Sharmila Tagore | భారతదేశ జాతీయ గేయమైన ‘వందేమాతరం’పై ప్రముఖ బాలీవుడ్ సీనియర్ నటి షర్మిలా టాగూర్ ఆసక్తికరమైన వ్యాఖ్యలు చేశారు. దేశంలోని వివిధ మతాల ప్రజల మనోభావాలను దృష్టిలో ఉంచుకుని.. ఇంతకుముందు కొనసాగించినట్లే ఈ గేయంలోని కేవలం మొదటి రెండు చరణాలను మాత్రమే అధికారికంగా ఉంచాలని ఆమె సూచించారు. ఈ సందర్భంగా పూర్తి గేయాన్ని అందరూ ఆమోదించడం కాస్త కష్టమని ఆమె అభిప్రాయపడ్డారు. భారతదేశంలో ఒక్కడే దేవుడి(ఏకేశ్వరోపాసన)ని గట్టిగా నమ్మే మతస్తులు కోట్లాది మంది ఉన్నారని షర్మిలా టాగూర్ గుర్తుచేశారు.
‘వందేమాతరం’ పూర్తి గీతంలో వివిధ దేవతల ప్రస్తావన వచ్చే చరణాలు ఉంటాయని, ఏకేశ్వరోపాసనను నమ్మే ఇతర మతస్తులకు ఆ పదాలను పలకడం లేదా ఆలపించడం కొంత ఇబ్బందికరంగా మారుతుందని ఆమె వివరించారు. అందువల్ల, దేశంలోని అన్ని వర్గాల ప్రజలను ఐక్యంగా ఉంచేలా మొదటి రెండు చరణాలను మాత్రమే పాటించడం చాలా సముచితమని ఆమె అభిప్రాయపడ్డారు.
మరోవైపు, ప్రముఖ నటుడు ముఖేష్ ఖన్నా కూడా జాతీయ గీతం మరియు జాతీయ గేయంపై మరోసారి వివాదాస్పదా వ్యాఖ్యలు చేశాడు. రవీంద్రనాథ్ టాగూర్ రాసిన ‘జన గణ మన’ గేయాన్ని జాతీయ గీత హోదా నుంచి తొలగించి, దాని స్థానంలో ‘వందేమాతరం’ను జాతీయ గీతంగా స్వీకరించాలని ఆయన డిమాండ్ చేశారు. ‘జన గణ మన’ అనేది బ్రిటన్ రాణి ఎలిజబెత్ అభినందనార్థం రాసిందని, అది మన స్వంతం కాదని ఆయన పేర్కొన్నారు. లతా మంగేష్కర్ అద్భుతమైన గళంతో ఆలపించిన ‘వందేమాతరం’ మాత్రమే మన నిజమైన జాతీయ గేయం అని ముఖేష్ ఖన్నా స్పష్టం చేశారు. ఈ వ్యాఖ్యలపై ప్రస్తుతం సోషల్ మీడియాలో పెద్దఎత్తున చర్చ జరుగుతోంది.