(స్పెషల్ టాస్క్ బ్యూరో) హైదరాబాద్, జూన్ 9 (నమస్తే తెలంగాణ): దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన మేఘాలయ హనీమూన్ జంట అదృశ్యం కేసు.. క్రైమ్ థ్రిల్లర్ మూవీకి ఏమాత్రం తీసిపోని ట్విస్టులతో ఎట్టకేలకు కంచికి చేరింది. కాంట్రాక్ట్ కిల్లర్లకు సుపారీ ఇచ్చి భర్త రాజా రఘువంశీని అతని భార్య సోనమ్ చంపించినట్టు పోలీసుల ప్రాథమిక దర్యాప్తులో తేలింది. ప్రియుడితో కలిసి ఉండటానికే ఆమె ఈ హత్యకు తెగబడినట్టు అనుమానిస్తున్నారు. ఈ కేసులో సోనమ్‌తోపాటు మరో నలుగురిని అదుపులోకి తీసుకొన్న పోలీసులు విచారిస్తున్నారు.
అసలేం జరిగింది?
రాజా రఘువంశీ కుటుంబం మధ్యప్రదేశ్‌లోని ఇండోర్‌లో ట్రాన్స్‌పోర్టు వ్యాపారం నిర్వహిస్తున్నది. గత నెల 11న రాజా రఘువంశీకి సోనమ్‌తో వివాహం జరిగింది. 20న హనీమూన్ కోసం ఈ జంట మేఘాలయకు వచ్చారు. ఈ క్రమంలో 23న వీరి ఆచూకీ గల్లంతైంది. దీంతో కుటుంబసభ్యుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసిన పోలీసులు గాలింపు చేపట్టారు. జూన్ 2న సోమ్రాలోని ఓ జలపాతం సమీపంలో రఘువంశీ మృతదేహాన్ని పోలీసులు గుర్తించారు. అతడి తలపై కత్తి గాయాలు ఉండటంతో హత్యగా అనుమానించారు. సోనమ్ ఆచూకీ కోసం ముమ్మర గాలింపు చేపట్టారు.
గాజీపూర్‌లో కనిపించిన సోనమ్
గత నెల 23 నుంచి కనిపించకుండా పోయిన సోనమ్ ఆదివారం రాత్రి ఉత్తరప్రదేశ్‌లోని గాజీపూర్‌లో ఓ దాబా దగ్గరకు చేరుకొని కుటుంబ సభ్యులకు ఫోన్ చేసింది. దీంతో అక్కడకు చేరుకొన్న పోలీసులు ఆమెను అదుపులోకి తీసుకొన్నారు. ఇదే సమయంలో ఈ కేసుకు సంబంధించి
మరో ముగ్గురు యువకులు వికాస్ (విక్కీ), ఆకాశ్, ఆనంద్‌ను కూడా అరెస్ట్ చేశారు.
వీరందరినీ విడివిడిగా విచారించిన పోలీసులు.. రఘువంశీ మరణానికి సోనమ్ సూత్రధారి అని ప్రాథమికంగా నిర్ధారణకు వచ్చారు. తమకు సుపారీ ఇచ్చి రఘువంశీని సోనమే చంపించినట్టు నిందితులు విచారణలో ఒప్పుకొన్నట్టు పేర్కొన్నారు.
రిటర్న్ టికెట్లు బుక్ చేయలే..
రాజా రఘువంశీ మరణానికి సంబంధించి అతని తల్లి ఎన్డీటీవీతో మాట్లాడారు. హనీమూన్ ఏర్పాట్లు అన్నింటినీ సోనమే చేసిందని, అయితే, రిటర్న్ టికెట్లను బుక్ చేయలేదన్నారు. రూ. 10 లక్షల నగలను వేసుకోవాలని తన కుమారుడిని సోనమ్ బలవంతపెట్టిందని వాపోయారు. తన కుమార్తె ఏ తప్పూ చేయలేదని, సీబీఐ విచారణ జరిపించాలని సోనమ్ కుటుంబసభ్యులు డిమాండ్ చేశారు. కాగా, ఈ హత్య కేసులో తాను నిందితురాలిని కాదని, బాధితురాలినని పోలీసులతో సోనమ్ చెప్పినట్టు సమాచారం. తనను కొందరు కిడ్నాప్ చేసినట్టు విచారణలో భాగంగా ఆమె పోలీసులతో అన్నట్టు సంబంధిత వర్గాల ద్వారా తెలిసింది. కాగా, జ్యువెల్లరీ కోసం కొందరు తనపై దాడికి పాల్పడితే, తనను రక్షించే క్రమంలో తన భర్త చనిపోయాడని తనతో సోనమ్ అన్నట్టు దాబా యజమాని పేర్కొనడం గమనార్హం.
బాయ్‌ఫ్రెండ్ బయటపడ్డాడు ఇలా..
విచారణలో భాగంగా ఆనంద్ మాట్లాడుతూ.. సోనమ్ బాయ్‌ఫ్రెండ్ ఇండోర్‌కు చెందిన రాజ్కుశ్వాహా పేరును ప్రస్తావించాడు. సోనమ్ సోదరుడు గౌరవ్ నిర్వహిస్తున్న ఓ కంపెనీలో కుశ్వాహా ఓ అకౌంటెంట్‌గా పని చేస్తున్నట్టు తేలింది. సోదరుడి కంపెనీకి తరుచూ సోనమ్ వెళ్తుండటంతో వీరిద్దరి మధ్య చనువు పెరిగినట్టు సమాచారం. అయినప్పటికీ, సోనమ్ రాజా రఘువంశీని ఎందుకు వివాహం చేసుకొన్నదన్న కోణంలో పోలీసులు విచారణ ప్రారంభించారు. కాగా ఈ కేసులో అరస్టైన ఇద్దరు కాంట్రాక్ట్ కిల్లర్లు కూడా సోనమ్‌కు చెందిన కంపెనీలో పని చేస్తున్నట్టు తెలుస్తోంది. కుశ్వాహాతో సోనమ్ తరుచూ మాట్లాడుతూ ఉండేదని మృతుడు రాజా రఘువంశీ సోదరుడు మీడియాకు తెలిపారు.
కేసు చిక్కుముడి ఎలా వీడింది?
గత నెల 23న కనిపించకుండా పోవడానికి ముందు రఘువంశీ, సోనమ్ ఓ స్కూటర్‌ను అద్దెకు తీసుకొన్నారు. అప్పుడే నిందితులు ముగ్గురిని కూడా చూసినట్టు అక్కడి ఓ టూరిస్ట్ గైడ్ పోలీసులకు చెప్పారు. రఘువంశీ మృతదేహం లభ్యమైన ప్రాంతంలో అదే స్కూటర్ ఉండటం, గైడ్ ఇచ్చిన సమాచారంతో నిందితుల కోసం వేటను ప్రారంభించిన పోలీసులు ఎట్టకేలకు వివరాలను రాబట్టారు.