హైదరాబాద్, డిసెంబర్ 1 (నమస్తే తెలంగాణ): తెలంగాణలో చేపట్టిన గొర్రెల పంపిణీ పథకం చాలా మంచి కార్యక్రమమని, దీని వల్ల రాష్ట్రంలో గొర్రెల సంపద గణనీయంగా పెరిగిందని జాతీయ మాంసం పరిశోధన కేంద్రం (ఎన్ఆర్సీఎం) డైరెక్టర్ సుఖ్‌దేవ్ బీ బర్బుద్దే ప్రశంసించారు. ఇలాంటి కార్యక్రమాలతో ప్రజలకు, గొర్రెల కాపరులకు ఎంతో మేలు జరుగుతుందని తెలిపారు. జాతీయ సగటు కంటే తెలంగాణలో మాంసం వినియోగం ఎక్కువని, ఇక్కడ మాంసాహారులు అధికంగా ఉన్నట్టు సర్వేల్లో వెల్లడైందని పేర్కొన్నారు. ప్రజల డిమాండ్‌కు అనుగుణంగా మాంసం ఉత్పత్తి లేకపోవడం వల్లనే ధరలు అధికంగా ఉన్నాయని చెప్పారు. గొర్రెల కాపరులను వ్యాపారులుగా మార్చేందుకు, మాంసంపై పరిశోధనల నిర్వహణకు ఎన్ఆర్సీఎం ఆధ్వర్యంలో శిక్షణ ఇస్తున్నట్టు ‘నమస్తే తెలంగాణ’కు ఇచ్చిన ఇంటర్వ్యూలో తెలిపారు. ఆ ఇంటర్వ్యూ వివరాలు ఇవీ..
ప్రపంచ దేశాలతో పోలిస్తే మన దేశంలో మాంసం సగటు వినియోగం చాలా తక్కువ. సంవత్సరానికి ఒక మనిషి సగటున 11 కిలోల మాంసం తినాలి. కానీ మన దేశంలో 6.5 కిలోలు మాత్రమే తింటున్నారు. ఇది పెరగాల్సిన అవసరం ఉన్నది. బాయిలర్ కోళ్ల పెంపకంపై జరుగుతున్న పరిశోధనలతో పోలిస్తే గొర్రెలు, మేకలపై జరుగుతున్న పరిశోధనలు చాలా తక్కువ. పశ్చిమ బెంగాల్లో ఇటీవలే ఈ పరిశోధనలు ప్రారంభమయ్యాయి. బాయిలర్ కోళ్ల మాదిరిగా తక్కువ సమయంలో ఎక్కువ మాంసాన్ని ఇచ్చే గొర్రెలు, మేకలను అభివృద్ధి చేసుకోగలిగితే డిమాండ్‌కు అనుగుణంగా మాంసం సరఫరా పెరిగి, ధరలు తగ్గే అవకాశం ఉంటుంది.
ఎన్ఆర్సీఎంలో మీట్ స్పైసెస్ ఐడెంటిఫికేషన్ ల్యాబొరేటరీ (ఎంఎస్ఐఎల్)ని ఏర్పా టు చేశాం. దేశంలో మాంసంపై శాస్త్రీయమైన పరీక్షలు నిర్వహించి.. అది దేని మాంసమో నిర్ధారించి, నివేదిక ఇచ్చే ఏకైక ల్యాబ్ ఇదే. దీనికి ఎన్ఏబీఎల్ (నేషనల్ అక్రెడిటేషన్ బోర్డ్ ఫర్ టెస్టింగ్ అండ్ క్యాలిబరేషన్ ల్యాబొరేటరీ) గుర్తింపు ఉన్నది. ఎంతో ప్రతిష్ఠాత్మకమైన ఈ ల్యాబ్ నివేదికలను కోర్టులు సైతం ఆమోదిస్తాయి. మాంసాహార కల్తీలు, ప్రత్యేకించి బిర్యానీలకు ఉపయోగించే మాంసానికి సంబంధించిన శాంపిళ్లు ఈ ల్యాబ్‌కు ఎక్కువగా వస్తుంటాయి.
మాంసం వ్యాపారం, మాంసాహార పదార్థాల తయారీపై మా సంస్థ శిక్షణ ఇస్తున్నది. ఎంటర్ప్రెన్యూర్ డెవలప్మెంట్ ప్రోగ్రామ్ (ఈడీపీ) కింద ఈ ప్రక్రియ నిరంతం కొనసాగుతుంది. ప్రస్తుతం దేశం నుంచి విదేశాలకు దాదాపు రూ.25 వేల కోట్ల విలువైన మాంసం ఎగుమతులు జరుగుతున్నాయి. వీటిలో బఫెలో మాంసమే ఎక్కువ. గొర్రెలు, మేకల పెంపకానికి ప్రైవేటు రంగంలో పెట్టుబడులు రావాలి. అప్పుడే ప్రజల డిమాండ్‌కు అనుగుణంగా మాంసం ఉత్పత్తి అవుతుంది.
గొర్రె, మేక, కోడిని కోసినప్పటి నుంచి రెండు గంటల్లోనే మాంసాన్ని విక్రయించాలి. లేకపోతే బ్యాక్టీరియా పెరిగి, అది కుళ్లిపోవడం ప్రారంభమవుతుంది. రెండు గంటల్లో విక్రయించడం సాధ్యపడకపోతే దాన్ని ఫ్రిజ్‌లో పెట్టాలి. కానీ ప్రజలు ఫ్రిజ్‌లో పెట్టిన మాంసాన్ని కొనేందుకు అంతగా ఆసక్తి చూపరు. దీంతో దుకాణదారులు ఉదయం నుంచి సాయంత్రం వరకు మాంసాన్ని బయటే ఉంచాల్సి వస్తున్నది. ఈ సమస్యకు పరిష్కారంగా మా పరిశోధన కేంద్రంలో మినీ స్లాటర్ హౌస్‌ను అభివృద్ధి చేశాం. గొర్రెలు, మేకలను అప్పటికప్పుడు వధించి, విక్రయించేలా దీన్ని రూపొందించాం. చిన్న గదుల్లో సైతం ఏర్పాటు చేసుకొనేందుకు వీలుండే మినీ స్లాటర్ హౌస్‌ల వినియోగాన్ని ప్రభుత్వాలు ప్రోత్సహించాల్సిన అవసరం ఉన్నది.
దేశ సగటు (75%)తో పోలిస్తే తెలంగాణలో మాంసాహారులు చాలా ఎక్కువ. రాష్ట్రంలోని మొత్తం జనాభాలో 90% మంది మాంసాహారులే. ఇక్కడి నుంచి విదేశాలకు నాణ్యమైన మాంసం ఎగుమతి అవుతున్నది. దేశంలో 50 శాతానికిపైగా మాంసం తెలంగాణ, ఆంధ్రప్రదేశ్, ఉత్తరప్రదేశ్, పశ్చిమ బెంగాల్, మహారాష్ట్రలోనే ఉత్పత్తి అవుతున్నది. తెలంగాణలో గొర్రెల సంపద గణనీయంగా పెరిగింది. దేశంలో అత్యధిక వృద్ధి రేటు ఇక్కడే ఉన్నది.