇటీవల జరిగిన ఆసియాకప్‌లో పసిడి పతకం గెలువడంలోనూ హార్దిక్‌ది కీలక పాత్ర. మరోవైపు అర్జున అవార్డు కోసం ఈసారి 24మందితో కూడిన ప్లేయర్ల జాబితాను క్రీడాశాఖ విడుదల చేసింది.
ఇందులో రాష్ర్టానికి చెందిన యువ షూటర్ ధనుశ్ శ్రీకాంత్‌తో పాటు యువ షట్లర్ గాయత్రీ గోపీచంద్ ఉన్నారు. ఇటీవల డెఫిలింపిక్స్‌లో బధిర షూటర్ శ్రీకాంత్ తనదైన రీతిలో సత్తాచాటాడు. ప్రత్యర్థి షూటర్లకు దీటైన పోటీనిస్తూ పసిడి పతకాలు ఖాతాలో వేసుకున్నాడు. బ్యాడ్మింటన్‌లో త్రిసాజాలీతో కలిసి గాయత్రీ గోపీచంద్ ఈ మధ్య టోర్నీల్లో నిలకడగా రాణిస్తున్నది. వీరికి తోడు చెస్ ప్రపంచకప్ గెలిచిన తొలి భారత ప్లేయర్‌గా నిలిచిన దివ్యా దేశ్‌ముఖ్, అథ్లెట్ తేజస్విన్ శంకర్, విదిత్ గుజరాతి, మెహులీ ఘోష్, ప్రణతీనాయక్ ఉన్నారు. ఖేల్త్న్ర అవార్డు కింద ప్లేయర్లకు రూ.25లక్షలు, అర్జున అవార్డుకు రూ.15లక్షల నగదు ప్రోత్సాహకం అందించనున్నారు.